Tuesday, February 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రంలో వంద రోజుల అభివృద్ధి ప్రణాళిక

రాష్ట్రంలో వంద రోజుల అభివృద్ధి ప్రణాళిక

- Advertisement -

కేంద్ర నిధులు రాబట్టేందుకు కార్యాచరణ రూపొందించాలి
అధికారులకు సీఎస్‌ ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులు మార్చిలోగా సమీకరించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎస్‌ఎస్‌ఎ నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

దీనిపై ఢిల్లీలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకుని సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌, విద్య, వైద్యారోగ్య, గిరిజన సంక్షేమ శాఖల వారీగా కేంద్రం నుంచి సుమారు రూ.15 వేల కోట్లు రావాల్సి ఉందని వివరించారు. వాటిని సమీకరించుకుని రాష్ట్రంలోని పెండింగ్‌ పనులకు ఖర్చు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల 2, 3 తేదీల నుంచి జూన్‌ రెండో తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై వివిధ శాఖల వారీగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌, వైద్యం, విద్య విభాగాల్లో ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసినందున ఎన్నికైన వార్డుమెంబర్లు, సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తదితర ప్రజాప్రతినిధులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు బాధ్యతతో కూడిన విధులు నిర్వర్తించేందుకు ఈ వందరోజుల కార్యాచరణ ప్రణాళిక ఉపకరిస్తుందని వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రోడ్ల మరమ్మతులు, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కోరారు. రానున్న క్యాబినెట్‌ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారంలోగా సమర్పించాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్‌ రాజ్‌, సీవీ ఆనంద్‌, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ముఖ్య కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, అహ్మద్‌ నదీమ్‌, ఎన్‌ శ్రీధర్‌, యోగితారాణా, కార్యదర్శులు క్రిస్టినా చొంగ్తు, టికె శ్రీదేవి, స్టీఫెన్‌ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -