Monday, October 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచెడుపై ధర్మం సాధించిన విజయం

చెడుపై ధర్మం సాధించిన విజయం

- Advertisement -

– ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఆనందకరమైన దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపాల పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక కాలంలోని చెడులను జయించి, శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం నెలకొనే సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ నిజమైన స్ఫూర్తితో దేశీయ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ఈ పండుగను జరుపుకోవడానికి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో ప్రకాశం, ఆనందం, శ్రేయస్సును మరింతగా పెంచేందుకు కొత్త ఆలోచనలకు, కొత్త ఆదర్శాలకు నాంది పలికి రాష్ట్ర ప్రజలకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనిలి సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

చిరు దివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళి : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
రాష్ట్ర ప్రజలందరికీ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిరు దివ్వెలతో చీకట్లను పారదోలేది దీపావళి అన్నారు. వెలుగులు పంచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును ఇవ్వాలని కోరారు. పేదలు, రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తగు జాగ్రత్తలతో కుటుంబ సభ్యులందరూ కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

చీకటిపై వెలుగుల విజయం : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం నింపుతూ కుటుంబాల్లో సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ స్నేహం, సౌహార్దం, సోదరభావంతో కలిసి దీపావళిని జరుపుకోవాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మెన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షులు రామచందర్‌ రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, జాగృతి అధ్యక్షులు కవిత తదితరులు దీపావళిపండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -