– నిజాంపేట్ రాజీవ్ గృహకల్పలో ఘటన
– నిందితులకు రిమాండ్
– ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-నిజాంపేట్
ఉన్నత విద్యకు అడ్మిషన్ కోసమంటూ స్నేహితున్ని నమ్మి వెంట వచ్చిన విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేశారు. మద్యం మత్తులో స్నేహితునితోపాటు అతని మిత్రుడు కలిసి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువతి తమిళనాడు చెన్నైలోని లిగం కళాశాలలో బయో మెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో అజరు బీటెక్ చదువుతున్నాడు. ఇరువురికి మంచి స్నేహం ఏర్పడటంతో ఉన్నత విద్య అడ్మిషన్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లొద్దామంటూ అజరు ఆమెకు సూచించాడు. అందుకు సమ్మతించిన ఆమె ఈ నెల 3న అజరుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిజాంపేట రాజీవ్ గృహకల్పలో నివసించే అజరు మిత్రుడు హరి ఫ్లాట్‌కు ఇరువురు వచ్చారు. 3వ తేదీ రాత్రి ముగ్గురు పార్టీ చేసుకుని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో అజరు తన స్నేహితురాలిపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ తర్వాత హరి కూడా ఆమెపై లైంగికదాడి చేశాడు. ఆ సమయంలో యువతి ప్రతిఘటిస్తూ.. గట్టిగా కేకలు వేస్తూ గొడవ చేసింది. దాంతో ఇరుగుపొరుగు వారు గమనించి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 4న బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించినట్టు బాచుపల్లి పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి
- Advertisement -
- Advertisement -