Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో 65 లక్షల ఓట్లు గల్లంతు

బీహార్‌లో 65 లక్షల ఓట్లు గల్లంతు

- Advertisement -

– పత్రాలు సమర్పించిన 91.6 శాతం ఓటర్లు : వెల్లడించిన ఈసీ
– మండిపడుతున్న ప్రతిపక్షం
– సవరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్‌
న్యూఢిల్లీ :
అనుకున్నంతా అయింది. ప్రతిపక్షాల ఆరోపణలు వాస్తవమేనని తేలింది. బీహార్‌లో ఓ పథకం ప్రకారం పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను చేపట్టారంటూ వస్తున్న విమర్శలకు ఊతమిస్తూ ఆ రాష్ట్రంలోని 65 లక్షల మంది ఓటర్ల ఓటు హక్కును తొలగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. గడువు ముగిసే సమయానికి 91.6 శాతం మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ పత్రాలు సమర్పించారని తెలిపింది. రాష్ట్రంలో 7.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 7.2 కోట్ల మంది అవసరమైన పత్రాలు అందజేశారని చెప్పింది. దీంతో జూలై జాబితాలలో పేరున్న 65 లక్షల మంది ఓటర్లను ఆగస్ట్‌ 1న ప్రచురించే ముసాయిదా జాబితాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. 2.8 శాతం ఓటర్లు (22 లక్షలు) చనిపోయారని, 4.5 శాతం ఓటర్లు (26 లక్షలు) శాశ్వతంగా వెళ్లిపోయారని, 0.8 శాతం ఓటర్ల (ఏడు లక్షలు) పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉన్నదని తెలియజేసింది.

ఈసీ ఏమంటోంది?
ఓటర్లు అందజేసిన పత్రాలను ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు లేదా అసిస్టెంట్‌ ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఈ పని ఆగస్ట్‌ 1వ తేదీతో పూర్తయిన తర్వాత 65 లక్షల మంది ఓటర్ల వాస్తవ పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుందని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆగస్ట్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకూ క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ సమయంలో నిజమైన ఓటర్లు తిరిగి ఎన్నికల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. బీహార్‌ నుంచి వలస వెళ్లిన కార్మికులను ఓటర్ల జాబితాల నుంచి తొలగించబోమని, ఇప్పటికే 246 వార్తా పత్రికలలో హిందీలో ప్రకటనలు ఇచ్చామని, వలసదారులను గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని వివరించింది. 16 లక్షల మంది వలస కార్మికులు ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ పత్రాలు పూర్తి చేశారని, 13 లక్షల మంది పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పింది.

ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులైన వారికి నెల రోజుల సమయం ఇస్తున్నామని, అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ఎన్నికల కమిషన్‌ ప్రశ్నించింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బూత్‌ స్థాయి ఏజెంట్లను (బీఎల్‌ఏలు) నియమించుకున్నాయని, వాస్తవానికి వారి సంఖ్య 16 శాతం పెరిగిందని తెలిపింది. సీపీఐ (ఎం), కాంగ్రెస్‌ పార్టీలు బీఎల్‌ఏల నియామకాన్ని వంద శాతానికి పైగా పెంచుకున్నాయని చెప్పింది.

ఈ నిబంధనలు పూర్తి చేస్తేనే ఓటు
బీహార్‌లో ఎన్నికల జాబితాల సవరణపై ఈసీ జూన్‌ 24న ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం 2003 జాబితాలో పేరు లేని వారు తమ అర్హతకు సంబంధించిన రుజువును సమర్పించాల్సి ఉంటుంది. 1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు తాము పుట్టిన ప్రదేశం, తేదీకి సంబంధించిన రుజువు చూపాలి. 1987 జూలై 1, 2004 డిసెంబర్‌ 2 తేదీల మధ్య జన్మించిన వారు తమ తల్లిదండ్రులలో ఒకరి జన్మస్థలాన్ని, తేదీని కూడా అందజేయాలి. 2004 డిసెంబర్‌ 2వ తేదీ తర్వాత పుట్టిన వారు తమ పుట్టిన తేదీతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి పుట్టిన తేదీలకు సంబంధించి రుజువులు చూపాల్సి ఉంటుంది. అందజేసిన వివరాలతో అధికారులు సంతృప్తి చెందితే కొత్త ఓటరు జాబితాలో వారి పేర్లను తిరిగి చేరుస్తారు. లేకుంటే తొలగిస్తారు. ఆగస్ట్‌ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను, సెప్టెంబర్‌ 30న తుది జాబితాను ప్రచురిస్తారు. అక్టోబర్‌ లేదా నవంబరులో బీహార్‌ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి.

ఏం జరిగింది?
గడువులోగా సంబంధిత పత్రాలు సమర్పించలేని ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే వారు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నదంటూ ఈ నెల 2వ తేదీన ఇండీ కూటమిలోని 11 పార్టీల ప్రతినిధులు ఈసీకి విన్నవించారు. అయితే ఈ ఆందోళనలను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఎవరూ సంతృప్తి వ్యక్తం చేయనందునే ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టామంటూ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈ నెల 10న సుప్రీంకోర్టు ఈసీకి సూచించింది. అయితే వాటిని చెల్లుబాటయ్యే పత్రాలలో చేర్చలేమని ఈ నెల 21న సుప్రీంకోర్టుకు ఈసీ తెలియజేసింది. ఈ వ్యవహారంపై వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

ప్రత్యేక సవరణ ఆపండి : ప్రతిపక్షాల డిమాండ్‌
ఓటర్ల జాబితా తొలి దశ సవరణలో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు అవుతుండడంపై ప్రతిపక్ష ఇండీ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేసింది. ఈసీ డేటా సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అందులో విధానపరమైన అస్పష్టత కన్పిస్తోందని తెలిపింది. ఆర్జేడీ, సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్‌) నేతలు పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఈసీపై తీవ్ర ఆరోపణలు సంధించారు. ఈసీ కసరత్తు యావత్తూ అస్పష్టత పైనే ఆధారపడిందని అంటూ దానిని ‘సంస్థాగత అహంకారం’గా అభివర్ణించారు. చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల సమాచారాన్ని పార్టీలకు అందజేశామంటూ ఈసీ చేసిన వాదనను వారు తోసిపుచ్చారు. ‘మా భయాందోళనలు నిజమయ్యాయి. సుమారు రెండు లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారని మేము ముందుగానే హెచ్చరించాం. తప్పుడు పత్రాల ఆధారంగా రూపొందించిన డేటాను తీసుకొని ఓటర్లను తొలగిస్తున్నారు. పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. రాబోయే నెలలో మరిన్ని తొలగింపులు జరగవచ్చు. ఈ విషయంపై మేము ప్రజల వద్దకు వెళతాం. తమ ఓట్లు కూడా గల్లంతయ్యాయని ఎన్డీఏ సైతం చెబుతోంది’ అని ఆయా పార్టీల నేతలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈసీ కసరత్తులో పారదర్శకత, కచ్చితత్వం లోపించాయని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈసీ ప్రక్రియలో స్పష్టత లేదని, అసమానతలు కన్పిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇది ఓటర్ల జాబితాను సరిచేయడం కాదని, పరిశీలన పేరుతో తొలగింపులు చేసే కసరత్తు అని ధ్వజమెత్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -