Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టులకు 44 వేల అక్రిడిటేషన్లు

జర్నలిస్టులకు 44 వేల అక్రిడిటేషన్లు

- Advertisement -

మరింత పారదర్శకంగా ప్రక్రియ
అర్హులందరికీ న్యాయం : సమాచార శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్‌ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని గుర్తు చేశారు. అక్రిడిటేషన్‌ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్‌ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ సిహెచ్‌. ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో జి. మల్సూర్‌తో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

అక్రిడిటేషన్‌ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జీవో 252 జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోన్న తర్వాత సవరణలు జీవో 103ను జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్‌ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని వివరించారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్‌ కార్డులు ఉండేవనీ, తమ ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరగనుందని మంత్రి స్పష్టం చేశారు.

2.50 లక్షల పైగా సర్క్యులేషన్‌ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుంచి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్‌ ఉన్న 24 పత్రికలకు 17,784 కార్డులు , 25001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్‌ ఉన్న 30 పత్రికలకు 3,390, అదేవిధంగా 15001 నుంచి 25000 వరకు సర్క్యులేషన్‌ ఉన్న 169, చిన్న పత్రికలకు 11,661 , 15వేలలోపు సర్క్యులేషన్‌ ఉన్న 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్‌ ఏజన్సీలకు 68 అక్రిటేషన్లకు అర్హత ఉందన్నారు. అలాగే 21 శాటిలైట్‌ ఛానళ్లకు 4,431 కార్డులు, ఎనిమిది జాతీయ ఛానళ్లకు 32, వంద లోకల్‌ కేబుల్‌ ఛానళ్లకు 200 ,డిజిటల్‌ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్టు తెలిపారు. ఇందులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అక్రిడిటేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -