Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేరుశనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్: కలెక్టర్

వేరుశనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి వేరుశనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వరి పంటతో పోల్చితే వేరుశనగ వేయడం ద్వారా తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకం కింద వేరుశనగ రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై రైతులకు సబ్సిడీ కింద కదిరి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలను అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ అక్కడికి వచ్చిన పలువురు వేరుశనగ రైతులతో మాట్లాడి పంట పెట్టుబడికి అయ్యే ఖర్చు వివరాలను పూర్తయిన తర్వాత వచ్చే దిగుబడి వివరాలను తెలుసుకున్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటతో పోల్చితే వేరుశనగ వేయడం ద్వారా తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలను పొందవచ్చని చెప్పారు. కాబట్టి రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించాలని ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా నూనె గింజలను కూడా ఉత్పత్తి చేయాలని సూచించారు. వేరుశనగ నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ముఖ్యంగా వనపర్తి వేరుశనగకు అప్లో టాక్సిన్ అనే శీలింద్రం లేకపోవడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అందజేస్తున్న ఈ సబ్సిడీ వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సబ్సిడీ విత్తనాలను పొందిన రైతులు పంట ఉత్పత్తి అయిన తర్వాత పెద్దమందడి ఎఫ్ పి ఓ కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. సబ్సిడీ ద్వారా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం తో ఎకరానికి రైతులకు రూ. 10 వేల పెట్టుబడి తగ్గుతుందని చెప్పారు. కాబట్టి రైతులు ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వేరుశనగ ద్వారా మంచి దిగుబడిని సాధించాలని కలెక్టర్ సూచించారు. పంట ఉత్పత్తి విషయంలో రైతులకు వ్యవసాయ శాఖ తరఫున శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, తహసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో, ఏ డి ఏ ఓ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -