జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి : ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయనందుకు నిరసనగా నవంబర్ 1న హైదరాబాద్‌లో ‘దళితుల ఆత్మగౌరవ మహాయాత్ర’ నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజేఐపై దాడికి వ్యతిరేకంగా తాము నిర్వహించే కార్యక్రమం యావత్ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసే విధంగా ఉంటుందని అన్నారు.
గవాయ్ పై దాడి జరిగి 15 రోజులు దాటినప్పటికీ ఇంత వరకు నిందితుడిపై కేసు నమోదు చేయకపోవడం, అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తరువాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలన్నారు. నవంబర్ 1న బషీర్‌బాగ్‌లోని డా.బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ఈ మహాయాత్ర ప్రారంభమై ట్యాంక్‌బండ్ వద్ద డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు.