నకిలీ డేటాతో స్కిల్ ఇండియా
లేని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్టు రికార్డులు
దారితప్పిన కోట్లరూపాయల నిధులు
‘పీఎంకేవీవై’ పేరుతో మోడీ సర్కార్ మాయాజాలం
అవినీతి పుట్టను వెలికితీసిన కాగ్
బ్యాంకు ఖాతా నెంబర్ల స్థానంలో ‘11111111’, ‘123456’ వంటి అంకెలు… మెయిల్ ఐడీల స్థానంలో [email protected], [email protected], [email protected] వంటివి…ఇవన్నీ ఒకవైపైతే…ఒకే ఫోటోతో వేర్వేరు రాష్ట్రాల్లో వేలాది సర్టిఫికేషన్లు …ఇలా ఒకటి కాదు రెండు కాదు కోట్లాదిమంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చినట్టు రికార్డులు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి రూ.వేల కోట్ల సొమ్మును కూడా ‘ఆధార్ సీడింగ్’ ద్వారా అందచేశామని వివరణ ఇచ్చారు. కానీ అదంతా అబద్ధం.
ఒకటి కాదు రెండు కాదు….లక్షల సంఖ్యలో ఈ తరహా మోసాలతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసుకొనేందుకు మోడీ సర్కార్ చూపిన దొడ్డితోవ ఇది. దానికి కేంద్రప్రభుత్వం పెట్టిన పేరు ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ (పీఎంకేవీవై). ఈ స్కీం ద్వారా ఎవరి ఖాతాల్లోకి ఎన్ని నిధులు దారిమళ్లాయో లెక్కా పత్రం లేదు. మోడీ పాలనలో అవినీతి మరకే లేదంటూ 56 అంగుళాల ఛాతీని చూపి చేసుకుంటున్న ప్రచారం అంతా ఉత్తిదేనని స్వయంగా భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్థారించింది. వేల కోట్ల నిధుల దారిమళ్లింపును నిగ్గుతేల్చే పనిలో ఆ సంస్థ బిజీగా ఉంది. దేశవ్యాప్తంగా పీఎంకేవీవై వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘కాగ్’ వెల్లడించిన ఆ వాస్తవాలను ఓసారి పరిశీలిద్దాం.
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ‘స్కిల్ ఇండియా’లో భాగమైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) దేశ యువతకు నైపుణ్యాలు, ఉద్యోగాలు అందించడంలో తీవ్రంగా విఫలమైందని కాగ్ తాజా నివేదిక వెల్లడించింది. పీఎంకేవీవై కింద నమోదైన కోట్లాది మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతా వివరాలు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు నకిలీగా ఉన్నాయనీ, ఒకే ఫొటోను వేర్వేరు రాష్ట్రాల్లో ఉపయోగించి వేల సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేసినట్టు కాగ్ ఆడిట్‌లో గుర్తించింది. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మంత్రిత్వ శాఖ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ)ల్లో ఆడిట్ నిర్వహిస్తున్న ‘కాగ్’కు అక్కడ ఈ అవినీతికి సంబంధించిన ‘క్లూ’ దొరికింది. దాన్ని ఛేదించేందుకు అసోం, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, యూపీ రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. దీనిలో దేశ ప్రజలు విస్తుపోయే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
1 కోటి 10 లక్షల మందికి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చినట్టు సర్టిఫికెట్లు
కేంద్రంలోని మోడీ సర్కారు 2015లో పీఎంకేవీవైను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా దేశ యువతను పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామని సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగా 2015 నుంచి 2022 వరకు మూడు దశల్లో అమలైన ఈ పథకానికి- ప్రభుత్వం రూ.10,194 కోట్లను విడుదల చేసింది. అధికారిక లెక్కల ప్రకారం 1 కోటి 10 లక్షల మందికి స్కిల్ సర్టిఫికేషన్ ఇచ్చినట్టు పేర్కొంది. ఈ ‘కీ’ని పట్టుకొని ‘కాగ్’ డొంకను కదిలించింది. దేశప్రజలు బిత్తరపోయే విషయాలు వెల్లడయ్యాయి.
