ప్రయివేటు ఉద్యోగుల కోసం కేరళ అసెంబ్లీలో బిల్లు
తిరువనంతపురం : సుదీర్ఘమైన పని గంటలతో తీవ్రంగా పని ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమతుల్యతను పాటించలేకపోతున్న ప్రయివేటు ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు కేరళ అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారు. కేరళ రైట్స్ టు డిస్‌కనెక్ట్ బిల్ పేరుతో తీసుకువచ్చే ఈ ప్రయివేటు మెంబర్ బిల్లును చీఫ్ విప్, కంజిరాపల్లి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.జయరాజ్ ప్రవేశపెట్టనున్నారు. ఆఫీసు పనిగంటలకు మించి అధికంగా శ్రమిస్తున్న ప్రయివేటు రంగ ఉద్యోగులను కాపాడడమే ఈ బిల్లు లక్ష్యం. ఆఫీసు పనిగంటలు ముగిసిన తర్వాత పనికి సంబంధించిన కాల్స్, ఇ మెయిల్స్, సమావేశాలు, లేదా సందేశాలు వీటన్నింటినీ ఉద్యోగులు పట్టించుకోకుండా, విస్మరించే హక్కును ఈ బిల్లు కల్పిస్తుంది. తమను విధుల నుంచి తొలగిస్తారేమో, ప్రమోషన్లు ఇవ్వరేమో అనే భయం లేకుండా ఉద్యోగులు ఈ చర్యలు తీసుకోవచ్చు. మితిమీరిన పనిభారం, లేఆఫ్‌లు లేదా ఎలాంటి చెల్లింపులు లేకుండా ఓవర్‌టైమ్ చేయడం వంటి వాటికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రాంతీయ జాయింట్ లేబర్ కమిషనర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇబ్బందుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే గణనీయమైన చర్యగా ఉద్యోగ సంఘాలు ఈ బిల్లును అభివర్ణించాయి. కేరళ రాష్ట్ర ఐటి ఉద్యోగుల సంక్షేమ సంస్థ అయిన ప్రతిధ్వని దీనిపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. అయితే ప్రయివేటు మెంబర్ బిల్లు చట్టంగా మారడమంటే చాలా కష్టమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికన్నా అదనపు పనిగంటలు పనిచేస్తే అదనంగా చెల్లింపులు ప్రవేశపెట్టడం ఆచరణాత్మమైన ప్రత్యామ్నయమని వారు సూచిస్తున్నారు.
సుదీర్ఘమైన పనిగంటల నుంచి రిలీఫ్
- Advertisement -
- Advertisement -