జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది…బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు
అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం
సొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన ఘనుడు కేటీఆర్..
ఇక్కడి సమస్యలకు బీఆర్‌ఎస్సే కారణం
నవీన్ యాదవ్‌ను 30వేల మెజార్టీతో గెలిపించండి
రోడ్డు షోలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
”బీజేపీ, బీఆరెస్‌ది ఫెవికాల్ బంధం. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇచ్చి నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించే బాధ్యతను నేను తీసుకుంటాను” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం రాత్రి బోరబండ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, తదితర ప్రాంతాల్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. బోరబండ కార్నర్ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెట్టాలని అడుగుతున్నారనీ, నవీన్‌యాదవ్ విజయయాత్రకు మళ్లీ వచ్చి ఈ చౌరస్తాకు పీజేఆర్ చౌరస్తాగా పేరు పెట్టుకుందామని అన్నారు. గత ఎన్నికల్లో అజారుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామనీ, జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి మీ ముందుకు తీసుకొచ్చామని అన్నారు. కారు షెడ్డుకు పోయిందనీ, బిల్లా రంగాలు ఆటోల్లో తిరిగి మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఇవాళ కొత్తగా జూబ్లీహిల్స్‌లో సమస్యలు వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. 2007లో పీజేఆర్ చనిపోతే ఏకగ్రీవం చేయాలంటే అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి సమస్యలను పరిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెప్తే ఇక్కడి జనం నమ్మరన్నారు. అందరికీ రేషన్ కార్డులు ఇచ్చామనీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలందరికీ సన్నబియ్యం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. 2014 నుంచి ఒక్క ఆడబిడ్డకూ మంత్రి పదవి ఇవ్వలేదనీ, తమ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా కేటీఆర్ జూబ్లిహిల్స్ సమస్యలను పరిష్కరించ లేదన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్.. సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని అన్నారు. నవీన్‌ను 30వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ లోపయికారి ఒప్పందం చేసుకోవడంతోనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని సుల్తాన్‌నగర్ హనుమాన్ ఆలయం నుంచి జనప్రియ వరకు రోడ్డు షోలో పాల్గొన్నారు.
వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ రోడ్డుషోలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రిగా తానే ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్న నందమూరిని అభిమానించని వారంటూ ఎవరూ ఉండరని, అటువంటి మహౌన్నత వ్యక్తి విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుపడ్డ దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ దుర్మార్గుడిని మూసీలో వేసి బొంద పెడతానన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



