Sunday, May 18, 2025
Homeజాతీయంఏపీలో పంటల బీమా అస్తవ్యస్తం

ఏపీలో పంటల బీమా అస్తవ్యస్తం

- Advertisement -

– నాలుగేళ్లుగా నయాపైసా దక్కని పరిహారం
– 2022 రబీ నుంచి క్లెయిములు బంద్‌
-2 వేల కోట్ల ప్రీమియం బకాయి పెట్టిన వైసిపి సర్కారు
– వాటిని చెల్లించని టిడిపి ప్రభుత్వం
– ఈ రబీ నుంచి ఉచితానికి మంగళం
– తన వాటా నిధులివ్వని కేంద్రం
– కనీస ఆసరా కోల్పోయి రైతు అన్యాయం

అమరావతి : ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు కొంతలో కొంతైనా ఆసరా కావాల్సిన పంటల బీమా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి, టిడిపి ప్రభుత్వాల నిర్వాకం వలన అస్తవ్యస్తమైంది. మోడీ సర్కారు ఒత్తిడితో ఫసల్‌ బీమాలో వైసిపి ప్రభుత్వం చేరాక 2022 రబీ లాగాయత్‌ ప్రస్తుత రబీ వరకు వరుసగా ఐదు సీజన్లకుగాను విపత్తు బాధిత అన్నదాతలకు నయాపైసా పరిహారం అందలేదు. వైసిపి సర్కారు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు తన వంతు ప్రీమియం చెల్లించకుండా చివరి వరకు జాప్యం చేసింది. వైసిపిపై విరుచుకుపడటమే కాకుండా పాత ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తామని చెప్పిన టిడిపి కూటమి సర్కారు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. తామొచ్చాక సమగ్ర పంటల బీమా తెస్తామని హామీ ఇచ్చి అప్పటి వరకు ఉన్న ఉచిత పంటల బీమాను ప్రస్తుత రబీ నుంచి ఎత్తేసి రైతులపై ప్రీమియం భారం మోపింది. అటు కేంద్రం తన వంతు ప్రీమియం జమ చేయకుండా పేరపెట్టి ంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ ధోరణి విపత్తులతో పంటలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన రైతులకు బీమా లేకుండా అన్యాయం చేశాయి.
ఫసల్‌లో చేరిన నాటి నుంచీ..
వైసిపి వచ్చాక 2019 రబీ మొదలు కేంద్ర పథకాల నుంచి వైదొలికి తానే సొంతంగా, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సంబంధం లేకుండా పంటల బీమా నిర్వహించింది. తదుపరి మోడీ ప్రభుత్వ ఒత్తిడితో 2022 ఖరీఫ్‌ నుంచి కేంద్ర పథకా ల్లో చేరినప్పటికీ రైతుల తరఫున ప్రీమియంను తానే భరించి ఇ-క్రాప్‌ డేటా ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేసింది. ఆ ఏడాది ఖరీఫ్‌, రబీలో ఫసల్‌ బీమా (దిగుబడి ఆధారితం) నిర్వహణ కేంద్రం నిర్దేశం కిందికి వెళ్లడంతో కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. వాతావరణ బీమాను మాత్రం కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్రమే నిర్వహిం చింది. 2023 ఖరీఫ్‌ నుంచి ఫసల్‌, వాతావరణ రెండు పథకాలూ కేంద్రం నిర్దేశంలోకి వెళ్లాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. 2022-23 రబీ నుంచి 2023 ఖరీఫ్‌, 2023-24 రబీ ఈ మూడు సీజన్లకూ వైసిపి సర్కారు తాను చెల్లించాల్సిన ప్రీమియం వాటాను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. రాష్ట్రం తన వాటా పెట్టుకోలేదన్న సాకుతో కేంద్రమూ తన వాటా ప్రీమియాన్ని జమ చేయలేదు. ఆ మూడు సీజన్లలో కరువు, తుపాన్లు, వరదలు లక్షల ఎకరాల్లో పంటలను కబళించి రైతులను ఆర్థికంగా కుంగదీశాయి. నేటికీ క్లెయిములు లేవు.
బకాయిల జోలికిపోని కూటమి
వైసిపి సర్కారు 2022 రబీ (ఫసల్‌) ప్రీమియం రూ.644 కోట్లు, 2023-24 ఖరీఫ్‌, రబీలకుగాను ఫసల్‌, వాతావరణ బీమాకు రూ.1,344 కోట్లు కంపెనీలకు చెల్లించాలని కూటమి సర్కారు వెల్లడించింది. ఆ మొత్తాన్నీ తాము చెల్లించి రైతులకు బీమా పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. రూ.2 వేల కోట్లకుపైన ఇప్పటికీ చెల్లించలేదని సమాచారం. సమగ్ర పంటల బీమా పేరిట కేంద్ర పథకాలతో కలిసి 2024-25 రబీ నుంచి బీమా అమలు చేస్తోంది. ఉచిత పంటల బీమాను ఎత్తేసింది. బీమా చేయించుకోవడాన్ని రైతుల ఇష్టాఇష్టాలకు వదిలేసింది. 2024 ఖరీఫ్‌ మట్టుకు ఉచిత పంటల బీమాను అమలు చేసింది. పూర్తి స్థాయిలో ప్రీమియం చెల్లించలేదు. కేంద్రం సైతం తగిన విధంగా తన వాటా నిధులివ్వలేదు. దాంతో విపత్తుల్లో పంటలు కోల్పోయిన రైతులెవ్వరికీ పరిహారం అందలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -