Tuesday, May 13, 2025
Homeఎడిట్ పేజిపశ్చిమ ఆఫ్రికాలో సామ్రాజ్యవాదం

పశ్చిమ ఆఫ్రికాలో సామ్రాజ్యవాదం

- Advertisement -

గతంలో ఫ్రాన్స్‌ దేశానికి వలసలుగా ఉండిన ఆఫ్రికా దేశాలు ఇప్పటికి కూడా పూర్తిగా వలస పెత్తనం నుండి బయట పడలేదు. తనకు వలసలుగా ఉండిన దేశాలకు స్వాతంత్య్రం ప్రకటించినప్పటికీ, ఆయా దేశాల్లో ఉన్న తన ఆస్తుల రక్షణ నిమిత్తం అక్కడ ఫ్రెంచి సైన్యాలను మోహరించాలని ఫ్రాన్స్‌ పట్టుబట్టింది. అందుకు ఆ దేశాల ప్రభు త్వాలు అంగీకరించాయి కూడా. దాంతో ఆ దేశాల్లోని అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి ఫ్రాన్స్‌కు అమితమైన అవకాశం దొరికింది.దాంతోబాటు, ఈ దేశాలన్నీ సి.ఎఫ్‌.ఎ ఫ్రాంక్‌ (సెంట్రల్‌ ఆఫ్రికన్‌ ఫ్రాంక్‌)ను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించాయి. ఈ సి.ఎఫ్‌.ఎ ఫ్రాంక్‌ ఫ్రెంచి కరెన్సీ అయిన ఫ్రాంక్‌తో స్థిరమైన మారకపు రేటును కలిగివుంటుంది. ఈ స్థిరమైన మారకపు రేటును కొనసాగించాలంటే ఆ దేశాల ద్రవ్య విధానాన్ని ఫ్రెంచి సెంట్రల్‌ బ్యాంక్‌ కంట్రోల్‌లో ఉంచడానికి అంగీకరించాలి. ద్రవ్య విధానాన్ని ఆర్థిక విధానం నుండి వేరు చేయడం సాధ్యం కాదు. అంటే ఆచరణలో ఆ దేశాల ఆర్థిక విధానాలను చాలా మేరకు ఫ్రాన్స్‌ నిర్దేశిస్తూ వుంటుంది. ఫ్రాన్స్‌ యూరోపి యన్‌ యూనియన్‌ ఆర్థిక వ్యవస్థతో కలిసిపోయినప్పుడు కూడా ఈ ఆఫ్రికన్‌ దేశాలపై ఫ్రాన్స్‌ నియంత్రణ కొన సాగుతూనే వుంది. అందుచేత ఈ పూర్వపు ఫ్రెంచి వలసలైన ఆఫ్రికన్‌ దేశాల స్వతంత్రం చాలా పరిమితులకు లోబడి నడుస్తోంది. ఒకవేళ ఏ దేశంలోనైనా విప్లవకారులు అధికారంలోకి వచ్చి ఈ ఫ్రెంచి చట్రాన్నుంచి విడగొట్టుకోడానికి ప్రయత్నిస్తే ఆ దేశం మీద ఫ్రాన్స్‌ పలు రూపాలలో నయా ఉదారవాద ఆంక్షలను విధించి ముందడుగు పడకుండా నిరోధిస్తుంది. ఇందుకు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉండనే వుంది.
బుర్కినా ఫాసోలో థామస్‌ సంకారా అనే విప్లవకారుడు అధికారంలోకి వచ్చినప్పుడు అతడు తన దేశం నుండి ఫ్రెంచి సైన్యాలు ఖాళీ చేయాలని ఆదేశించాడు. అప్పుడు అతడిని స్వంత పార్టీకి చెందిన వ్యక్తులే కుట్ర పూరితంగా హత్య చేశారు. ఈ కుట్ర వెనుక ఫ్రెంచి సైనిక దళాల పాత్ర, ఫ్రెంచి ప్రభుత్వ మద్దతు ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదు. అయితే నయా వలస ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ ఈ దేశాల్లో పోరాటాలు కొనసాగుతూనే వచ్చాయి. అటువంటి ప్రతిఘటన తరచూ సైనిక దళాల్లోకి రిక్రూట్‌ చేయబడ్డ స్థానిక సాయుధ దళాల నుండి వచ్చింది. పి.ఎం.ఎస్‌.ఆర్‌ (పేట్రియాటిక్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ సేఫ్‌గార్డ్‌ అండ్‌ రెస్టొరేషన్‌) అనే సంస్థ 2022లో బుర్కినా ఫాసో లో ఏర్పడింది. దీనికి కెప్టెన్‌ ఇబ్రహిం ట్రావ్‌రె నాయకుడు. ఇతడు 2022 సెప్టెంబర్‌ 30న దేశంలో అధికారానికి వచ్చాడు. ఆ వెంటనే ఫ్రెంచి సైన్యాలను దేశం నుండి ఖాళీ చేయమని ఆదేశించాడు. ఖాళీ చేయించడంలో కృతకృ త్యుడయాడు కూడా. తన దేశం చిక్కుకుపోయిన సి.ఎఫ్‌.ఎ ఫ్రాంక్‌ ఏర్పాటు వల నుంచి బయటకు తెచ్చి ఆ ఏర్పాటుకు ముగింపు పలికాడు. తమ పొరుగు దేశాలైన మాలి, నైగర్‌లలో ఉన్న ప్రభుత్వాలు కూడా వలసాధిపత్యం నుంచి పూర్తి స్థాయి విముక్తి కోరుకుంటున్నందున వాటితో కలిసి అసోసియేషన్‌ ఆఫ్‌ సాహెల్‌ స్టేట్స్‌ (ఎ.ఇ.ఎస్‌)ను ఏర్పాటు చేశాడు. ఆ ఉమ్మడి ఒత్తిడికి ఆ రెండు దేశాల నుండి కూడా ఫ్రెంచి, అమెరికన్‌ సైన్యాలు వైదొలగక తప్పలేదు. వాటితోబాటు నైగర్‌లో ఏర్పాటు చేసిన పెంటగాన్‌ డ్రోన్‌ కేంద్రాన్ని కూడా మూత వేయవలసి వచ్చింది. ఆ ప్రాంతం యావత్తూ ఖనిజ సంపదతో కూడి వుంది. అటువంటి చోట ఈ ఎ.ఇ.ఎస్‌ ఏర్పడి స్వతంత్రతను స్థిరపరచు కునేందుకు పూనుకోవడం సామ్రాజ్యవాదానికి కాల్లో ముల్లు మాదిరిగా ఉంది.
ఈ ఖనిజ సంపదలో బంగారం ఒక ముఖ్యమైన వనరు. ఆఫ్రికాలోకెల్లా అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం బుర్కినా ఫాసో. 2024లో ఆ దేశం 57 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. కాని ఆ దేశ ప్రజలకు ఆ బంగారం వలన ఎటువంటి ప్రయోజనమూ దక్కలేదు. అక్కడి బంగారపు గనులు విదేశీ కంపెనీల పెత్తనంలో ఉండడమే దానికి కారణం. ఆ బంగారం ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయం దాదాపుగా ఆ విదేశీ కంపెనీలకే చెందుతుంది. అక్కడ ఉన్న పేట్రియాటిక్‌ ప్రభుత్వం 2024లో ఎస్‌.ఒ.పి.ఎ.ఎం.ఐ.బి అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. బంగారపు ఖనిజాన్ని వెలికి తీసే ప్రైవేటు విదేశీ కంపెనీలను క్రమంగా స్వాధీనపరుచుకోడానికి దీన్ని ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగాన్ని బుర్కినాబె ప్రజలకు విద్య, వైద్యం అందించడానికి ఖర్చు చేశారు. ఈ మధ్య డాలర్‌ భవిష్యత్తు ప్రశ్నార్ధకం కావడం, తమ సంపదను ఇన్నాళ్ళూ డాలర్ల రూపంలో దాచుకున్న వాళ్లు ఇప్పుడు బంగారం రూపంలో దాచుకోడానికి సిద్ధమౌతూవుండడంతో బంగారం ధర పెరుగుతోంది. ఈ పరిస్థితిని బుర్కినా ఫాసో ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉపయోగించుకోడానికి ప్రయత్నిస్తోంది. అక్కడి నుంచి ఫ్రెంచి సైన్యాలను వెళ్లగొట్టిన అనంతరం ఆదేశం మీద సామ్రాజ్యవాదులు విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించ డానికి కూడా ఉపయోగపడుతోంది. ఇక్కడితో అయిపోలేదు. ట్రావ్‌రె ప్రభుత్వం తన దేశంలో ఒక బంగారం శుద్ధి చేసే కర్మాగారాన్ని కూడా స్థాపించింది. తద్వారా బంగారు ఆభరణాల, వస్తువుల తయారీని కూడా నియంత్రించ గలుగుతోంది. అంతేగాక వ్యవసాయోత్పత్తులను కూడా ప్రాసెస్‌ చేసే పరిశ్రమలను స్థాపించింది. మరోవైపు దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోంది.
ఈ చర్యలన్నీ అమెరికా ఆగ్రహానికి కారణం కావడం ఊహించలేనిదేమీ కాదు. అమెరికాకు చెందిన ఆఫ్రికా కమాండ్‌ (ఆఫ్రికామ్‌) చీఫ్‌ అయిన జనరల్‌ మైకేల్‌ లాంగ్‌లే అమెరికన్‌ సెనేట్‌ కమిటీ ముందు వాంగ్మూలమిస్తూ ఇబ్రహీం ట్రావ్‌రె బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ స్వంతానికి, స్వంత భద్రతను మరింత పటిష్టం చేసుకోడానికి దారి మళ్లిస్తున్నాడని విషపూరితంగా ఆరోపించాడు. ఈ వ్యాఖ్యానాలను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే యావత్తు ఆఫ్రికాలోని ప్రజానీకం లాంగ్‌లే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బహుశా లాంగ్‌లే ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం వెనుక అసలు లక్ష్యం ట్రావ్‌రేేను పదవీచ్యుతుడిని చేయడానికి పన్నిన కుట్రను సమర్ధించుకోవడమే అయివుండొచ్చు. లాంగ్‌లే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఏప్రిల్‌ 16న ఒక కుట్ర ప్రయత్నం జరిగింది. పశ్చిమ దేశాల మీడియాలో ఊరూ పేరూ లేకుండా పలు రాతలు వెలువడ్డాయి. అవన్నీ ట్రావ్‌రె ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం అని, బుర్కినా ఫాసోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అవాస్త వాలతో నిండివున్నాయి. అయితే, ఆ కుట్ర భగం అయింది. కుట్రదారులు అరెస్టయ్యారు. అందుచేత సంకారా కు పట్టిన గతి ట్రావ్‌రేకు పట్టలేదు.
ఒక ఆఫ్రికన్‌ ప్రభుత్వం వలసవాదుల ఉచ్చు నుండి బయటపడడానికి ప్రయత్నించి నప్పుడు అందుకు పూనుకున్న ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలగొట్టడానికి సామ్రాజ్య వాదం ప్రయత్నించడం అన్నది ఊహించలేని విషయం ఏమీ కాదు. అందరికీ తెలిసిన పాత చింతకాయ పచ్చడి లాంటిదే ఈ ప్రయత్నం. అయితే ఆఫ్రికన్‌ దేశాలు వలసవాద ఉచ్చు నుండి బయట పడడం అనేది ఎన్ని కష్టాలతో కూడుకుందో ఇది తెలియజేస్తోంది. బుర్కినా ఫాసో ప్రభుత్వం ఒక వైపు సామ్రాజ్యవాద కుట్రలను ఎదుర్కొంటూనే మరోవైపు ఇస్లామిక్‌ ఉగ్రవాదుల తిరుగుబాటును కూడా ఎదుర్కోవలసి వస్తోంది. వాళ్ల చేతుల్లో దాదాపు నలభైశాతం భూభాగం ఉంది. చుట్టుపక్కల పశ్చిమ సామ్రాజ్య వాద దేశాలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఒక మొక్కుబడిగా ఎన్నికలు జరుగుతూ వుంటాయి. అందులో ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సంస్థలేవీ పాల్గొనవు. కాని ఆ ప్రజలు మాత్రం ఓట్లు వేస్తారు. ఎవరు ఎన్నికైనా వాళ్లు సామ్రాజ్యవాదులకు తొత్తులుగా వ్యవహరిస్తారు. అటువంటి తొత్తు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని తమ అధికారాన్ని ప్రశ్నించే దేశాలమీద ఆంక్షలను ప్రయోగించడం సామ్రాజ్యవాదుల ఎత్తుగడల్లో ఒక భాగం.
అందులో భాగంగానే బుర్కినా ఫాసోకు వ్యతిరేకంగా ఎకనామిక్‌ కమ్యూనిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్రికన్‌ స్టేట్స్‌ (ఇ.సి.ఒ.డబ్ల్యు.ఎ.ఎస్‌)ను దింపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆ కూటమి బుర్కినా ఫాసో మీద ఆర్థిక ఆంక్షలను ప్రయోగిస్తానని బెదిరించింది (సామ్రాజ్యవాదుల తొత్తుగా ఉండే ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రస్తుత బుర్కినా ఫాసో ప్రభుత్వం ఏర్పడింది). కాని ఇబ్రహీం ట్రావ్‌రె ప్రభుత్వానికి గట్టి ప్రజామద్దతు ఉంది. ప్రభు త్వానికి మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు చేశారు. ఇకోవాస్‌ నుండి విడగొట్టుకుని ఎ.ఇ.ఎస్‌ ఏర్పడింది. గతంలో సంకారా మీద కుట్రకు పాల్పడిన మూకలు పొరుగునే ఉన్న ఐవరీ కోస్ట్‌ అనే దేశానికి పోయి అక్కడ తల దాచుకుంటున్నాయి. ఫ్రాన్స్‌ పనుపున బుర్కినా ఫాసోలో కుట్రలు చేయడానికి స్థావరంగా ఐవరీ కోస్ట్‌ ఉపయోగపడుతోంది. ఇప్పుడు విఫలమైన ఏప్రిల్‌ కుట్రలో పాల్గొన్న మూకలు కూడా ఐవరీ కోస్ట్‌లోనే తల దాచుకున్నాయి.
ఇన్ని కష్టాల నడుమ వలసవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి యావత్తు పశ్చిమ ఆఫ్రికాలోని ప్రజానీకమూ పూర్తి మద్దతును అత్యుత్సాహంగా అందిస్తున్నారు. బుర్కినా ఫాసోకు దూరంగా ఉండమని సామ్రాజ్య వాదుల్ని డిమాండ్‌ చేస్తూ మొత్తం పశ్చిమ ఆఫ్రికా అంతటా ప్రజానీకం రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు చేశారు. వారు ఇబ్రహీం ట్రావ్‌రె ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. గతంలో పాట్రిస్‌ లుముంబా, ఎమిల్కర్‌ చాబ్రాల్‌, ఎడ్వర్డో మాండేన్‌, థామస్‌ సంకారా వంటి నేతలు ఏ లక్ష్యం కోసమైతే తమ ప్రాణాలర్పించారో, క్వామే ఎన్‌కుమా, జూలియస్‌ నైరెరి వంటి నేతలు జీవితాంతమూ ఏలక్ష్యం కోసం పోరాడారో, ఆ లక్ష్యం నేడు ఆఫ్రికన్‌ ప్రజల నడుమ మార్మోగు తోంది. ప్రస్తుతం మనం ఆఫ్రికా విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో ఒక నూతన అధ్యాయాన్ని చూస్తున్నాం.
రాబోయే రోజుల్లో సామ్రాజ్యవాదం మరింత క్రూరంగా ఈ పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేయడం తధ్యం. పాత ఫ్రెంచి సామ్రాజ్యవాదల ప్రయోజనాలకు తోడు, తాజాగా డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రపం చంలో ఎక్కడెక్కడున్న ముడి ఖనిజ సంపదనూ కొల్లగొట్టడానికి తహతహలాడడం ఆఫ్రికాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కాంగోలోని ప్రభుత్వం చేతులు కలపడంతో ట్రంప్‌ ప్రభుత్వం ఆ దేశంలోని ఖనిజ సంపదను తన పెత్తనంలోకి తెచ్చుకునేందుకు పథకాన్ని సిద్ధం చేసింది. ప్రపంచంలోని ఖనిజ సంపదను, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీలో, కొత్తగా తలెత్తుతున్న టెక్నాలజీలలో వినియోగించే ఖనిజ సంపదను తన అధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్‌ చాలా తొందరపడుతున్నాడు. అందుకే ఉక్రెయిన్‌ విషయంలో తొందరగా ఒప్పందం కుదుర్చుకోవాలని, గ్రీన్‌ ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. చివరికి సముద్రం అడుగున ఉన్న భూభాగాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. రష్యా, ఉక్రెయిన్‌ల నడుమ శాంతి ఒప్పందం కుదర్చడానికి ఒక నిజాయితీ కలిగిన మధ్యవర్తి పాత్ర పోషిస్తానంటూ ప్రకటిం చడం వెనుక ఆ రెండు దేశాలలోనూ ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను చేజిక్కించుకోవాలనే కాంక్ష ఉంది.
ఏదేమైనా రానున్న రోజుల్లో ఒకవైపు సామ్రాజ్యవాదం, మరోవైపు ఆఫ్రికాలో వలస పీడన నుండి విముక్తి కోసం పోరాడుతున్న శక్తులు తీవ్రంగా ఘర్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ ఘర్షణలకు ఆఫ్రికా ఖండం వేదిక కానున్నది. ఒకవైపు ఆ ఖండపు అపార ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టాలనే సామ్రాజ్యవాదులు, రెండోవైపు తమ ఖండంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోడానికి ఆ వనరులను ఉపయోగించాలనుకునే స్థానిక శక్తులు మోహరించి వున్నాయి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -