మాయావీ తనయ్!

Mayavi Tanay!– 56 వికెట్లతో హైదరాబాదీ మాయ
– రంజీ ప్లేట్‌ విజయంలో ముఖ్యపాత్ర
నవతెలంగాణ-హైదరాబాద్‌
రంజీ ట్రోఫీ ప్లేట్‌ లీగ్‌. రంజీ ట్రోఫీని ముద్దాడిన మూడో జట్టుగా ఘన కీర్తి కలిగిన హైదరాబాద్‌.. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో అవమానకర రీతిలో ప్లేట్‌ లీగ్‌కు పడిపోయింది. పసికూన జట్లతో పోరాటం కావటంతో హైదరాబాద్‌ శిబిరంలో నైరాశ్యం. విజయం దక్కినా..అందుకు తగిన విలువ ఉంటుందా అనే సంశయం. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు సమావేశమైనప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లేట్‌ లీగ్‌లో విజయాలు హైదరాబాద్‌కు ముఖ్యం కాదు. ఎన్ని సెషన్లు, ఎన్ని రోజుల్లో మ్యాచ్‌ ముగించామనేది కీలకం. నాలుగు రోజుల మ్యాచ్‌ను రెండు రోజుల్లోనే ముగించాలనే స్వీయ సవాల్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌ స్వీకరించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌ గ్రూప్‌ దశలో ఐదు మ్యాచుల్లోనూ రెండు రోజుల్లోనే విజయాలు సాధించింది. జట్టులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రత్యర్థి బ్యాటర్లను మాయ చేసిన స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ హైదరాబాద్‌ను గెలుపు పథాన నడిపించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 14.98 సగటుతో ఏకంగా 56 వికెట్లు పడగొట్టాడు. అందులో ఏకంగా ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. హైదరాబాద్‌ బ్యాటింగ్‌కు తన్మయ్ అగర్వాల్‌, తిలక్‌ వర్మ, రాహుల్‌ సింగ్‌, రోహిత్‌ రాయుడులు నాయకత్వం వహించగా.. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా వికెట్ల వేట సాగించిన తనయ్ త్యాగరాజన్‌ స్పిన్‌ దళానికి, వికెట్ల జాతరకు సారథిగా నిలిచాడు. టైటిల్‌ పోరులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్లతో జట్టు విజయంలో కీలక భూమిక వహించాడు. సహచర బౌలర్లు పరుగులు ధారాళంగా ఇచ్చినా.. తనయ్ త్యాగరాజన్‌ గొప్పగా కట్టడి చేశాడు. జట్టుకు వికెట్‌ అవసరమైన ప్రతిసారి కెప్టెన్‌ బంతిని తనయ్ త్యాగరాజన్‌కు అందించాడు. కండ్లుచెదిరే రీతిలో 56 వికెట్లు పడగొట్టిన తనయ్ త్యాగరాజన్‌ హైదరాబాద్‌ మాయావీగా నిలిచాడు!.
 తనయ్ త్యాగరాజన్‌ 
రంజీ ప్లేట్‌లో ఆడటం నిరాశకు లోను చేసింది. కానీ ఓ సవాల్‌గా తీసుకుని బరిలోకి దిగాం. మా తదుపరి లక్ష్యం రంజీ ట్రోఫీ ఎలైట్‌ టైటిలే. ఈ సీజన్లో బౌలింగ్‌ను ఆస్వాదించాను. సొంతగడ్డ అనుకూలత సైతం కలిసొచ్చింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌కు సన్నద్ధం అవుతాను. త్వరలోనే పంజాబ్‌ కింగ్స్‌ శిబిరంలో చేరబోతున్నాను. అక్కడి కోచింగ్‌ సిబ్బందితో కలిసి టీ20ల్లో బ్యాటర్లకు కట్టడి చేసేందుకు అవసరమైన టెక్నిక్‌, వేరియేషన్‌పై దృష్టి సారిస్తాను.

Spread the love