పట్టు బిగిస్తున్న టీమిండియా

Team India is tightening its grip– జైస్వాల్‌ సెంచరీ
– ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన సిరాజ్‌
రాజ్‌కోట్‌: మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 319పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 196పరుగులు చేసింది. దీంతో భారతజట్టుకు ఇప్పటికే 322పరుగుల ఆధిక్యత లభించింది. యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(104; 133 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) సెంచరీకి తోడు శుభ్‌మన్‌ గిల్‌(65 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. వైజాగ్‌ టెస్టులో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యశస్వీ.. రాజ్‌కోట్‌లోనూ వీరంగం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిక్సర్లతో విరుచుకు పడిన యంగ్‌స్టర్‌ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ కొట్టాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో బౌండరీతో శతకం పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడో శతకం ఖతాలో వేసుకున్నాడు. రోహిత్‌ శర్మ(30) ఔటయ్యాక కొంతసేపు నిదానంగా ఆడిన యశస్వీ ఆ తర్వాత వేగంగా ఆడాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 బాదిన యశస్వీ.. ఆతర్వాత హర్ట్లేను ఉతికారేస్తూ రెండు సిక్సర్లు కొట్టాడు. దాంతో, స్కోర్‌ బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా యశస్వీ రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత వచ్చిన రజత్‌ పాటిదార్‌(0) డకౌట్‌ కాగా.. నైట్‌ వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌(3 నాటౌట్‌) జాగ్రత్తగా వికెట్‌ కాపాడుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ రెండు వికెట్ల నష్టానికి 207పరుగులతో మూడో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ను హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కట్టడి చేశాడు. కుల్దీప్‌, జడేజా కూడా స్పిన్‌లో చెలరేగడంతో ఇంగ్లండ్‌ 319 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(153) ఔటయ్యాక.. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(41) ఫర్వాలేదనిపించాడు. లంచ్‌ తర్వాత పేసర్‌ సిరాజ్‌, జడేజా విజృంభించడంతో 20 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌కు నాలుగు, జడేజా, కుల్దీప్‌కు రెండేసి, అశ్విన్‌, బుమ్రాకు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్‌:
445ఆలౌట్‌
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 319ఆలౌట్‌
ఇండియా రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 104, రోహిత్‌ శర్మ (ఎల్‌బి)రూట్‌ 19, శుభ్‌మన్‌ (బ్యాటింగ్‌) 68, రజత్‌ పటీధర్‌ (సి)రెహాన్‌ అహ్మద్‌ (బి)హార్ట్‌లీ 0, కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 3, అదనం 5. (51ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 196పరుగులు.
వికెట్ల పతనం: 1/30, 2/191
బౌలింగ్‌: ఆండర్సన్‌ 6-1-32-0, రూట్‌ 14-2-48-1, హార్ట్‌లీ 15-2-42-1, మార్క్‌ వుడ్‌ 8-0-38-0, రెహాన్‌ అహ్మద్‌ 8-0-31-0

Spread the love