నకిలీ బ్యాంకు ఖాతాలు
పీఎంకేవీవై 2.ఓ, 3.ఓ డేటాను కాగ్ ఆడిట్‌లో పరిశీలించినప్పుడు మొత్తం 95.90 లక్షల మంది లబ్దిదారుల్లో 90.66 లక్షల మంది (అంటే 94.53 శాతం) బ్యాంక్ ఖాతా వివరాలు సున్నాలుగా, ఖాళీగా, ‘నల్’, ‘ఎన్.ఏ’ (నాట్ అప్లికెబుల్)గా నమోదైనట్టు గుర్తించారు. అనేక చోట్ల బ్యాంకు ఖాతా నెంబర్ల స్థానంలో ‘11111111’, ‘123456’ వంటివి నమోదు చేసినట్టు ‘కాగ్’ గమనించింది. సర్టిఫికేషన్ అనంతరం రూ.500 చొప్పున ప్రోత్సాహకాన్ని లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కానీ అవేవీ జరగలేదని ‘కాగ్’ గుర్తించింది. ఇప్పుడు నిధులు ఎటు దారిమళ్లాయనే అంశంపై పరిశోధనను మొదలుపెట్టింది.
డొంక తిరుగుడు సమాధానం ఇచ్చిన కేంద్రం
ఏంటివన్నీ…అని ‘కాగ్’ పీఎంకేవీవై పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి శాఖను ప్రశ్నించింది. దానితో పాటు దీనికి అనుబంధంగా ఉన్న శాఖల నుంచీ వివరణ కోరింది. ఆయా మంత్రిత్వ శాఖలు ఇచ్చిన వివరణపై కాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరి కాదనీ, ఆధార్-సీడింగ్ ద్వారా డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం వివరణ ఇవ్వడం మరిన్ని అనుమానాలను లేవనెత్తింది. లబ్దిదారుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించకపోవడంతో ఈ పథకం అమలులో పారదర్శకత, బాధ్యత రెండూ దెబ్బతిన్నాయని ‘కాగ్’ తన నివేదికలో పేర్కొంది.
నకిలీ ఈమెయిల్స్, ఫోన్ నెంబర్ల వరద
బ్యాంకు వివరాలతో పాటు ఈమెయిల్స్, ఫోన్ నెంబర్ల సమాచారం లోనూ తీవ్ర లోపాలు బయటపడ్డాయి. వేలాది మంది లబ్దిదారుల ఈమెయిల్ ఐడీలు అసంపూర్తిగా ఉన్నాయి. abc@gmail. com, 123@gmail. com, [email protected] వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక మొబైల్ నెంబర్లలో ‘1111111111’, ‘1000000000’ వంటి పునరావృత సంఖ్యలు ఉన్నాయి. మరికొన్ని ఫోన్ నెంబర్లయితే పది అంకెల కంటే తక్కువగా నమోదైనట్టు కాగ్ గుర్తించింది. ఇక 36.49 లక్షల మంది లబ్దిదారుల ఈమెయిల్ వివరాలను ‘మైగ్రేటెడ్ డేటా’గా వదిలేశారు.
‘4.ఓ’లోనూ మారని పరిస్థితి
గతేడాది అక్టోబర్ వరకు ఉన్న పీఎంకేవీవై ‘4.ఓ’ డేటాలో కూడా 2.72 లక్షల ‘నల్’ ఈమెయిల్స్, 3.08 లక్షల పునరావృత ఈమెయిల్ ఐడీలు ఉన్నట్టు కాగ్ ఆడిట్ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఐటీ నియంత్రణలు పూర్తిగా అమలులోకి రాలేదని స్పష్టం చేసింది. అదే విధంగా ఒకే ఫొటోను వేర్వేరు రాష్ట్రాల్లోని బ్యాచ్‌లకు ఉపయోగించడం ‘కాగ్’ ఆడిట్‌ను మరింత కలవరపెట్టింది.
ఉదాహరణకు బీహార్‌లోని గయా జిల్లాలో ఒక బ్యాచ్‌కు ఉపయోగించిన ఫొటో నే.. యూపీలోని బహ్రైచ్ జిల్లాలో మరో బ్యాచ్‌కు ఉపయోగించినట్టు గుర్తించారు. ఫోటోల మాయా జాలం దాదాపు అన్ని జిల్లాల్లోనూ జరిగింది. దీనితో ఈ పథకం అమలులో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందని ‘కాగ్’ నిర్థారించింది.
శిక్షణా కేంద్రాలు, సంస్థలు మాయం
నీలిమా మూవింగ్ పిక్చర్స్ (ఎన్‌ఎంపీ) అనే సంస్థ ఎనిమిది రాష్ట్రాల్లో 33,493 మందికి సర్టిఫికేషన్లు ఇచ్చినట్టు రికార్డులున్నాయి. ‘కాగ్’ ఆడిట్ సమయానికి అసలు ఆ సంస్థే లేదు. బీహార్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన శిక్షణా కేంద్రాలు, సంస్థలు మాయమయ్యాయి. కొన్ని మూసేసి ఉంటే, కొన్ని అసలు ఉనికిలోనే లేకుండా పోయాయి. ఈ విషయాలను కాగ్ తన ఆడిట్ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. అన్నీ తప్పుడు లెక్కలే!
ఈ పథకం కింద సర్టిఫికేషన్ పొందిన 56.14 లక్షల మందిలో 23.18 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. వాటి లెక్క తెలీకుండా ఉండేందుకు పూర్తి అసంఘటిత రంగంలోని ఐదు విభాగాల్లోనే ఈ ఉద్యోగాలు వచ్చినట్టు పేర్కొంది. ఆ లెక్కల ప్రకారం 31.70 లక్షల సర్టిఫికేషన్లలో (56.47 శాతం) 13.46 లక్షల ఉద్యోగాలు (58.08 శాతం) వస్త్రరంగంలోని ‘సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్స్’లో జరిగాయని చూపించింది. మరో 19 సెక్టార్లలో 1.74 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ గణాంకాలకు మద్దతుగా కోవిడ్-19ను సాకుగా చూపినట్టు ‘కాగ్’ గుర్తించింది.
వయసు, అర్హతలు ఉల్లంఘన
కనీస వయసు, విద్యార్హతలు లేకుండానే వేలాది మందికి శిక్షణ, సర్టిఫికేషన్ ఇచ్చినట్టు కాగ్ ఆడిట్ వెల్లడించింది. తక్కువ వయసు డ్రైవర్లు, అవసరమైన విద్యార్హతలు లేని అభ్యర్థులు సర్టిఫికేషన్ పొందడాన్ని గుర్తించింది. దీనితో ఈ పథకం అమలుపై అనేన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
61.14 లక్షల మందికి చెల్లించినట్టు రికార్డులు
పీఎంకేవీవై 3.ఓ కింద దేశవ్యాప్తంగా రూ.337.16 కోట్ల చెల్లింపులపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 95.91 లక్షల మంది సర్టిఫైడ్ అభ్యర్థుల్లో 61.14 లక్షల మందికే (ప్రత్యక్ష నగదు బదిలీ) డీబీటీ చెల్లింపులు జరిగాయని రికార్డుల్లో పేర్కొన్నారు. మిగిలిన 34 లక్షల మందికి ఇప్పటికీ ప్రోత్సాహక మొత్తం అందలేదన్న విషయం ఇప్పుడు వెల్లడైంది. స్కిల్ ఇండియా పేరుతో మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అమలులో తీవ్రమైన నిర్లక్ష్యం, పారదర్శకత లోపం, ఫలితాల వైఫల్యం స్పష్టంగా బయటపడిందని కాగ్ నివేదిక తేల్చింది. యువత భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఇలాంటి పథకాలపై కఠిన పర్యవేక్షణ, స్పష్టమైన బాధ్యత, సమగ్ర సంస్కరణలు అవసరమని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ నివేదిక ఇప్పుడు మోడీ సర్కారును రాజకీయంగా ఇరుకున పెడుతుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.



