Magazines

భూములమ్మి పాలన సాగిస్తారా?

15 నిమిషాల క్రితం

administration
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 3 నిమిషాల చదవడం

ఆదాయ, వ్య‌యాలు.. వ్య‌క్తికైనా, వ్య‌వ‌స్థ‌కైనా ఈ రెండూ చాలా కీల‌కం. ఈ రెంటినీ బేరీజు వేసుకుని ముందుకు సాగ‌టం అత్యంత కీల‌కం. ఇందులో విఫ‌ల‌మైతే మొత్తం ప‌రిస్థితే త‌ల‌కిందుల‌వ‌టం ఖాయం. పాల‌కులు ఈ విష‌యాన్ని మ‌రింతగా గుర్తెర‌గాలి. ఎందుకంటే వారు సంక్షేమం, అభివృద్ధిని స‌మ‌పాళ్ల‌లో న‌డిపించాలి గ‌నుక‌. ఇందుకోసం వాస్త‌వ ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేయ‌టం, వాటిక‌నుగుణంగా జ‌మా ఖ‌ర్చుల‌ను చూసుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి. కానీ, ఈ విష‌యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. వ‌చ్చే నెల‌తో ముచ్చ‌ట‌గా మూడేండ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుని, నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఖ‌జానా తీరు తెన్నుల‌ను నిశితంగా ప‌రిశీ లించ‌టం ఎంతైనా అవ‌స‌రం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే... మియాపూర్‌లో ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతుల్లోని 550 ఎక‌రాల భూములు ప్ర‌భుత్వానికి చెందిన‌వే అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఆ మ‌రుస‌టి రోజే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ... ‘మియాపూర్ భూముల్ని విక్ర‌యిస్తాం’ అంటూ ప్ర‌క‌టించారు. ఈ అంశంపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం అధ్య‌య‌నం చేస్తుంద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. ఇది అత్యంత విస్మ‌య‌క‌రం. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంల‌లోనే హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని వేలాది ఎక‌రాల భూముల‌ను విక్ర‌యించారు. మ‌రి కొన్నింటిని క‌బ్జా రాయుళ్లు కైంక‌ర్యం చేశారు. పేద‌ల‌కు పంచ‌టానికి ఈ జిల్లాల్లో భూములే లేవంటూ వారు సెల‌విచ్చారు. రియ‌లెస్టేట్ మాఫియా విజృంభ‌ణ‌తో గ‌జం భూమి రూ.ల‌క్ష‌లు ప‌లుకుతోంది. సామాన్యుడు కొనుక్కుందామంటే జానెడు జాగా లేని, ఉన్నా కొన‌లేని దుస్థితి. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అని వాగ్దానం చేసిన బీఆర్‌ఎస్ సైతం...

హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల భూములే లేవంటూ చేతులెత్తేసింది. ఆ మాట‌ కొస్తే... ఒక్క హైద‌రాబాదే కాదు, రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కొన‌టా నికి భూముల్లేవ‌ని, అందు వ‌ల్లే తాము ద‌ళితుల‌క మూడెక‌రాలు పంచ‌లేక‌ పోతున్నా మ‌ని ఆనాటి సీఎం కేసీఆర్ సెల‌విచ్చారు. పైగా ఔట‌ర్ రింగు రోడ్డును తాక‌ట్టు పెట్ట‌డం ద్వారా రూ.7,500 కోట్లను స‌మకూర్చుకుని, ఆ నిధుల‌ను రైతు బంధుకు మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ‌లెదుర్కొ న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పోక‌డపోతే... నాటికి నేటికి తేడా ఏముంది? మియాపూర్ భూముల‌ను అమ్మ‌కానికి పెట్టి, ఆ డ‌బ్బుతో విద్య‌, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధికి వినియోగిస్తా మంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్ప‌టం విడ్డూరంగా ఉంది. ఇలా నిధుల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకుంటూ పోతే... భ‌విష్య‌త్ త‌రాల‌కు జానెడు జాగా కూడా ఉండ‌ని దుస్థితి నెల‌కొంటుంది. సంక్షేమం, అభివృద్ధి ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను జోడెడ్ల‌లాగా ప‌రుగులు పెట్టించాల్సిందే. ఇందులో కాద‌న‌టానికి ఏమీ లేదు.

కానీ ఆ పేరుతో ముందుచూపు, దూర‌దృష్టి లేకుండా వ్య‌వ‌హ‌రించ‌టం స‌ముచితం కాదు. ప్ర‌భుత్వానికి వివిధ మార్గాల ద్వారా రోజువారీగా, ఆ చొప్పున నెల‌కు ఎంత ఆదాయ‌మొస్తుంది? అందులో జీతభ‌త్యాలు, కార్యాల‌యాల నిర్వ‌ హ‌ణ‌, అప్పులు, వ‌డ్డీల చెల్లింపుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లేసుకుని వాటి ఆధారంగా ప‌రిపాల‌న సాగించాల్సి ఉంటుంది. వాస్త‌వానికి ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.3.04 కోట్ల ఆదాయ‌మొస్తుంద‌ని స‌ర్కార్ అంచ‌నాలేసుకుంది. కానీ అందులో సెప్టెంబ‌రు నాటికి రూ.1.36 ల‌క్ష‌ల కోట్లే వ‌చ్చాయి. మిగ‌తా ఆర్నెల్ల‌లో రూ.1.68 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం వ‌స్తుందా? రాదా? అనేది వేచి చూడాలి. ఇదిగాక రూ.15,096 కోట్ల రెవెన్యూ మిగులుంటుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నాలేసుకుంటే, సెప్టెంబ‌రు నాటికే రూ.6,857 కోట్ల రెవెన్యూ లోటుకు ఖ‌జానా వెళ్లిపోయింది. రూ.61,457 కోట్ల అప్పులు తేవాల‌ని భావిస్తే.. అందులో ఇప్ప‌టికే రూ.44,612 కోట్ల రుణాల‌ను తీసుకున్నాం.

ఈ ఒక్క‌దాంట్లోనే మ‌నం స‌క్సెస్‌ అయ్యామ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలా ప్ర‌భుత్వానికి అనేక ఆర్థిక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. ఖ‌జానా మీద ఒక్కోసారి విప‌రీత‌మైన భారం ప‌డుతోంది. ఇలాంటి స్థితిలోనే ప్ర‌త్యామ్నాయ ఆర్థిక వ‌న‌రుల‌ను సృష్టించు కోవ‌టం ప్ర‌భుత్వాల విధి. ఇందుకోసం జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కూ నిపుణుల‌ను సంప్ర‌దించాలి. అన్ని పార్టీలు, సంఘాల‌తో చ‌ర్చించి, సూచ‌నలు తీసుకోవాలి. త‌ద‌నుగుణంగా ఒక నిర్దిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ రూపొందించుకుని అమ‌లు చేయాలి త‌ప్ప ఉన్న వ‌న‌రుల‌ను అమ్ముకుంటూ పోతే చివ‌రికేమీ మిగ‌ల‌దు. ఈ వాస్త‌వాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించాలి. తెలంగాణ‌కు రావాల్సిన నిధులు, గ్రాంట్లు, ఇత‌ర ఆర్థిక సాయాల‌పై కేంద్రంపై కొట్లాడాలి. అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి అఖిల‌ప‌క్షాన్ని తీసుకెళ్లి, తాడో పేడో తేల్చుకోవాలి. ఇలా చేస్తేనే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గాడిన ప‌డుతుంది. లేదంటే మూడడుగులు ముందుకు, ఆర‌డులు వెన‌క్కు అనే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్