Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంజీఎస్టీ శ్లాబులు తగ్గినా వసూళ్లు ఫుల్‌

జీఎస్టీ శ్లాబులు తగ్గినా వసూళ్లు ఫుల్‌

- Advertisement -

అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్ల రాబడి
తెలంగాణలో 10 శాతం వృద్ధి
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబులను కుదించినప్పటికీ పన్ను వసూళ్లు రికార్డ్‌ స్థాయిలోనే నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 4.6 శాతం వృద్ధితో రూ.1.96 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. 2024 ఇదే నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు కాగా.. అది ఈ ఏడాది పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.1.89 లక్షల కోట్ల చొప్పున రాబడి నమోదైంది. గడిచిన నెలలతో పోల్చి చూసినప్పుడు సగటున 9 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం.

తెలంగాణలో పెరుగుదల.. ఏపీలో తగ్గుదల
తెలంగాణలో గడిచిన నెలలో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.5,726 కోట్లకు చేరాయి. ఇక్కడ 2024 ఇదే నెలలో రూ.5,211 కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను వసూళ్లు పెరుగుదలను నమోదు చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నమైన గణంకాలు నెలకొనడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఏపీలో జీఎస్టీ వసూళ్లు 9 శాతం తగ్గి రూ.3,490 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో రూ.3,815 కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. 2024 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు తెలంగాణకు కేంద్రం రూ.26,306 కోట్ల జీఎస్టీ వాటా చెల్లించింది. 2025 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు చెల్లించిన మొత్తం రూ.26,334 కోట్లుగా ఉన్నది. అంటే కేంద్రం చెల్లింపులు మూడు శాతం పెరిగాయి. ఇక ఏపీకి కేంద్రం చెల్లించిన జీఎస్టీ వాటా రూ.19,171 కోట్ల నుంచి రూ.19,696కి పెరిగింది. మూడు శాతం పెరుగుదల నమోదైంది.

అక్టోబర్‌లో భారీగా విక్రయాలు
కిచెన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ సహా మొత్తం 375 రకాల ఉత్పత్తులను జీఎస్టీ తక్కువ రేటు శ్లాబులోకి మార్చిన విషయం తెలిసిందే. గతంలో 5, 12, 18, 28 శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 నుంచి 5 శాతం, 12 శాతాలకు పరిమితం చేశారు. దసరా నవరాత్రుల ప్రారంభం నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ రేట్లను తగ్గిస్తామని ఆగస్టు 15న ప్రధాని మోడీ ప్రకటించగా.. అనేక మంది వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అక్టోబర్‌లో భారీగా విక్రయాలు జరిగాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘దేశీయం’గా రూ.1.45 లక్షల కోట్లు
అక్టోబర్‌ మొత్తం వసూళ్లలో రూ.1.45 లక్షల కోట్లు దేశీయ వినియోగం నుంచి రాగా.. దిగుమతులపై సుంకాల ద్వారా రూ.50,884 కోట్లు సమకూరాయి. జీఎస్టీ రిఫండ్స్‌ రూ.26,934 కోట్లు మినహాయిస్తే నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సెంట్రల్‌, స్టేట్‌, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ అన్నీ అక్టోబర్‌ నెలలో వృద్ధిని నమోదు చేశాయి. సెస్‌ వసూళ్లు మాత్రం తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2017లో జీఎస్టీని అమలు చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం కావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -