Magazines

రష్యా విప్లవ స్ఫూర్తి - భారత ఉద్యమాలకు దిక్సూచి

17 నిమిషాల క్రితం

Indian
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 5 నిమిషాల చదవడం

ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చివేసిన అక్టోబర్ మహా సోషలిస్టు విప్లవానికి నవంబర్ 7తో 109 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1917లో రష్యాలో కార్మికులు, రైతులు సాధించిన ఈ విప్లవం ఒక దేశంలో అధికార మార్పునకు మాత్రమే పరిమితమైన ఘటన కాదు. శతాబ్దాలుగా కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని ప్రపంచం ముందుంచిన చారిత్రక పరిణామం. కార్మికులు, రైతులు, మహిళలు, ఇతర శ్రమజీవులు సంఘటితమైతే రాజ్యాధికారాన్ని చేపట్టి సమాజాన్ని మార్చగలరని నిరూపించిన విప్లవం. నేడు పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, కార్మిక హక్కులపై దాడులు, మహిళల అణచివేత, భారతదేశంలో జెన్‌జీ ఉద్యమం నేపథ్యంలో అక్టోబర్ విప్లవ స్ఫూర్తిని మరోసారి సమీక్షించుకోవడం అవసరం. 1917కు ముందు రష్యాలో జార్ చక్రవర్తి నిరంకుశ పాలన కొనసాగింది.

భూములు కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమయ్యాయి. కేవలం 28 వేల మంది పెద్ద భూస్వాముల ఆధీనంలో సుమారు 16.74 కోట్ల ఎకరాల భూమి ఉండేది. కోట్లాది రైతులు దుర్భర జీవితాలు గడిపేవారు. పరిశ్రమల్లో కార్మికులు చాలీచాలని వేతనాలకు సుదీర్ఘ గంటలు పనిచేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రజల కష్టాలను మరింత పెంచింది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, యుద్ధ మరణాలు ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. 1917 ఫిబ్రవరి తిరుగుబాటుతో జార్ పాలన కూలిపోయినా, అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్ పార్టీ ‘భూమి-శాంతి-రొట్టె’, ‘అధికారమంతా సోవియట్లకే’ అనే నినాదాలతో కార్మికులు, రైతులు, సైనికులను సంఘటితం చేసింది.

పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న అంటే ప్రస్తుత గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7న విప్లవం విజయవంతమై కార్మికవర్గ నాయకత్వంలో సోషలిస్టు రాజ్యం ఏర్పడింది. విప్లవంలో మహిళల అసాధారణ పాత్ర ఫిబ్రవరి విప్లవానికి పెట్రోగ్రాడ్‌లో మహిళా కార్మికుల ఆందోళనలు ప్రధాన ప్రేరణగా నిలిచాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రొట్టె, శాంతి కోసం వారు ప్రారంభించిన సమ్మెలు దేశవ్యాప్త ఉద్యమంగా విస్తరించి జార్ పాలన పతనానికి దారితీశాయి. విప్లవానికి ముందు రష్యాలో మహిళలు రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తూ లైంగిక వేధింపులు, ఉద్యోగ అభద్రత, పితృస్వామ్య అణచివేతను ఎదుర్కొన్నారు. మధ్య ఆసియాలో బాల్యవివాహాలు, వధువుల కొనుగోలు, బహుభార్యత్వం, పరదా వంటి ఆచారాలు వారి స్వేచ్ఛను హరించాయి.

అక్టోబర్ విప్లవం తరువాత మహిళలకు సమాన హక్కులు, సమాన పనికి సమాన వేతనం, విడాకుల హక్కు, ప్రసూతి ప్రయోజనాలు కల్పించే చర్యలు చేపట్టారు. విద్య, అక్షరాస్యత, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను విస్తరించారు. భూమి, నీటి వనరులపై మహిళల హక్కులను గుర్తించారు. 1927లో ఉజ్బెకిస్తాన్‌లో 90 వేల మంది మహిళలు పరదా ముసుగులను తొలగించి స్వేచ్ఛ వైపు అడుగులు వేశారు. సంప్రదాయవాద శక్తుల దాడులు, హత్యలను ఎదుర్కొంటూనే తమ పోరాటాన్ని కొనసాగించారు. 1928-1932 మధ్య కొత్తగా ఉపాధి పొందిన 40 లక్షల మందిలో 14 లక్షల మంది మహిళలు పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించి ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, నిర్వాహకులుగా ఎదిగారు. మహిళా విముక్తికి చట్టబద్ధ సమానత్వంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక చైతన్యం, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేక పోరాటం కూడా అవసరమని అక్టోబర్ విప్లవ అనుభవాలు చాటిచెప్పాయి.

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్ నిరక్షరాస్యత నిర్మూలన, సార్వత్రిక విద్య, ఉచిత వైద్యం, పారిశ్రామి కీకరణ, ఉపాధి విస్తరణలో విశేష పురోగతి సాధించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ ఫాసిజాన్ని ఓడించడంలో సోవియట్ ప్రజలు, ఎర్రసైన్యం నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఈ పోరాటంలో రెండు కోట్ల మందికి పైగా సోవియట్ ప్రజలు, సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జాతీయ విముక్తి ఉద్యమాలకు ఈ విప్లవం ప్రేరణనిచ్చింది. పెట్టుబడిదారీ దేశాల్లో కూడా కార్మికోద్యమాల ఒత్తిడితో విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి సంక్షేమ విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. భారత స్వాతంత్య్రోద్యమంపై ప్రభావం భారత స్వాతంత్య్ర పోరాటంపై అక్టోబర్ విప్లవం విశేష ప్రభావం చూపింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తున్న ప్రజలకు రష్యా విప్లవం కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. 1918 తరువాత భారతదేశంలో కార్మికోద్యమం కొత్త దశకు చేరుకుంది.

1920లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడింది. అదే ఏడాది అక్టోబర్ 17న తాష్కెంట్‌ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. భగత్‌సింగ్, ఆయన సహచరులు లెనిన్ ఆలోచనలతో ప్రభావితమయ్యారు. నెహ్రూ, పెరియార్ సోవియట్ అనుభవాలపై ఆసక్తి చూపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రష్యా పర్యటన అనంతరం అక్కడి విద్యాభివృద్ధిని ప్రశంసించారు. సుబ్రహ్మణ్య భారతి ‘నూతన రష్యా’ గేయాన్ని రచించారు. ఎంఎన్ రాయ్, అబనీ ముఖర్జీ, ముజఫర్ అహ్మద్, ఎస్‌ఏ డాంగే, సింగారవేలు చెట్టియార్, పుచ్చలపల్లి సుందరయ్య, ఇఎంఎస్ నంబూద్రిపాద్ తదితర కమ్యూనిస్టు నాయకులపై అక్టోబర్ విప్లవ ప్రభావం ఉంది. స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, భూసంస్కరణలు, కార్మిక హక్కులు, ఆర్థిక సమానత్వం కూడా కావాలనే భావన బలపడింది. మన దేశానికి విప్లవమిచ్చే పాఠం 109 సంవత్సరాల తరువాత కూడా అక్టోబర్ విప్లవం లేవనెత్తిన ప్రశ్నలు ప్రాసంగికంగానే ఉన్నాయి.


మన దేశంలో అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి? సంపద సృష్టించే కార్మికులకు న్యాయమైన వాటా దక్కుతున్నదా? యువతకు గౌరవప్రదమైన ఉపాధి లభిస్తున్నదా? మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక భద్రత అందుతున్నాయా? 2024 జాతీయ సమయ వినియోగ సర్వే ప్రకారం 15-59 సంవత్సరాల మహిళల్లో 92.9 శాతం మంది వేతనం లేని గృహసేవల్లో పాల్గొంటున్నారు. వారు రోజుకు సగటున 305 నిమిషాలు ఈ పనులకు వెచ్చిస్తుండగా, పురుషులు 86 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నారు. మహిళలపై కుటుంబ శ్రమభారం ఎంత అధికంగా ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సమాన వేతనాలు, ప్రసూతి రక్షణ, శిశు సంరక్షణ కేంద్రాలు, మహిళలపై హింస నిరోధం, కుటుంబ బాధ్యతల సమాన పంపిణీ కోసం ఉద్యమించాలి. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అసంఘటిత, గిగ్ కార్మికుల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత నేటి కార్మికోద్యమ ప్రధాన అంశాలుగా మారాలి.

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక చట్టాల అమలు, సురక్షిత పని పరిస్థితులు, కార్మిక సంఘాల హక్కుల కోసం పోరాటాలను బలోపేతం చేయాలి. ప్రజా ఉద్యమాల నిర్మాణంలోనూ మార్పు అవసరం. ప్రజల తక్షణ సమస్యలను విస్తృత సామాజిక మార్పు లక్ష్యాలతో అనుసంధానించడమే అక్టోబర్ విప్లవం నేర్పిన ముఖ్యమైన పాఠం. ‘భూమి-శాంతి-రొట్టె’ నినాదం ఆనాటి రష్యా ప్రజల జీవిత సమస్యలను ప్రతిబింబించింది. భారతదేశంలోనూ ఉపాధి, భూమి, విద్య, వైద్యం, ఆహార భద్రత, గృహవసతి, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజా ఉద్యమాల కేంద్రంగా మార్చాలి. కేవలం నిరసన కార్యక్రమాలకే ఉద్యమాలను పరిమితం చేయకుండా పరిశ్రమలు, గ్రామాలు, పట్టణ బస్తీలు, పని ప్రదేశాలు, విద్యాసంస్థల్లో ప్రజలతో నిరంతర సంబంధాలను నిర్మించాలి. కార్మిక-రైతు ఐక్యతను బలోపేతం చేస్తూ మహిళలు, యువత, దళితులు, ఆదివాసీలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ఉమ్మడి కార్యాచరణలో భాగం చేయాలి.

కార్మిక సంఘాల్లో మహిళలకు నాయకత్వ అవకాశాలు పెంచాలి. యువతలో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని అభివృద్ధి చేయాలి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, దాని వెనుక ఉన్న కార్పొరేట్, మతోన్మాద శక్తుల ప్రభావంతో రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలను ప్రశ్నిస్తూ జెన్‌జీ ఉద్యమం రేకెత్తిస్తున్న ఆశలు సమాజానికి కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో ప్రజల మధ్య విభజనలను అధిగమించి రాజ్యాంగ విలువలు, లౌకికతత్వం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విశాల ఐక్యతను నిర్మించాలి. విజయాల నుంచి స్ఫూర్తి.. వైఫల్యాల నుంచి గుణపాఠాలు అక్టోబర్ విప్లవం ద్వారా ఏర్పడిన సోవియట్ యూనియన్ 1991లో విచ్ఛిన్నమైంది. ఈ పరిణామాన్ని విస్మరించకుండా విమర్శనాత్మకంగా అధ్యయనం చేయాలి.

ఆర్థిక నిర్వహణలో లోపాలు, శాస్త్ర సాంకేతిక మార్పులకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేయలేకపోవడం, అధికార యంత్రాంగంలో బ్యూరోక్రసీ పెరగడం, సోషలిస్టు ప్రజాస్వామ్యం అమలులో వైఫల్యాలు కీలక సమస్యలుగా నిలిచాయని మార్క్సిస్టు విశ్లేషణ పేర్కొంటుంది. ప్రజల భాగస్వామ్యం, విమర్శ నాత్మక చర్చలకు అవకాశం లేకుండా ఏ సామాజిక వ్యవస్థా సజీవంగా ముందుకు సాగలేదనే గుణపాఠం ఇందులో ఉంది. ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉద్యమాల అంతర్భాగాలుగా ఉండాలి. అక్టోబర్ విప్లవాన్ని స్మరించుకోవడమంటే గతాన్ని కీర్తించడం మాత్రమే కాదు. వర్తమాన సమస్యలను అర్థం చేసుకొని భవిష్యత్తుకు మార్గాన్ని నిర్మించుకోవడం. దోపిడీ, పేదరికం, అసమానతలు శాశ్వతమైనవి కావని ప్రపంచానికి చాటిచెప్పిన ఆ విప్లవ స్ఫూర్తిని నేటి భారత పరిస్థితులకు అన్వయించుకోవాలి. కార్మికులు, రైతులు, మహిళలు, యువత తమ హక్కుల కోసం సంఘటితమై, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ సమానత్వం కోసం పోరాడాలి. విశాలమైన, ప్రజాస్వామ్య యుతమైన, సంఘటిత ప్రజా ఉద్యమాల నిర్మాణమే ‘అక్టోబర్ విప్లవం’ మనకిచ్చే నిజమైన స్ఫూర్తి.


కందారపు మురళి, 9490098840

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్