నవతెలంగాణ – భువనగిరి
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన నిలుపుదలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భువనగిరి తాసిల్దార్ కార్యాలయం ముందు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి డిప్యూటీ తాసిల్దార్ కళ్యాణ్ కి మెమోరాండం సమర్పించారు. అనంతరం రెడ్డి జాగృతి సంస్థ మాధవరెడ్డి హైకోర్టులో వేసిన ప్రతులను తాహసిల్దార్ కార్యాలయం ముందు తగుల బేట్టారు.
ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల అశోక్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి చట్టం చేసిందన్నారు. శాసనసభ చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి నెలలు గడుస్తున్న ఆ చట్టాన్ని 9 వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా చట్టాన్ని పెండింగ్లో పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
వెంటనే 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు . ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కస్తూరి బిక్షపతి, సిపిఐ మండల కార్యదర్శి దాసరి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి ఉడుత రాఘవులు, బీసీ సంఘం నాయకులు రాసాల బాలస్వామి, చొప్పరి సత్తయ్య, కూరపాటి అంజయ్య, అంబటి యాదగిరి, నీల ఆంజనేయులు, పొట్ట బత్తిని లక్ష్మణ్, చిక్క నరసయ్య, ఏనుగు మల్లారెడ్డి పాల్గొన్నారు.