Magazines

అస్సాం టీ తోటల్లో అక్షరదీపం

56 నిమిషాల క్రితం

Tea Gardens
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 5 నిమిషాల చదవడం

పుస్తకమే ఆయుధంగా.. గ్రంథాలయమే వేదికగా.. విద్యకు దూరమైన బాలల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న ఓ యువతి స్ఫూర్తిదాయక ప్రస్థానం ఇది. సుమారు వెయ్యి పుస్తకాలు, రూ. 40 లక్షలకు పైగా కుటుంబ పెట్టుబడి, ఏడు గ్రామాల పిల్లల్లో చదువుపై కొత్త ఆశలు. అస్సాంలోని టీ తోటల్లో తెల్లవారుజాము నుంచి చీకటి పడే వరకు కార్మికులు చెమటోడ్చుతారు. కుటుంబానికి పట్టెడన్నం పెట్టేందుకు, పిల్లల ఆకలి తీర్చేందుకు, జీవితాన్ని నెట్టుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే ఈ జీవన పోరాటంలో పిల్లల చదువు చాలాసార్లు వెనుకబడిపోతోంది. జీవనోపాధి కోసం సాగించే పోరాటం వారి బాల్యంలోని విద్యా అవకాశాలను మింగేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించాలనే సంకల్పంతో ముందుకొచ్చారు ఆనందితా గొగోయ్.


ఓ పరిశీలన.. ఎన్నో ప్రశ్నలు.. ఒక గొప్ప సంకల్పం.. ఆనందితా గొగోయ్ చరిత్రలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత సోషల్‌ ‌వర్క్‌లో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో 2020లో అస్సాంలోని టీ తోటలను సందర్శించారు. నాగాలాండ్ సరిహద్దుకు సమీపంలోని ఎగువ అస్సాంలో, చరైదేవ్ జిల్లాలోని కనుబారి టీ ఎస్టేట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోని కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేయడం ఆమె పర్యటన ఉద్దేశం. కానీ అక్కడ ఆమె కళ్లకు కనిపించిన పిల్లల పరిస్థితి ఆమె మనసుపై చెరగని ముద్ర వేసింది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించాయి. వాటికి సమాధానాలను వెతుకుతూ ఆమె ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు చదువును బలవంతంగా నేర్పించడం కాదు.. చదువుపై ప్రేమను పెంచాలి. పాఠశాలకు వెళ్లలేని పిల్లలకు ముందుగా నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాలి. ఆ ఆలోచన నుంచే ఒక చిన్న వీధి గ్రంథాలయం ఆవిర్భవించింది.

వంద పుస్తకాలతో మొదలైన అక్షరయజ్ఞం

భోగ్‌బారి గ్రామంలోని తన నివాసంలో ఆనందితా 100 పుస్తకాలతో ఒక వీధి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. వనరులు తక్కువే.. పుస్తకాలు తక్కువే.. కానీ ఆమె ఆశయం మాత్రం అపారమైనది. పిల్లలు స్వేచ్ఛగా వచ్చి పుస్తకాలను తాకాలి, బొమ్మలను చూడాలి, కథలను చదవాలి, ఆటలాడాలి, ప్రశ్నలు అడగాలి, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలి. ఇదే ఆమె లక్ష్యం. మొదట్లో పెద్దలకు, పిల్లలకు సంబంధించిన పుస్తకాలను ఒకే చోట అందుబాటులో ఉంచారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరగడంతో వారికి ప్రత్యేకమైన అభ్యసన వాతావరణం అవసరమని గుర్తించారు. దీంతో టొట్టో-చాన్ బాలల గ్రంథాలయాన్ని, అనంతరం టొట్టో-చాన్ కమ్యూనిటీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మూడు గ్రంథాలయాలు టొట్టో-చాన్ కమ్యూనిటీ లైబ్రరీ అనే నమోదిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. నేడు సుమారు 10,000 పుస్తకాలతో విస్తరించింది. ఈ పుస్తకాలన్నింటినీ ఆనందితా తన సొంత డబ్బుతో కొనుగోలు చేయడం విశేషం. పుస్తకాల సంఖ్య పెరగడం ఒక విజయమైతే, ఆ పుస్తకాల మధ్యకు పిల్లలు రావడం అసలైన విజయం. ఎందుకంటే పుస్తకం చేతిలోకి వచ్చినప్పుడు పిల్లల ముందు కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది. ఒక కథ వారి ఊహాశక్తిని పెంచుతుంది. ఒక చరిత్ర పుస్తకం వారి గతాన్ని పరిచయం చేస్తుంది. ఒక విజ్ఞాన పుస్తకం వారి ప్రశ్నలకు సమాధానాలను వెతకడం నేర్పుతుంది. అలా గ్రంథాలయం పిల్లల జీవితాల్లో నిశ్శబ్దంగా మార్పును తీసుకొస్తోంది.

పాఠాలపై ప్రేమను పెంచే గ్రంథాలయం

చిన్నారులకు చరిత్ర, భూగోళశాస్త్రం వంటి విషయాలను నేర్పించేటప్పుడు కేవలం పుస్తకాల్లోని పాఠాలను చదివించడం సరిపోదని ఆనందితా బృందం భావించింది. ముఖ్యంగా పాఠశాల అనుభవం లేని పిల్లలకు నేర్చుకోవడం ఒక భారంగా కాకుండా ఆనందంగా అనిపించాలి. అందుకే కళలు, ఆటలు, చేతిపనులు, నాటకాలు వంటి సృజనాత్మక పద్ధతులను బోధనలో భాగం చేశారు. టెర్రకోటా కళ, అస్సాం సంప్రదాయమైన చేతితో తయారు చేసే ముఖా ముసుగుల కళ, మండల చిత్రాలు, వర్లీ జానపద కళ, మట్టి, అద్దాల ముక్కలతో రూపొందించే లిప్పన్ కళ వంటి కార్యకలాపాల ద్వారా పిల్లలకు సృజనాత్మకతను పరిచయం చేస్తున్నారు. పజిల్స్, ఆటల ద్వారా భూగోళశాస్త్రం, చరిత్ర వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు.

గ్రంథాలయం నుంచి పాఠశాలకు

ఆనందితా సేవలు పుస్తకాల పంపిణీతోనో, గ్రంథాలయ నిర్వహణతోనో ముగియ లేదు. అసలు లక్ష్యం పిల్లలు విద్యావంతులుగా ఎదగడం. అందుకే పాఠశాలలో ఎప్పుడూ చేరని పిల్లలను, మధ్యలో చదువు మానేసిన వారిని తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడానికి ఆమె బృందం కృషి చేస్తోంది. పాఠశాల గడప తొక్కని చిన్నారి ఒకరోజు పుస్తకాన్ని చేతిలో పట్టుకోవడం ఒక మార్పు. అదే చిన్నారి పాఠశాలలో చేరి తరగతి గదిలో కూర్చోవడం మరో ముందడుగు. ఆ చిన్నారి చదువును కొనసాగించి తన కాళ్లపై తాను నిలబడగలిగే స్థాయికి చేరుకోవడం అసలైన విజయం. ఈ మార్పు ఒక్కరోజులో రాదు. దానికి ఓపిక కావాలి, నిరంతర శ్రమ కావాలి, పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. ఆనందితా బృందం చేస్తున్నది అదే. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా కూడా ఆనందితా బృందం పఠన సంస్కృతిని విస్తరిస్తోంది. కనుగావ్ టీ ఎస్టేట్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ఆ ప్రాంతంలోని టీ ఎస్టేట్‌లో జరిగిన తొలి కార్యక్రమంగా నిలిచింది. పుస్తకాలను గ్రంథాలయంలో ఉంచడమే కాకుండా, ప్రజల వద్దకు తీసుకెళ్లడం ద్వారా చదువును సామాజిక ఉద్యమంగా మార్చే ప్రయత్నం ఇది.

రూ. 40 లక్షల పెట్టుబడి వెనుక

ఆనందితా ఇల్లు నేడు ఓ గ్రంథాలయంగా మారింది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన, ముఖ్యంగా టీ కార్మిక కుటుంబాల పిల్లలు ప్రతిరోజూ 90 నుంచి 100 మంది వరకు అక్కడికి వస్తున్నారు. పుస్తకాలతో గడుపుతున్నారు. కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. తమ కలలకు కొత్త రూపాన్ని ఇచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆనందితా, ఆమె కుటుంబ సభ్యులు కలిపి రూ. 40 లక్షలకు పైగా వెచ్చించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం ఖర్చును కుటుంబమే భరించింది. ఆనందితా తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన పదవీ విరమణ ప్రయోజనాల నుంచి రూ. 14 లక్షలను ఈ కార్యక్రమానికి అందించారు. ఆ మొత్తంతో ప్రత్యేక గ్రంథాలయ భవన నిర్మాణానికి నిధులు సమకూరాయి. ఆనందితా తండ్రి కూడా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడే. ఆయన సైతం ఈ ప్రయత్నానికి అండగా నిలిచారు.

అస్సామీ పత్రికల సంరక్షణ

ఆ గ్రంథాలయంలో మరో విశేషమైన సంపద ఉంది. 1947 నుంచి వెలువడిన అస్సామీ పత్రికలను సేకరించి భద్రపరిచారు. ఇది కేవలం పుస్తకాల సేకరణ కాదు. ఒక సమాజపు చరిత్రను, సంస్కృతిని, ఆలోచనల పరిణామాన్ని భవిష్యత్తు తరాలకు అందించే విలువైన ప్రయత్నం. పుస్తకాలు మనకు జ్ఞానాన్ని అందిస్తే, పాత పత్రికలు ఒక కాలపు సామాజిక, సాంస్కృతిక జీవితానికి అద్దం పడతాయి. కాలం మారుతున్న కొద్దీ అనేక పత్రికలు కనుమరుగవుతాయి. వాటి సంచికలు భద్రపరచకపోతే భవిష్యత్ పరిశోధకులకు, పాఠకులకు విలువైన సమాచారం అందకుండా పోవచ్చు. ఈ నేపథ్యంలో 1947 నుంచి ప్రచురితమైన అస్సామీ పత్రికల సేకరణను సంరక్షించడం గ్రంథాలయ సేవలో ఒక ముఖ్యమైన కోణం. పిల్లల చదువును ప్రోత్సహించడంతో పాటు, ప్రాంతీయ భాషా సాహిత్యాన్ని, పత్రికా చరిత్రను కాపాడటం ద్వారా ఈ గ్రంథాలయం రెండు తరాల మధ్య జ్ఞాన వారధిగా నిలుస్తోంది. నేటి చిన్నారులకు పుస్తకాలను పరిచయం చేస్తూనే, రేపటి పరిశోధకులకు అవసరమైన సమాచారాన్ని కూడా భద్రపరుస్తోంది.

ఇంకా పదేండ్ల ప్రయాణం

తన ప్రయత్నాలతో కొంత మార్పు కనిపిస్తున్నప్పటికీ, టీ కార్మిక కుటుంబాల్లోని ప్రతి చిన్నారిని పాఠశాలకు చేర్చడం సుదీర్ఘమైన ప్రయాణమని ఆనందితా అర్థం చేసుకున్నారు. ప్రతి టీ కార్మిక కుటుంబంలోని బిడ్డ పాఠశాలలో చేరే పరిస్థితి రావడానికి మరో పదేండ్లు పట్టవచ్చని ఆమె అంచనా. ఈ సమస్యకు మూలం కేవలం చదువుపై ఆసక్తి లేకపోవడం కాదు. దాని వెనుక కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల సుదీర్ఘ పనిగంటలు, విద్యా అవకాశాల కొరత వంటి అనేక అంశాలున్నాయి. రోజంతా శ్రమించి కుటుంబాన్ని పోషించాల్సిన తల్లిదండ్రులు తమ పిల్లల చదువును నిరంతరం పర్యవేక్షించలేకపోతున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా వారిని నిందించడం పరిష్కారం కాదు. ఆ కుటుంబాలకు అండగా నిలిచి, పిల్లలకు విద్య అందేలా చేయడం నిజమైన పరిష్కారం. పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే విద్య ఉంటేనే తమ హక్కులను తెలుసుకోగలరు, తమ సమస్యలను అర్థం చేసుకోగలరు, తమ జీవితాలను మార్చుకునే మార్గాలను అన్వేషించగలరు.


- డా. రవి కుమార్ చేగొని, 9866928327 కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్