సిఐటియు డిమాండ
నవతెలంగాణ – జోగులంబ గద్వాల
కేరళ తరహాలో కేంద్ర ప్రభుత్వం దేశావ్యాప్తంగా 17 రకాల వెల్ఫేర్ బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో జరిగిన హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ మూడవ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం అక్కడి ప్రభుత్వం 17 రకాల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసిందని,కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విదంగా కార్మికుల సంక్షేమం కోసం వెల్పేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కేరళ రాష్ట్రంలో హమాలీ కార్మికుడు చనిపోతే అక్కడి ప్రభుత్వం 16 లక్షలు పరిహారాన్ని చెల్లిస్తుందని,ప్రమాదం జరిగి గాయపడితే 7 లక్షల రూపాయలు అందిస్తున్నదని, విద్యా,గృహ అవసరాల కోసం రుణాలను అందిస్తుందని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తుందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఎగుమతి దిగుమతుల రంగంలో, వస్తు సేవలను అందించడంలో దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ప్రశ్నించారు.
ILO నిబంధనల ప్రకారం కార్మికుడి చేత 50 కేజీ ల కంటే ఎక్కువ బరువు చేయించకూడదని,కానీ హమాలీ కార్మికులతో క్వింటల్ కంటే ఎక్కువ బరువు పని చేయిస్తూ కార్మికుల అనారోగ్యాలకు కారణం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ రంగ కార్మికులకు పని ప్రదేశాలలో హమాలీ అడ్డాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని,హమాలీ కాలనీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.ప్రభుత్వ భూములను,10 శాతం స్థలాలను కబ్జాదారులు ఆక్రమించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం,అధికార యంత్రాంగం సంపద సృష్టికి మూలమైన కార్మిక వర్గానికి స్థలాలు కేటాయించడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదన్నారు.
అడ్డా మీది హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల కొన్ని సందర్భాలలో కూలీ పని దొరకక కుటుంబంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వము కార్మిక వర్గ ఉపాధికి ఎందుకు గ్యారెంటీ ఇవ్వటం లేదని ప్రశ్నించారు.నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేటి తరుణంలో హమాలీ కార్మికులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పని ప్రదేశాలలో ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు యాజమాన్యాలు బాధ్యత వహించకపోవడం వల్ల,ఇటు ప్రభుత్వం నుండి సహకారం అందించకపోవడం వల్ల గాయపడిన కార్మికుడు ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుందని, దీని వల్ల కుటుంబం మొత్తం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం వల్ల సంక్షేమ పథకాల అమలులో వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత హమాలీ రంగ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, గృహ అవసరాల కోసం ప్రభుత్వమే రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు మహాసభలకు ప్రారంభ సూచికగా హమాలీ సంఘం సీనియర్ నాయకులు బీముడు సీఐటీయు జెండాను ఎగరవేశారు.అనంతరం ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నూతన జిల్లా కమిటీని 21 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా గౌరవ అధ్యక్షులుగా వివి నరసింహ,జిల్లా అధ్యక్షులు గా బి. ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి గా నరేష్ ఉపాధ్యక్షులుగా బీమన్న, అంజి, గంగన్న కార్యదర్శులుగా బి. నర్సింహా, కుమార్, కోశాధికారిగా వీరేష్ కమిటీ సభ్యులుగా రఫీ,శ్రీను,నగేష్, ఈరన్న, నర్సింహా, మౌలాలి,పల్లెన్న,యాదన్న, కృష్ణ, సురేష్, నర్సింహా లను ఎన్నుకున్నారు. మహాసభలకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి,వివి నరసింహ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ, తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. వెంకటేశ్వర్లు, హమాలీ కార్మికులు నర్సింహా, బాలకృష్ణ,రఘు,రంగన్న,కృష్ణ,మల్లేష్, రాజన్న,రఫీ,వివిధ మండలాల నుండి వచ్చిన హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
తీర్మాణాలు.
1. భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీ కార్మికుల కు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
2. హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
3. హమాలీ కార్మికులకు ప్రత్యేక అడ్డా స్థలాలు కేటాయించి, షెడ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి.
4. హమాలీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
5.కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడాలి.
6.గద్వాల దాన ఫ్యాక్టరీ లో ఉత్పత్తిని నిరంతరం కొనసాగించి, కార్మికులకు ఉపాధి కల్పించాలి.
