యుద్ధంతో కుదేలైన విమానయాన పరిశ్రమ
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి దాడి చేసినప్పటి నుంచి అంతర్జాతీయ విమానయాన రంగాన్ని సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధం మార్కెట్లను కకావికలం చేసింది. కార్యకలాపాలు, ఇంధన సరఫరాలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రధాన విమానయాన సంస్థలు యాభై బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాయని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తెలిపింది. పెరుగుతున్న ఇంధన ధరలు, గగనతల ఆంక్షల కారణంగా ఈ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. యుద్ధం నాలుగో వారంలో ప్రవేశించడంతో జెట్ ఇంధన ధరల పెరుగుదలను ఎయిర్‌లైన్స్ తట్టుకోలేకపోతోంది. ఎందుకంటే స్వల్ప కాలంలోనే వాటి ధరలు గణనీయంగా పెరిగాయి.
విమానయాన సంస్థల లాభాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో రాబోయే కాలంలో టిక్కెట్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విమానయాన సంస్థలకు ఎదురవుతున్న ప్రధాన సవాలు ఇంధన వ్యయమే. విమానయాన సంస్థలకు అయ్యే మొత్తం వ్యయంలో మూడో వంతు జెట్ ఇంధనం కొనుగోలుకే పోతుంది. ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఖర్చులు పెరిగిపోతున్నాయి. 2022లో ఉక్రెయిన్‌పై దాడి జరిగిన తర్వాత ఇంధన ధరలు పెరిగాయని, ఇప్పుడు అవి ఆకాశాన్ని తాకుతున్నాయని ఈజీజెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెంటన్ జార్విస్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో టిక్కెట్ ధరలు పెంచడం మినహా మరో దారి లేదని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని 20 అతి పెద్ద విమానయాన సంస్థలు 53 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయని ఓ నివేదిక తెలిపింది.


