ముందస్తు జాగ్రత్తే పశువులకు శ్రీరామరక్ష
అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాద
నెలరోజుల పాటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ
నవతెలంగాణ -పెద్దవంగర
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ఈ నెల 15 నుంచి నెల రోజుల పాటు పశువులకు వేయనున్నారు. నాలుగు నెలలు దాటిన ప్రతి పశువుకు ముందుస్తు జాగ్రత్త చర్యగా ఈ టీకా వేయించాలని పశు వైద్యాధికారులు రైతులకు సూచిస్తున్నారు. 2024 పశు గణన లెక్కల ప్రకారం పెద్దవంగర మండలంలో మొత్తం 46,060 పశుపక్ష్యాదులు ఉండగా, ఇందులో ఆవులు 5095, గేదెలు 3952, మేకలు 4593, గొర్రెలు 32,420 ఉన్నాయి. వీటన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేందుకు జిల్లా పశుసంవర్థక శాఖ సమాయత్తమైంది.
3 పశువైద్య ఉప కేంద్రాలు.. 2 బృందాలు..
మండలంలో అవుతాపురం, పెద్దవంగర, వడ్డెకొత్తపల్లి గ్రామాల్లో మూడు పశువైద్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వడ్డెకొత్తపల్లి లో ఎల్ఎస్ఏ పోస్ట్, అవుతాపురం లో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మూడు పశువైద్య ఉప కేంద్రాలకు స్వంత భవనాలు ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో 50 శాతం మందులు వచ్చాయి. మండలంలో గాలికుంటు టీకాల పంపిణీకి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఆయా గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం పర్యటించి, వైద్యసేవలు అందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీకాల పంపిణీ ఉంటుందని, అందుకోసం 5600 డోసులు వచ్చినట్లు పశు వైద్యాధికారి వెల్లడించారు.
గాలికుంటు వ్యాధి వ్యాప్తి ఇలా..
పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ప్రధానంగా ఈ వ్యాధి అప్తో వైరస్(ఏడు విభిన్న సెరోటైప్లతో) ద్వారా వస్తుంది. వ్యాధి సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధం(లాలాజలం, పాలు, వీర్యం, విసర్జన) ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన వాహనాలు, పరిసరాలు, దుస్తుల ద్వారా వ్యాపిస్తుంది. అంతే కాకుండా. పశువులు కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోకుండా రైతులు జాగ్రత తీసుకోవాలి.
నియంత్రణ, చికిత్స..
పశువుల నోరు, కాలి గిట్టల మధ్య ఏర్పడిన పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రంగా కడగాలి. తరువాత బోరోగ్లిజరిన్ పేస్టు పుండ్ల పై రాయాలి. పెన్సిలిన్ వంటి యాంటిబయాటిక్ మందులను పశువులకు ఇవ్వాలి. వ్యాధిసోకిన పశువులను వేరు చేసి బయట తిరగనివ్వొద్దు. పశువుల షెడ్లు, ప్రాంగణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. షెడ్లను సోడియం కార్పొనెట్, సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. షెడ్లలోకి బయట వ్యక్తులు రాకుండా చూసుకోవాలి. గాలికుంటు టీకాను ఏడాదికి రెండుసార్లు పశువులకు వేయించాలి.
వ్యాధి లక్షణాలు..
గాలికుంటు వ్యాధి సోకిన పశువులు 24 గంటల్లోగా బలహీనతకు గురవుతాయి. వ్యాధి బారిన పడిన పశువుల ఉష్ణోగ్రత 104 డిగ్రీల నుంచి106 డిగ్రీల వరకు ఉంటుంది. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం తీవ్రత ఎక్కవగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులతో పాటు, కాళ్ల గిట్టల మధ్య పండ్లు వచ్చి అనతికాలంలోనే ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు ముడుచుకుని పడుకుంటాయి. దీని కారణంగా పశువులు మేత మేయవు, నీళ్లు సరిగా త్రాగలేవు, నెమరు వేయలేవు. నేటి నుంచి సొంగ లేక నురుగు కారుతుండడంతో పాటు, పశువులు బరువు, పాల ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోతాయి.
వ్యాధి నివారణ టీకాలను వేయించాలి.
ప్రతి ఆరు నెలలకు ఒక్క సారి టీకాను వేయిస్తే పశువులకు గాలికుంటు వ్యాధి సోకదు. నాలుగు నెలల వయస్సు నిండిన పశువుల నుంచి అంతకంటే ఎక్కవ వయస్సు ఉన్న పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. ఈ వ్యాధి సోకితే ప్రధానంగా పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడక ముందే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం – బాల్దు రాజశేఖర్ (ఇంచార్జి పశువైద్యాధికారి).



