ప్రపంచంలో అతిపెద్ద చిప్స్ కంపెనీ ఎన్విడియా యజమాని, ట్రంప్ మద్దతుదారు జెన్సెన్ హువాంగ్ ఆయన ఎక్కడకు వెళితే అక్కడ ఉంటాడు. ఆ సంస్థ నుంచి కొనుగోళ్లు జరిపే సింగపూర్ కంపెనీ డైరెక్టర్ అలైస్ హువాంగ్‌తో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె చైనా గూఢచారిణి అని వచ్చిన ఆధారంలేని కథనాలు మీడియాలో సంచలన మయ్యాయి. ఇవన్నీ కట్టుకథలని, కమ్యూనిస్టు వ్యతిరేక మెకార్ధీజం మరోసారి రంగంలోకి దిగిందని చైనా తోసిపుచ్చింది. చైనా ఎప్పటినుంచో ఆ కంపెనీ నుంచి అధికారికంగా కొనుగోళ్లు జరిపింది. ఎన్విడియా ఉత్పత్తుల్లో తొంభై శాతం వరకు బీజింగ్‌కు విక్రయించింది. 2022 నుంచి కొన్ని ఆధునిక చిప్స్ అమ్మరాదని అమెరికా ఆంక్షలు విధించటంతో అది యాభై శాతానికి పడిపోయింది. ట్రంప్ హయాంలో ఆంక్షలు సడలించి చిప్స్ ఇస్తామంటే, నీ సరకు మాకు అవసరం లేదని చైనా తిరస్కరించటం బహిరంగ రహస్యం.
ఏడాది కాలంగా అలైస్పై అనుమా నాలున్నా, వారి వివాహేతర సంబంధం అమెరికా భద్రతకు ముప్పు తెస్తుందన్న కథను ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చారన్నది ప్రశ్న.
వ్యాపార లావాదేవీలు జరిపేవారు కలసి తాగటం, క్లబ్బులు, పబ్బులకు వెళ్లటం, వివాహేతర బంధాలు ఏర్పరచు కోవటం అసాధారణం కాదు. అలాంటి సంబంధాలన్నీ అమెరికా భద్రతకు ముప్పైతే, థామస్ జెఫర్సన్ మొదలు డోనాల్డ్ ట్రంప్ వరకు అనేక మంది సంబంధాల సంగతేమిటి? అవేవీ అమెరికా భద్రతకు ముప్పు తెచ్చినట్లు ఎవరూ చెప్పలేదు. ఎన్విడియా చిప్స్ రూపకల్పన, తయారీలో అలైస్ భాగస్వామిగా ఉంటే రహస్యాల కోసం చైనా ఆమెను గూఢచారిగా మార్చుకుందనుకోవచ్చు. కానీ ఆమె చైనాలో జర్నలిస్టుగా, ప్రస్తుతం సింగపూర్‌లో వాణిజ్యవేత్తగా పనిచేయటం బహిరంగ రహస్యం. అందరికీ తెలిసిన ఆమెను గూఢచారిగా నియమించు కొనేంత అమాయకంగా చైనా ఉంటుందా? చైనాతో సహా అనేక దేశాలకు కంప్యూటర్ సేవలందిస్తున్న కంపెనీ ప్రతినిధిగా ఆమె ఉన్నప్పుడు అమెరికా సిఐఏ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు?
సంబంధాలను మెరుగుపరుచుకుంటామని చెబుతూ రెండు దేశాల నేతలు ఈనెలలోనే భేటీ కానున్న నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి రావటానికి రెండు కారణాలు చెబుతున్నారు.
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు మేలు చేసేందుకు ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ ద్వారా కథనాలు వండించారని ఒక వాదన. చైనాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ త్వరలో జరగనున్న ఎపెక్ సమావేశాల్లో బేరమాడేం దుకు దీన్ని తురుపు ముక్కగా వాడుకోవాలన్నది రెండో కారణం. ఇలాంటి చౌకబారు పనులు వాషింగ్టన్కు కొత్త కాదు. చైనా గూఢచార బెలూన్ను తమ భూభాగంపై ఎగురవేసిందని 2023లో జో బైడెన్ సర్కార్ యాగీచేసి తోకముడిచింది. ఎన్విడియా కథనాల గురించి షీ జిన్‌పింగ్‌తో భేటీలో ప్రస్తావించనని ట్రంప్ చెప్పటాన్ని చూస్తే, కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లుగా మీడియా తీరు ఉంది.
అమెరికా, దాని తొత్తు దేశాల ఆంక్షలున్నా చైనా సాంకేతిక విజయాలతో ముందుకు పోతున్నది. చైనీయులు కాపీ రాయుళ్లని, నాసిరకం, నకిలీలు తయారు చేస్తారని, స్క్రూడ్రైవర్ పరిజ్ఞానం తప్ప సొంతంగా తయారు చేసే సత్తా లేదని కొందరు ఆరోపిస్తుంటారు. దాని కొనసాగింపుగానే ఎన్విడియా సెమీకండక్టర్లను అక్రమ పద్ధతుల్లో పొందుతున్నదనే కథలు అల్లుతున్నారు. బీజింగ్ అనేక రంగాల్లో వారికి చుక్కలు చూపుతున్నది.
తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ను విడుదల చేసి తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సెమీకండక్టర్ల రంగంలో తైవాన్, అమెరికా ముందుండగా, తయారీ యంత్రాల్లో నెదర్లాండ్ది ఆధిక్యం. పరిశోధన, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి పశ్చిమ దేశాల సవాలును చైనా స్వీకరించింది. సెమీకండక్టర్ల ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను సమకూర్చుకుందని, 2028 లేదా 2030 నాటికి ఉత్పత్తి ప్రారంభించ వచ్చనే వార్తలు అమెరికాను వణికిస్తున్నాయి. మార్కెట్ కోల్పోతామనే భయంతో చైనాకు ఎగుమతి ఆంక్షలు సడలించాలని అమెరికా టెక్ కంపెనీలు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. మరికొందరు అడ్డుకోవాలని పట్టుపడుతున్నారు. ఈ విషయంలో అమెరికా కంపెనీల మధ్య కూడా పోరు నడుస్తున్నది. ఇది మీడియా సంచలనానికి మరో కారణం కావచ్చు.
గూఢచర్యంలో ఏ దేశమూ తక్కువ కాదు. ప్రతి దేశం గూఢచారులను సమకూర్చుకుంటున్నప్పుడు చైనా దూరంగా ఉంటుందని ఎవరూ అనుకోరు. ట్రంపే అలాంటి వార్తలను కొట్టివేస్తూ, మనం కూడా అదే చేస్తున్నామని అంగీకరించాడు. చైనా జాతీయులను అనేకమందిని సిఐఏ చేర్చుకున్నది ఎవరికీ తెలియనది కాదు.
సిఐఏ కంటే చైనా వ్యవస్థ సమర్థవంత మని పలువురు చెబుతున్నారు. ఆధునిక సెమీకండక్టర్లను అమెరికా అందకుండా చేస్తే, డేటా కేంద్రాల సేవలతో చైనా ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నది. వివాదంలో ఉన్న సింగపూర్ కంపెనీ మెగా స్పీడ్ అలాంటి సేవలనే చైనాలోని ఆలీబాబా వంటి కంపెనీలకు బహిరంగంగా అందించింది. అలాంటప్పుడు గూఢచర్యం ఎందుకు? గత నాలుగేళ్లుగా ఆ సేవలు పొందుతున్న చైనా నుంచి అమెరికా భద్రతకు ముప్పు ఉందని వాషింగ్టన్ చెప్పలేదు. ఇప్పుడు గుండెలు బాదుకోవటం దొంగ ఏడుపులు తప్ప మరొకటి కాదు!
చైనా “గూఢచర్యం” అసలు కథేంటి?
12 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్లు (0)