– రంజీ ట్రోఫీ ప్లేట్ టైటిల్ సొంతం
– ఫైనల్లో మేఘాలయపై 5 వికెట్లతో గెలుపు
హైదరాబాద్ క్రికెట్‌కు కాస్త ఊరట!. గత సీజన్లో ఎలైట్ నుంచి ప్లేట్‌కు దిగజారిన హైదరాబాద్.. ఈ ఏడాది రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ చాంపియన్‌గా అవతరించింది. గ్రూప్ దశ నుంచి నాకౌట్ వరకు ఎదురులేని విజయాలు సాధించిన హైదరాబాద్ అప్రతిహాత విజయ యాత్రతో మళ్లీ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లోకి అడుగుపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయతో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించాడు.
నవతెలంగాణ-హైదరాబాద్
రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ చాంపియన్‌గా హైదరాబాద్ నిలిచింది. నాలుగు రోజులుగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో మేఘాలయపై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన హైదరాబాద్..అజేయ రికార్డుతో ఎలైట్ గ్రూప్‌లోకి ప్రవేశించింది. 198 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ తిలక్ వర్మ (64, 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైస్ కెప్టెన్ రాహుల్ సింగ్ (62, 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరువగా.. రోహిత్ రాయుడు (34, 61 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (26, 41 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. రోహిత్ రాయుడు, తిలక్ వర్మ గెలుపు ముంగిట నిష్క్రమించినా.. నితీశ్ రెడ్డి (3 నాటౌట్), చందన్ సహాని (8 నాటౌట్) లాంఛనం ముగించారు. మేఘాలయ బౌలర్లలో సంగ్మా (3/47) మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మేఘాలయ 304 పరుగులు చేయగా.. రాజ్ బిశ్వ (64), ఆకాశ్ చౌదరి (50), సచ్‌దేవ్ సింగ్ (46) ఆకట్టుకున్నారు. నితీశ్ రెడ్డి (122), ప్రజ్ఞయ్ రెడ్డి (102) శతకాలతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది. రాజ్ బిశ్వ (100), సచ్‌దేవ్ సింగ్ (81) వీరోచిత ఇన్నింగ్స్‌లతో మేఘాలయ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేసింది. హైదరాబాద్‌కు 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5/103, రెండో ఇన్నింగ్స్‌లో 5/86తో మాయజాలం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో హైదరాబాద్‌కు విలువైన ఆధిక్యం అందించిన నితీశ్ రెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ప్లేట్ లీగ్‌లో అజేయ రికార్డుతో చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్.. రంజీ ప్లేట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ సీజన్‌లో హైదరాబాద్ తరఫున తనరు త్యాగరాజన్, తన్మరు అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశారు. తనరు త్యాగరాజన్ 14 ఇన్నింగ్స్‌ల్లో 14.98 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అందులో ఏకంగా ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఓపెనర్ తన్మరు అగర్వాల్ రికార్డు ట్రిపుల్ సెంచరీ సహా 8 ఇన్నింగ్స్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు సాధించాడు. తనరు త్యాగరాజన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలువగా.. తన్మరు అగర్వాల్ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
స్కోరు వివరాలు :
మేఘాలయ తొలి ఇన్నింగ్స్ : 304/10
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : 350/10
మేఘాలయ రెండో ఇన్నింగ్స్ : 243/10
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ : తన్మయ్ (సి) సంగ్మా 0, రాహుల్ సింగ్ (సి) ఆకాశ్ (బి) సంగ్మా 62, తనరు త్యాగరాజన్ (సి) ఏరియన్ (బి) సంగ్మా 26, తిలక్ వర్మ (సి) కిషన్ (బి) బిశ్వ 64, రోహిత్ రాయుడు (సి) సచ్‌దేవ్ (బి) బోర 34, నితీశ్ రెడ్డి నాటౌట్ 3, చందన్ సహాని నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (34.2 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం : 1-0, 2-88, 3-109, 4-191, 5-193.బౌలింగ్ : సంగ్మా 7-0-47-3, ఆకాశ్ 9-0-52-0, దీపు 5-0-16-0, బోర 2.2-0-13-0, స్వరజిత్ 1-0-4-0, రాజ్ బిశ్వ 7-0-49-1, సచ్‌దేవ్ 3-0-16-0.