Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంహర్యానాలో 25లక్షల ఓట్‌ చోరీ

హర్యానాలో 25లక్షల ఓట్‌ చోరీ

- Advertisement -

లేదంటే మేమే గెలిచే వాళ్లం : రాహుల్‌గాంధీ
2024 – ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ మీడియా సమావేశం
హైడ్రోజన్‌ బాంబు అంటూ హెచ్‌ ఫైల్స్‌ బహిర్గతం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ జరగకుంటే, 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో నకిలీ, డూప్లికేట్‌, బల్క్‌ ఓటింగ్‌ జరగబట్టే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. గతంలో ఓట్ల చోరీకి సంబంధించి హైడ్రోజన్‌ బాంబు లాంటి సమాచారం తమ వద్ద ఉందని రాహుల్‌ చెప్పారు. అయితే ఇప్పుడు హైడ్రోజన్‌ బాంబు లాంటి సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ‘హెచ్‌’ ఫైల్స్‌గా రాహుల్‌ అభివర్ణించారు. బీజేపీ ఓట్ల చోరీకి ఎన్నికల సంఘం సహకరిస్తోంది అనేందుకు ‘హెచ్‌’ ఫైల్స్‌ రుజువులుగా నిలుస్తాయని, అవి తమ చేతిలో ఉన్నాయన్నారు. 100 శాతం రుజువులతో తాను మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు బీజేపీతో చేతులు కలిపారు’
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)తో పాటు ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్లు బీజేపీతో చేతులు కలిపి హరియాణాలో గెలిపించారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆ ఎన్నికల అధికారులు ప్రధాని మోడీపొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ‘ఆపరేషన్‌ సర్కార్‌ చోరీ’ని నిర్వహించారని ఆయన మండిపడ్డారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని దేశంలోని జెన్‌-జీ యువతకు పిలుపునిచ్చారు. ఓట్లచోరీ ద్వారా జెన్‌-జీ నుంచి భవిష్యత్తును లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఇళ్లు లేని వాళ్లకు ఇంటి నంబరుగా జీరోను కేటాయిస్తామని దేశ ప్రజలకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ అబద్ధాలు చెబుతున్నారని, ఆ ఇండ్ల పేరుతో ఏం జరుగుతోందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని రాహుల్‌ పేర్కొన్నారు. డూప్లికేట్‌ ఓట్లను ఎందుకు తొలగించడం లేదని ఈసీని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ వాటిని తొలగిస్తే ఎన్నికల్లో సరైన ఫలితం వస్తుందన్నారు.

హర్యానాలో భారీగా ఫేక్‌ ఓటర్లే
‘2024 అసెంబ్లీ ఎన్నికల సమయానికి హర్యానాలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది ఫేక్‌ ఓటర్లే. ఒక బ్రెజీలియన్‌ మోడల్‌ ఫొటోతో ఓట్లను రిజిస్టర్‌ చేయించి, చాలా ఎన్నికల బూత్‌లలో ఓట్లు వేయించారు. ఈ లెక్కన ప్రతీ 8 మంది హర్యానా ఓటర్లలో ఒకరు నకిలీ ఓటర్లే. అంటే దాదాపు 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. పోస్టల్‌ ఓట్లు, బూత్‌ ఓట్ల లెక్కల్లోనూ పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి. దీనిపై మా పార్టీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. యావత్‌ హర్యానా రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది. అందుకే దానికి సంబంధించిన ఆధారాలకు హెచ్‌-ఫైల్స్‌ అనే పేరు పెట్టాం. ఒకే ఒక్క ఫొటోపై 223 ఓట్లను జారీ చేశారు. బ్రెజీలియన్‌ మోడల్‌ ఫొటోతో ఓ మహిళ 10 వేర్వేరు పోలింగ్‌ బూత్‌లలో 22 సార్లు ఓట్లు వేసింది. ఇంతకీ ఆమె ఎవరు ? ఆమె ఓట్లు వేసిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ 22వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి 25 లక్షల ఓట్లు హర్యానాలో ఉన్నాయి’ అని రాహుల్‌ గాంధీ వివరించారు.

జాతీయ స్థాయిలోనూ ఇలాగే జరిగి ఉండొచ్చు
‘హర్యానాలోని ఏదో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ ఓట్ల చోరీ ఉదంతం పరిమితం కాలేదని మాకు అనుమానం కలుగుతోంది. ఈ వ్యవహారం రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలోనూ జరిగి ఉండొచ్చు. ఏదో అనుమానాస్పదంగా జరుగుతోందని హరియాణాలోని మా అభ్యర్థుల నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల టైంలో సమాచారం వచ్చింది. వాళ్లందరి అంచనాలు, అనుమానాలు నిజమని చివరకు తేలింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మేం ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదు ర్కొన్నాం. అందుకే హర్యానాలో ఓట్లచోరీపై మేం పూర్తి ఫోకస్‌ పెట్టి యావత్‌ సమా చారాన్ని సేకరించాం. ఓట్లచోరీ వల్లే గెలవాల్సిన హరియాణాను మేం కోల్పోయాం’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అయితే రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఖండించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -