Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందూరు పంతం.. ఇందిరమ్మ రాజ్యం అంతం

ఇందూరు పంతం.. ఇందిరమ్మ రాజ్యం అంతం

- Advertisement -

లోకల్ వార్ వన్ సైడ్, కాంగ్రెస్, బీజేపీ పతనం డిసైడ్ 
స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో 
రేవంత్‌ సర్కార్‌ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు 
గాల్లో కలిసిన కాంగ్రెస్ ఎన్నికల హామీలు
కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేవరకూ నిద్రబోం 
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 
నవతెలంగాణ – కంటేశ్వర్

ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకల్ ’వార్’ వన్ సైడ్, కాంగ్రెస్, బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అని ఆయన పేర్కొన్నారు.

’కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, బీఆర్ఎస్ క్లీన్ స్వీఫ్..

రేవంత్‌ సర్కార్‌ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అని అన్ని గ్రామాలు నినదిస్తున్నా యన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసి పోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు.రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉందన్నారు.  

రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని, రేవంత్‌ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో చెత్తా చెదారం, పందులు,దోమలు విహారం చేస్తూ వ్యాధులు ప్రబలుతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని, ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ  తెలంగాణ కేసీఆర్ హయాంలో ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది అని ప్రశ్నించారు. ఈనగాచి నక్కలపాలు చేసినట్లయిందని, పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. అవినీతి, అణచివేత, కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప. అణాపైసంత అభివృద్ధి ఉందా? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ హయాంలో ‘ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం’ వెల్లివిరియగా రేవంత్ హయాంలో ‘ ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం ఆవరించిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి కేసీఆర్ పదేళ్ల ప్రగతి వైభవం మసకబారిందన్నారు. ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ సర్కార్ పాతరేసిందని, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఆయన ఎద్దేవా చేశారు.

పేదలకు రూ.4000 పెన్షన్ రావడంలేదని, ఆడబిడ్డలకు రూ.2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం అమలు కావడం లేదని, అన్నదాతలకు రుణమాఫీ కాలేదని, రైతన్నలకు రూ.15,000 రైతుభరోసా ఎగ్గొట్టారని,

మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా రావడం లేదని, పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడం లేదని, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వలేదని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందని ద్రాక్షగా మారాయని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని, జాబ్‌ క్యాలెండర్‌ గోడలకు వేలాడుతున్నదని, రూ.4,000 నిరుద్యోగ భృతి గంగలో కలిసిందని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యంలో బుల్డోజర్ మాత్రం ఇంటింటికి వచ్చి ప్రజల బతుకులను కూల్చివేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణ యుగం కాగా, రేవంత్ పాలన రాతి యుగాన్ని తెచ్చిందని ఆయన చెప్పారు.

హామీ ఇవ్వక పోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశామన్నారు.

రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24గంటల కరెంట్, ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థలలో సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు మళ్లీ కావాలంటే మళ్ళీ బీ ఆర్ఎస్ రావాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్ళుతామని,

పదేళ్ల బీ ఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు విడమర్చి వివరిస్తామని ఆయన వెల్లడించారు. కాగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల ఆగడాలే కనిపిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల దోపిడీ పర్వం కొనసాగు తోందన్నారు.

నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం..

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేవరకూ నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు. ఏవో పనికిమాలిన పార్టీల్లో బీ ఆర్ఎస్ విలీనం అంటూ చెత్త ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విలీనం కాదు కదా ఏ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోమని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రేతాత్మలు అని, అవి తెలంగాణకు పట్టిన శనిగొట్టుపార్టీలని ఆయన ధ్వజమెత్తారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్నారు.

త్వరలో జిల్లాంతా తిరిగి స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తా..

ఇదిలా ఉండగా తాను త్వరలో జిల్లాంతా తిరిగి గులాబీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆపదకాలంలోనూ పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.ఇందిరమ్మ రాజ్యం వద్దు కేసీఆర్ రాజ్యం ముద్దు అన్నది తెలంగాణ ప్రజల నినాదంగా ముందుకు పోతామన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోన్న మోసాలను ఎండగడుతామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్ళుతాం తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారు,సారు కేసీఆర్ రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు .

నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధం..

నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధమని జీవన్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీకి తొలి అధికార పదవినందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదేనని గుర్తు చేశారు. సంతోష్ రెడ్డిని జిల్లాపరిషత్ ఛైర్మన్ ను చేసుకొని బీ ఆర్ఎస్ విజయానికి శ్రీకారం చుట్టిన చరిత్ర నిజామాబాద్ జిల్లాకు దక్కిందన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడంలోనూ నిజామాబాద్ జిల్లాదే ప్రధాన పాత్ర అని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్,మాస్త ప్రభాకర్,నక్కల భూమేష్,పూజ నరేంధర్,మెట్టు సంతోష్, రజనీష్,వెల్మల్ సురేష్,సుంకరి రవి,రంజిత్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -