అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్యంతర ఎన్నికల్లో ప్రజల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. తన విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ప్రజల తీర్పును ఆత్మపరిశీలనకు అవకాశంగా తీసుకోవాల్సింది పోయి, ఓటమికి ఇతరులే కారణమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఒకవేళ పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాడినని ప్రకటించడం ఆయన అహంకార ధోరణికి అద్దం పడుతోంది. ట్రంప్ పాలనలో ఆర్థిక జాతీయవాదం పేరుతో అమలు చేస్తున్న విధానాల వెనుక పెట్టుబడిదారీ ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దిగుమతి సుంకాలు అమెరికా వినియోగ దారులపై అదనపు భారాన్ని మోపి, ధరల పెరుగుదలకు దారితీశాయి.
పరిశ్రమలను కాపాడతామనే నినాదం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ఉపయోగపడుతోంది. ప్రజలకు ఉపాధి, చౌకైన వైద్యం, అందుబాటులో గృహాలు కల్పించాల్సిన ప్రభుత్వం అంతర్జా తీయ ఆధిపత్యం, సైనిక శక్తి ప్రదర్శనలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇరాన్‌తో యుద్ధం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగి సామాన్యుల రవాణా, నిత్యా వసరాల ఖర్చులు భారమయ్యాయి. ప్రజా ధనాన్ని యుద్ధాలకు వెచ్చిస్తూ, ప్రజల ఆర్థిక సమస్యలను పట్టించుకోకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, సైనిక జోక్యాలను సాధనాలుగా ఉపయోగించుకునే అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి ట్రంప్ పాలన కొనసాగింపుగా ఉంది. ఈ విధానాలను అమెరికా ప్రజల్లోని మెజారిటీ వ్యతిరేకిస్తున్నదనే సంకేతం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సైతం ఓటమికి ఇరాన్ యుద్ధం ఒక కారణమని చెప్పడం గమనార్హం.
సొంత పార్టీలోనే ట్రంప్ విధానాలపై అసమ్మతి పెరుగుతోంది. రిపబ్లికన్ నేతలు కూడా యుద్ధం, సుంకాల విధానాలను పునః సమీక్షించాలని కోరుతున్నారు. అయినప్పటికీ ట్రంప్ తన నిర్ణయాలు సరైనవేనని సమర్థించుకోవడం ఆయన మొండివైఖరికి నిదర్శనం. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ప్రాతినిధ్యం పెరగడంతో ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానాలపై విచారణలు, అధికార దుర్వినియోగంపై ప్రశ్నలు, జవాబుదారీతనం కోసం ఒత్తిడి పెరగనుంది. డెమోక్రాట్ల బిల్లులను వీటో చేస్తానని ట్రంప్ హెచ్చరించినప్పటికీ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆపలేరు.
ఈ పరిణామాల మధ్య అమెరికా రాజకీయాల్లో మరో ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంటోంది. పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజాస్వామ్య సోషలిస్టు, ప్రగతిశీల రాజకీయాల పట్ల ముఖ్యంగా యువతలో ఆదరణ పెరుగుతోంది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ముందుకు తెచ్చిన ప్రజా సమస్యల ఎజెండా ఈ మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది.
అందుబాటు ధరల్లో గృహాలు, ఉచిత పిల్లల సంరక్షణ, ప్రజారవాణా, వైద్య సదుపాయాలు, జీవన వ్యయాన్ని తగ్గించడం వంటి అంశాలు రాజకీయ చర్చలో ప్రధాన స్థానాన్ని సంపాదిస్తున్నాయి.బెర్నీ శాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రగతిశీల రాజకీయాలకు ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయి. మిషిగన్‌లో అబ్దుల్ ఎల్-సయీద్, మైన్‌లో ట్రాయ్ జాక్సన్ వంటి ప్రగతిశీల నేతల విజయాలు, ప్రతినిధుల సభలో విల్ లారెన్స్, రాండీ విలెగాస్ వంటి అభ్యర్థుల ఎన్నికలు ఈ రాజకీయ మార్పునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థులకు ఓటేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది తమను ప్రజాస్వామ్య సోషలిస్టులుగా గుర్తించారు. 18 నుంచి 29 ఏండ్ల యువ ఓటర్లలో ఈ సంఖ్య దాదాపు సగానికి చేరడం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం.
సంప్రదాయ పెట్టుబడిదారీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే విధానాల వైపు యువత మొగ్గు చూపుతోంది.
అమెరికా ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం సాగించే యుద్ధాలు, సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులు, కార్పొరేట్ సంస్థల పెత్తనాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది యుద్ధాలు కాదు.. ఉపాధి, వైద్యం, విద్య, గృహవసతి, ఆర్థిక భద్రత. ఈ నేపథ్యంలో ప్రగతిశీల, ప్రజాస్వామ్య సోషలిస్టు రాజకీయాల వైపు పెరుగుతున్న మొగ్గు అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం. ఇప్పటికైనా ట్రంప్ ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే ఆయన రాజకీయ ఒంటరితనం మరింత పెరుగుతుంది. ప్రజల సమస్యలను విస్మరించి మొండిగా పాలన సాగించే ఏ నాయకుడికైనా చివరకు ప్రజల తీర్పు గుణపాఠం చెబుతుంది.
ట్రంప్ వైఖరి మారేనా?
32 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026 | 3 నిమిషాల చదవడం




కామెంట్లు (0)