Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంపారిశ్రామిక ఎస్టేట్లలో తగ్గనున్న పచ్చదనం

పారిశ్రామిక ఎస్టేట్లలో తగ్గనున్న పచ్చదనం

- Advertisement -

– నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ :
పారిశ్రామిక ప్రాజె క్టుల్లో చెట్లు, మొక్కల పెంప కానికి ఉద్దేశించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. పారిశ్రామిక ప్రాజెక్టులకు చెందిన భూభాగంలో 33 శాతం చెట్లు, అడవుల పెంపకం చేపట్టాలని గతంలో నిబంధనలు ఉండేవి. సవరించిన నిబంధనల ప్రకారం పారిశ్రామిక ఎస్టేట్లు 10 శాతం విస్తీర్ణంలో ప్లాంటేషన్‌ చేపడితే సరిపోతుంది. ఇక పరిశ్రమ అయితే తన ప్రాజెక్ట్‌ ప్రాంతంలో 15 శాతాన్ని గ్రీన్‌ బెల్ట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు, పరిశ్రమలకు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గ్రీన్‌ బెల్ట్‌ విస్తీర్ణాన్ని కుదించింది. ఈ మేరకు గత నెల 29న ఆఫీస్‌ మెమొరాండం జారీ చేసింది. తాజా నిబంధనలు పాటించినప్పుడే వాటికి పర్యావరణ అనుమతులు మంజూరవుతాయి. మంత్రిత్వ శాఖ చిట్టచివరిసారిగా 2006లో గ్రీన్‌ బెల్ట్‌ నిబంధనలు రూపొందించింది.

నూతన నిబంధనల ప్రకారం పారిశ్రామిక ఎస్టేట్లలో కనీసం పది శాతం విస్తీర్ణాన్ని కామన్‌ గ్రీన్‌ ఏరియాగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే హెక్టారుకు రెండున్నర వేల చెట్లను పెంచాలి. ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ యజమాని వీటిని అభివృద్ధి చేయాలి. ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లో పరిశ్రమ పెట్టే ప్రతి ఒక్కరూ కేటగిరీని బట్టి తమ ప్రాంగణంలో కనీసం 10-15 శాతం గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయాలి. గ్రీన్‌ బెల్టులు సాధ్యమైనంత వరకూ కాలుష్య వనరుకు సమీపంలో ఉండాలి. పారిశ్రామిక ఎస్టేట్ల వెలుపల పరిశ్రమలు నెలకొల్పే వారు తమ ప్రాజెక్టులో 10-25 శాతాన్ని గ్రీన్‌ బెల్ట్‌ కోసం కేటాయించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -