పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
యూనివర్సిటీలో సంపాదించిన జ్ఞానం, ధైర్యం, వినయం, అంకితభావంతో ప్రపంచంలోకి అడుగుపెట్టాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గ్రాడ్యుయేట్లను సమాజం గొప్ప అంచనాలతో చూస్తుందని, మానవాళికి సేవ చేయడానికి.. ఎంచుకున్న రంగాలలో రాణించాలని సూచించారు. గురువారం జరిగిన పాలమూరు యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవ కారక్రమానికి గవర్నర్ అధ్యక్షత వహించారు. ముందుగా విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియం వద్ద గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ విజయేందిరా బోయి, జిల్లా ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. అలాగే 12 మందికి పీహెచ్‌డీ అవార్డులు, 83 మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పట్టభద్రులు, బంగారు పతక విజేతలందరిని అభినందించారు. స్నాతకోత్సవం అంటే ”సమావేశం” అని అర్థం అని, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులను సత్కరిస్తుందని తెలిపారు. ”సమాజం మిమ్మల్ని గొప్ప అంచనాలతో చూస్తుంది.. ఎందుకంటే మీరు మానవాళికి సేవ చేయడానికి ఈ గోడలకు అతీతంగా మీరు ఎంచుకున్న రంగాలలో రాణించాలి. మీ విద్య ఇక్కడితో ముగియదు.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్టు.. మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యం కావాలి..” అని చెప్పారు.
అవిశ్రాంత అంకితభావానికి ఒక వేడుక
”మీతో ఉండటం నాకు అపారమైన ఆనందాన్ని, లోతైన గౌరవాన్ని ఇస్తుంది. ఒక విశ్వవిద్యాలయం విద్యా జీవితంలో అత్యంత పవిత్రమైన సందర్భాలలో స్నాతకోత్సవం ఒకటి. ఇది విద్యార్థుల విజయాలకు మాత్రమే కాకుండా, వారిని మార్గనిర్దేశం చేసి, పెంచి పోషించిన ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, కుటుంబాల అవిశ్రాంత కృషికి ఒక వేడుక” అని ఎంఎస్‌ఎన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టార్ రమేష్‌బాబు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, క్రీడల ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఐజీ. ఎల్‌ఎస్.చౌహాన్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు, తదితరులు పాల్గొన్నారు.