Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయంబీఎండబ్ల్యూ కావాలా నాయనా !

బీఎండబ్ల్యూ కావాలా నాయనా !

- Advertisement -

వివాదాస్పదమైన లోక్‌పాల్‌ టెండర్‌
ప్రతిపక్షాలు, న్యాయ నిపుణుల ఆగ్రహం
ఒక్క అవినీతి కేసునూ విచారించకుండా ఇవేం సోకులని విమర్శలు


న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన లోక్‌పాల్‌ వ్యవస్థ 2014లో యూపీఏ ప్రభుత్వ ఓటమికి కూడా కారణమైంది. అనేక ఏండ్ల పాటు అంపశయ్యపై ఉంటూ నామమాత్రపు ఉనికితో నెట్టుకొస్తున్న లోక్‌పాల్‌ ఇప్పుడు ఒక్కసారిగా నిద్ర లేచింది. అంటే అవినీతి భరతం పట్టడానికి జూలు విదిల్చిందని అనుకుంటున్నారా? అబ్బే అదేం కాదు… తనకు ఒక్కోటి 70 లక్షల రూపాయల ఖరీదు చేసే ఏడు బీఎండబ్ల్యూ కార్లు కావాలంటూ టెండర్‌ పెట్టింది. మామూలు వాహనాలు తనకు సరిపడవని అనుకుందేమో తెలీదు కానీ విలాసవంతమైన కార్లనే అడుగుతోంది. ఈ నెల 16న కార్ల సరఫరాకు సంబంధించి టెండర్‌ జారీ అయింది. ఏడు బీఎండబ్ల్యూ 330 ఎల్‌ఐ ఎం స్పాట్‌ వాహనాలు కావాలని సరఫరాదారులను కోరారు.

ఈ తరహా కార్లు అత్యంత పొడవైనవి. విశాలంగా కూడా ఉంటాయి. వీటి క్యాబిన్‌ పూర్తిగా విలాసవంతంగా ఉంటుంది. ఎంపికైన సరఫరాదారు బీఎండబ్ల్యూ డ్రైవర్లకు, ఇతర సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించాలని, ఆ ఖర్చును పూర్తిగా అతనే భరించాలని టెండరులో నిర్దేశించారు. 2013వ సంవత్సరపు లోక్‌పాల్‌-లోకాయుక్త చట్టం ప్రకారం ఛైర్‌పర్సన్‌ జీతం, అలవెన్సులు, ఇతరత్రా సౌకర్యాలు భారత ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. లోక్‌పాల్‌ సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తికి మెర్సెడెస్‌ కారు, ఇతర న్యాయమూర్తులకు బీఎండబ్ల్యూలు ఇస్తున్నారు. ప్రస్తుతం లోక్‌పాల్‌గా వ్యవహరిస్తున్న ఏఎం ఖన్విల్కర్‌ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

అచేతనంగా ఆరేండ్లు
గత ఆరు సంవత్సరాల కాలంలోనూ లోక్‌పాల్‌ ఖాతాలో ఒక్క కీలక కేసును విచారించి శిక్ష విధించిన సందర్భం కూడా లేదు. అది దాదాపుగా అచేతనంగా ఉండిపోయింది. అలాంటిది ఇప్పుడు విలాసవంతమైన బీఎండబ్ల్యూల కోసం టెండర్‌ పిలవడం వివాదాస్పదం అవుతోంది. ఇది దుబారాకు, ఆడంబరానికి నిదర్శనమని ప్రతిపక్ష నేతలు, న్యాయ కోవిదులు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన న్యాయ కోవిదుడు ప్రశాంత్‌ భూషణ్‌ స్పందిస్తూ ‘లోక్‌పాల్‌ వ్యవస్థను మోడీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అనేక సంవత్సరాల పాటు దానిని ఖాళీగా ఉంచింది.

ఆ తర్వాత తన సేవకులను నియమించింది. వారేమో అవినీతిని పట్టించుకోరు. తమ విలాసాలతో ఆనందంగా ఉంటారు’ అని ఎద్దేవాచేశారు. అసలు లోక్‌పాల్‌ వ్యవస్థే నిరర్ధకమని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఉన్నప్పుడు లోక్‌పాల్‌ అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ వనరులను వృథా చేయడానికి, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, అధికారులకు పదవులు కట్టబెట్టడానికి మినహా దాని వల్ల ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. దీనికి బదులు విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐని బలోపేతం చేయాలని సూచించారు.

అవినీతిపరులతో లోక్‌పాల్‌
‘అవినీతి వ్యతిరేక ఉద్యమం కారణంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఆ ఉద్యమమే నరేంద్ర మోడీని ప్రధానిని చేసింది. ఆయన లోక్‌పాల్‌ను ఏర్పాటు చేశారు. అయితే అది కాగితంపై మాత్రమే కన్పిస్తోంది. ఇప్పుడు దానిని అవినీతి వ్యక్తులతో నింపారు. వారు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో రాజభోగాలు అనుభవిస్తున్నారు’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి షామా మహమ్మద్‌ విమర్శించారు.

కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ యశోవర్ధన్‌ ఆజాద్‌ కూడా లోక్‌పాల్‌పై విరుచుకుపడ్డారు. ‘ఒక్క అవినీతి కేసునైనా విచారించేందుకు లోక్‌పాల్‌ ఆపసోపాలు పడుతోంది. అయితే తన విధి నిర్వహణ కోసం అనువైన వాతావరణాన్ని కోరుకుంటోంది. అవినీతిపై మొదటిసారి పోరాటం చేయడానికి అవి సరిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. నీతి ఆయోగ్‌ మాజీ ఛైర్మన్‌ అమితాబ్‌ కాంత్‌ మరోలా స్పందించారు. ‘వారు ఈ టెండరును రద్దు చేసి మేక్‌ ఇన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయాలి. అవి ఉన్నత శ్రేణి వాహనాలు’ అని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -