Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంచీటింగ్‌ కేసులో అఘోరీ అరెస్ట్‌

చీటింగ్‌ కేసులో అఘోరీ అరెస్ట్‌

- Advertisement -

– చేవెళ్ల కోర్టులో 14 రోజుల రిమాండ్‌
– ట్రాన్స్‌జెండర్‌ కావడంతో సంగారెడ్డి జైలులో అనుమతి నిరాకరణ
నవతెలంగాణ- శంకర్‌పల్లి/చేవెళ్ల/కంది

చీటింగ్‌ కేసులో మోకిలా పోలీసులు అఘోరీని అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన ఓ మహిళ.. ప్రగతి రిసార్ట్స్‌లో పనిచేస్తూ అఘోరీకి పరిచయమైంది. పూజల పేరుతో ఆమె వద్ద రూ.9.50 లక్షలు తీసుకొని మోసం చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో అఘోరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని మంగళవారం సాయంత్రం నగరానికి మోకిలా పోలీసులు తీసుకొచ్చినట్టు తెలిసింది. అఘోరీతో పాటు ఇటీవల తాను వివాహం చేసుకున్న వర్షిణిని సైతం నగరానికి తరలించినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఏపీకి చెందిన వర్షిణి ఇటీవల అఘోరీని పెండ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షిణి కుటుంబానికి ఇష్టం లేకున్నా బలవంతంగా కేదార్‌నాథ్‌్‌ తీసుకువెళ్లి పెండ్లి చేసుకుందన్న ఆరోపణలున్నాయి. ఇక వాళ్ల పెండ్లికి సంబంధించిన వీడియో మొన్నటి నుంచి వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే.. ఆత్మహత్య చేసుకుంటామని ఈ జంట మొన్న ప్రకటించి ఓ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. కేదార్‌నాథ్‌¸్‌ వెళ్ళిపోతున్నామని, ఇకపై తెలుగు రాష్ట్రాలకు రాబోమని ప్రకటించారు. కాగా, ఆరెస్ట్‌ చేసిన అఘోరిని బుధవారం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి 2 గంటల పాటు విచారించారు. అనంతరం పొలీసు బందోబస్తు నడుమ చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. తన ఆర్ధిక పరిస్థితి బాగాలేదని అఘోరీ విన్నవించడంతో లీగల్‌ ఎయిడ్‌ సర్వీసెస్‌ తరపున న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించారు. కాగా, చేవెళ్ల కోర్టు నుంచి అఘోరినీ సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు. అఘోరీ.. ట్రాన్స్‌జెండర్‌ కావడంతో ఏ బ్యారక్‌లో ఉంచలేమని, లింగ నిర్ధారణ జరిగితేగాని ఇక్కడ ఉంచుకోలేమంటూ అధికారులు చెప్పడంతో తిరిగి కోర్టుకు పంపించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరగనుంది. ఈ రిపోర్టు ఆధారంగా.. చంచల్‌గూడ జైలులో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక బ్లాక్‌ ఉండటంతో అక్కడి తరలించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -