Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగిగ్ వర్కర్ల కోసం 5 ప్రగతి కేంద్రాలు

గిగ్ వర్కర్ల కోసం 5 ప్రగతి కేంద్రాలు

- Advertisement -

కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యాలు.. తెలంగాణ ప్రభుత్వం–జెప్టో మధ్య అవగాహన ఒప్పందం
గిగ్ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత​ : మెట్రోపాలిటన్ ఏరియా అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
నవతెలంగాణ-సిటీబ్యూరో

​హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, డెలివరీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో 5 ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం (ఏంఓయూ) కుదిరింది. రోజువారీ విధుల్లో భాగంగా ఎక్కువ సమయం రహదారులపై గడిపే గిగ్ కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్లలో బుధవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మెట్రోపాలిటన్ ఏరియా అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఆ ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థలో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులు కీలకంగా మారుతున్నారని తెలిపారు. పని విధానాలు మారుతున్న నేపథ్యంలో, రహదారులపై పనిచేసే కార్మికుల రోజువారీ మౌలిక అవసరాలను నగరాలు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు చెందిన కార్మికులందరికీ ఉపయోగపడే సౌకర్యవంతమైన కేంద్రాలు ఏర్పడతాయని, హైదరాబాద్‌లోని విస్తృత గిగ్-వర్కర్ సమాజానికి మద్దతు అందించేందుకు జెప్టో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
జెప్టో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. భారతదేశంలో గిగ్ వర్క్‌ఫోర్స్ 2020–21లో 77 లక్షల నుంచి 2029–30 నాటికి 2.35 కోట్లకు పెరుగుతుందని అంచనా ఉందన్నారు. ఈ రంగం విస్తరిస్తున్న కొద్దీ కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. జెప్టో స్టోర్ నెట్‌వర్క్‌లో ఇప్పటికే డెలివరీ భాగస్వాములకు తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశం, మొబైల్ చార్జింగ్, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా ఈ సదుపాయాలను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల గిగ్ కార్మికులకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, తదితర అధికారులు పాల్గొన్నారు.

​అన్ని ప్లాట్‌ఫారమ్‌ల 
గిగ్ కార్మికులకు అందుబాటులో..
2024లో హైదరాబాద్‌లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులపై నిర్వహించిన హీట్‌‌వాచ్‌ సర్వే ప్రకారం.. సుమారు 69 శాతం మంది కార్మికులకు పరిశుభ్రమైన మరుగుదొడ్ల సదుపాయం అందుబాటులో లేదని, 80 శాతానికి పైగా కార్మికులకు పని సమయంలో నీడలో విశ్రాంతి తీసుకునే లేదా శీతలీకరణ సదుపాయాలు లేవని వెల్లడైంది. ఈ క్రమంలో ప్రభుత్వం, జెప్టో సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇవి కేవలం జెప్టో డెలివరీ భాగస్వాములకే కాకుండా క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్, అపారెల్, ఇతర లాస్ట్-మైల్ డెలివరీ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికులందరికీ అందుబాటులో ఉంటాయి. ఆయా కేంద్రాల ప్రదేశాలను ప్రభుత్వం, జెప్టో సంయుక్తంగా గుర్తించనున్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సురక్షితమైన విశ్రాంతి స్థలం, పరిశుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్ల సదుపాయం, కాలానుగుణంగా ఆరోగ్య శిబిరాలు, అర్హత కలిగిన గిగ్, అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ నమోదుపై అవగాహన వంటి సదుపాయాలు కల్పించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -