10లక్షల నజరానా

10లక్షల నజరానా–  రంజీ ఎలైట్‌ నెగ్గితే రూ. 1 కోటి బహుమానం
– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు రంజీ జట్టుపై కాసుల వర్షం కురిపించాడు. రంజీ ట్రోఫీ ప్లేట్‌ విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు రూ.10 లక్షలు నజరానా సహా టోర్నీలో ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసిన క్రికెటర్లకు రూ.50 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించాడు. రంజీ ట్రోఫీ ప్లేట్‌ ఫైనల్‌ బహుమతి ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్‌మోహన్‌ రావు.. హైదరాబాద్‌ క్రికెటర్లలో సరికొత్త ఉత్తేజం నింపాడు. ‘హైదరాబాద్‌ మళ్లీ రంజీ ఎలైట్‌కు చేరటం సంతోషం. ప్లేట్‌ లీగ్‌ విజేతలుగా నిలిచిన జట్టుకు అభినందనలు. రానున్న మూడేండ్లలో ఎలైట్‌ ట్రోఫీ నెగ్గితే జట్టుకు రూ.1 కోటి బహుమానంతో పాటు ప్రతి ఒక్క ఆటగాడికి బిఎండబ్ల్యూ కారు బహుమతిగా అందజేస్తామని’ ప్రకటించాడు. ‘ఈ సీజన్‌లో హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి గొప్ప మద్దతు లభించింది. అన్ని విధాలుగా జట్టుకు సహకారం అందించారు. ఆటగాళ్లుగా మాది ఒకటే లక్ష్యం. రంజీ ట్రోఫీ ఎలైట్‌ విజేతలుగా నిలువటం. భారీ నగదు బహుమతి ప్రకటన క్రికెటర్లలో సరికొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. ప్లేట్‌ చాంపియన్స్‌గా నిలువటం పట్ల సంతోషంగా ఉంది’ అని హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ అన్నాడు.

Spread the love