కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతాం
నూతన సర్వీస్ నిబంధనలు రూపొందించాలి
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై కేంద్రం మౌనం వీడాలి: నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్, అధ్యాపకదర్శిని ఆవిష్కరణలో చావ రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం 2026 పోరాటాల సంవత్సరంగా ఉండబోతున్నదని ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2026 సంవత్సర డైరీ, క్యాలెండర్‌తో పాటు అధ్యాపక దర్శినిని ఆవిష్కరించారు. విద్యారంగంలో పర్యవేక్షక పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉండి పర్యవేక్షణ కొరవడిందని ఆయన విమర్శించారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణమని తెలిపారు.
దీనిని అధిగమించేందుకు వీలుగా 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షక పోస్టులైన జిల్లా విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా అంతరాలు పెంచుతూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా తెలంగాణ విద్యావిధానం తెస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జాతీయ విద్యా విధానాన్ని దొడ్డి దారిన రాష్ట్రంలోకి టీఈపీ పేరుతో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. విధాన రూపకల్పనలో తల్లిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని చావ రవి సూచించారు. 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు అవసరమైతే రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చైనా సరే క్లియర్ చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు : ఎ.వెంకట్
చదవుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ 2011లోనే ఈ మేరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆయన గుర్తుచేశారు. జనగామలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర సదస్సులో ఈ ఏడాది పెద్ద ఎత్తున పోరాడాలని తీర్మానించినట్టు తెలిపారు. అదే విధంగా టీఎస్‌యూటీఎఫ్ కార్యకర్తలు పని చేసే పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.
తమ సంఘం ఆధ్వర్యంలోనూ సావిత్రిభాయి ఫూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, వెంకటప్ప, విశాలి, ఎస్.వై.కొండలరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజారావు, శ్యామ్ సుందర్, జగన్నాథ శర్మ, జిల్లాల నాయకులు భగవంత్ రాజ్, భువనేశ్వరి, కవిత, భాషా, మాజీద్, సీనియర్ నాయకులు మస్తాన్ రావు, అశోక్, వెంకటేశ్వర్లు, అరుణ, రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం మౌనం వీడాలి
ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న 25 లక్షల మంది టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం మౌనం వీడాలని చావ రవి డిమాండ్ చేశారు. ఐదేండ్లు పైబడి సర్వీస్ ఉన్న వారు రెండేండ్ల లోపల టెట్ అర్హత సాధించాలని ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో దాదాపు 40 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్వ్యూ పిటిషన్ వేయలేదనీ, పార్లమెంటులోనూ చర్చించడం లేదనీ, వారికి అవసరమైన భరోసా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో టెట్ పరీక్షకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.



