సాహిత్య జిహ్వ ‘అజగవ’

సాహిత్య జిహ్వ 'అజగవ'మాధ్యమాల ప్రభావంతో ‘పుస్తకరూప’ సాహిత్యం కాస్త ‘దశ్యరూపం’, ‘శ్రావ్యరూపం’గా కోరుకొనే ఆధునికతరం మొదలైంది. తెలుగువారికి ఆ కోవలో ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని అందించే ఆవశ్యకతను తన ‘అభిలాష’గా చేసుకొని ‘సంతప్తి’నే సంపదగా పరిగణిస్తే తెలుగు శ్రోతలకు ‘అజగవ’ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విశాలంగా సాహిత్యాన్ని ‘విని’పిస్తున్న రాజన్‌ పిటిఎస్కే (పెట్ల త్రిసత్య కామరాజన్‌)తో ముఖాముఖి నేటి జోష్‌ …సాహిత్యాన్ని మాధ్యమాల ద్వారా విస్తరణ, ఆదరణ కలిగించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది?
హైస్కూల్‌ రోజుల నుండే నా ఆప్తమిత్రుడు వేగేశ్న వెంకట మురళీకష్ణంరాజు, నేను చందమామ కథల గురించి, షాడో డిటెక్టివ్‌ నవలల గురించి అబ్బురంగా మాట్లాడుకునేవాళ్ళం. అలా మా చిన్నప్పుడే చిన్నపాటి సాహితీగోష్ఠులు జరుపుతుండేవాళ్లం. ఆ తరువాత కాలంలో మరో ఆప్తమిత్రుడు కత్తివెంటి గుర్నాథ్‌ శ్రీకాంత్‌, నేను కలిసి సినీ సాహిత్యాన్ని ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం. ఆ తరువాత కాలంలో ఇలా ఎవరితో అయినా చర్చలు చేస్తున్నప్పుడో, పుస్తకాలు చదువుతున్నప్పుడో, ప్రకతిలో ఏకాంతంగా గడుపుతున్నప్పుడో నాలో కలిగే భావాలను కవితల రూపంలోనో, వ్యాసాల రూపంలోనో డైరీలో రాసుకుంటూ ఉండేవాడిని. ‘ఇలా నీ రాతలన్నీ డైరీలలో ఉండిపోతే ఎవరికి ఉపయోగం అంటూ బలవంతంగా నాతో బ్లాగు పెట్టించినవాడు నా మరో ఆప్త మిత్రుడు అజరు వేగేశ్న. అలా ‘నా..గోల’ అనే బ్లాగు పెట్టి చాలా కవితలు, వ్యాసాలు, పద్యాలు రాశాను. ఆ తరువాత కాలంలో అజరు ‘బొమ్మలాట’ ఛానల్‌లో సినీ గీతరచయితలైన చైతన్యప్రసాద్‌, అనంత శ్రీరామ్‌ లను ఇంటర్వ్యూలు కూడా చేశాను.
ఇక్కడ మరో ముగ్గురు ప్రియమిత్రుల గురించి కూడా చెప్పుకోవాలి. హైదరాబాదులో నా జీవితం మొదలవ్వడానికి ఊతమిచ్చినవాడు వేగేశ్న సత్యనారాయణ రాజైతే, జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా అండగా నిలబడుతుండేవాడు దండు కళ్యాణ వర్మ. అలానే మరో ఆప్త మిత్రుడైన ఉద్దరాజు రంగరాజుతో చేసే చర్చలు, వాదోపవాదాలు నేను విషయాలను కొత్త కోణంలో చూడడానికి ఉపయోగపడుతుంటాయి.
ఇక ఫేస్‌బుక్‌, కోరా వంటి మాధ్యమాలలో ఇప్పటికి సుమారుగా 150కి పైగా సాహిత్య వ్యాసాలను రాశాను. 2019లో ‘కథా పరిచయ సప్తాహం’ పేరుతో రోజుకు మూడుకథలుగా, ఏడురోజుల్లో మొత్తం 21 తెలుగు కథల పరిచయ వ్యాసాలు రాశాను. వాటిలో చలం, కొ.కు, విశ్వనాథ, రావిశాస్త్రి, చాసో, మధురాంతకం రాజారాం ఇలా ప్రసిద్ధ కథకుల కథలన్నాయి. ఆ తరువాత ‘కవితా పరిచయ షట్కం’ పేరుతో కష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, నారాయణరెడ్డిగార్ల కవిత్వంపై వరుసగా ఆరురోజులపాటూ సుదీర్ఘమైన పరియచ వ్యాసాలు రాశాను. ఒక్కో వ్యాసం సుమారుగా 20పేజీలు నిడివితో ఉంటుంది. ఇంకా పింగళి నాగేంద్రరావు ‘జేబున్నీసా, మల్లాది రామకష్ణశాస్త్రి ‘చలవ మిరియాలు’, వేటూరి ‘సిరికాకొలను చిన్నది…’ ఇలా సుమారు 50 అపురూప పుస్తకాలను ఫేస్‌బుక్‌ పాఠకులకు పరిచయం చేశాను.
2019 జూలైలో యుట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాలనుకున్నప్పుడు ఛానల్‌ పేరు ఏం పెడదామా అని పెద్దగా ఆలోచించలేదు. అప్పటికే ‘అజగవ’ అన్న పేరంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. ఈ అజగవ అన్న పేరును అమరకోశంలో మొదటిసారిగా చూశాను. అజగవ అంటే పరమశివుడి ధనస్సు పేరు. ఆ పేరంటే నాకు ఎందుకో అభిమానం ఏర్పడింది. అందుకే అజగవ ఛానల్‌ ఒక సాహితీ ధనువనీ, నేను చెప్పే సాహిత్య విషయాలే ఆ ధనువు నుండి వచ్చే సాహిత్య బాణాలనీ ఊహించుకుంటూ మన ఛానల్‌కు అజగవ అన్న పేరు ఖాయం చేశాను. ”వేటూరిగారొస్తున్నారు” అనే నా ఖీaషవదీశీశీస పోస్టులు అందులో మొదటి వీడియోగా పెట్టాను. దర్శకులు, హీరో, హీరోయిన్లు వేటూరిగారి పాటలతో అంత్యాక్షరి ఆడుతున్నట్లుగా ఊహిస్తూ ఒక సరదాసన్నివేశాన్ని సష్టించి చేసిన రచన అది. అలా సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం మొదలైన అజగవలో ఇప్పటికి 350 వరకూ సాహిత్య వీడియోలు ఉన్నాయి.
మీలో సాహిత్య అభిలాష కలిగించిన వ్యక్తులు… రచయితలు… పుస్తకాలు?
సుశీల, ఘంటసాల పాటలు పాడతారని, యండమూరి, యద్దనపూడి నవలలు రాస్తారని, ఇవన్నీ నాకు అన్నం తినిపిస్తూనో, జోకొట్టి పడుకోబెడుతూనో మా అమ్మ చెప్పిన విషయాలే. రామాయణ, భారతాలలో ప్రధానపాత్రల గుణగణాలన్నీ వివరించి మరీ చెప్పేది. వంట చేసుకుంటూ రేడియోలోనో, టేప్‌ రికార్డర్‌లోనో సినిమా పాటలు, లలిత సంగీతం వినడం, పనంతా అయిపోయాక యద్దనపూడిదో, యండమూరిదో, మాదిరెడ్డి సులోచనదో నవల పట్టుకోవడం ఆవిడకు అప్పట్లో నిత్యకత్యాలు. అలానే రోజూ రాత్రి పడుకునేముందు మా నాన్నగారు నన్ను, మా అక్కను చెరోప్రక్కన పడుకోబెట్టుకొని పోతన భాగవత పద్యాలు, మొల్ల రామాయణ పద్యాలు శ్రావ్యంగా పాడి వినిపించేవారు. అప్పట్లో వాటి అర్థాలు తెలియకపోయినా, మా నాన్నగారి కంఠమాధుర్యానికో ఏమో పద్యాలంటే అభిమానం పెరిగింది.
ఒక్కోసారి మా అమ్మ సరదాగా పొడుపు కథలు అడుగుతుండేది. ఆ పొడుపులు విప్పడానికి మా నాన్నగారితో పాటూ, నేను మా అక్క కూడా తెగ ఆలోచించేసేవాళ్ళం. ఇక మా నాయనమ్మ చెప్పిన కథలు. అలా మా ఇంట్లో చిన్నపాటి సాహిత్య వాతావరణం ఉండేది. అందుకే సాహిత్యంలో నా తొలిగురువులు ఎవరు అంటే.. మా అమ్మ, నాన్న, నాయనమ్మ. తొలి సహాధ్యాయి మా అక్క. మూడో తరగతి చదివే రోజుల్లో మొదటిసారి చందమామ పరిచయం అయ్యింది. ఆ తరువాత పెరిగే కొద్ది యండమూరి నవలు చదివేవాణ్ని. నేను డిగ్రీ చదివే రోజుల్లో రోజూ మా భీమవరం శాఖా గ్రంథాలయంలో చలం, శ్రీపాద, మల్లాది, గురజాడ, జాషువా, కరుణశ్రీ, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కష్ణశాస్త్రి, కొడవటిగంటి, బుచ్చిబాబు, విశ్వనాథ ఇలా మహామహుల రచనలన్నీ అలా అక్కడ చదివినవే.
విద్యాభ్యాసం- వత్తి?
నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా భీమవరంలోనే. డిఎన్‌ఆర్‌ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఐదేండ్లు, ఈ-బుక్‌ పబ్లిషింగ్‌ రంగంలో పదేండ్లు పనిచేశాను. కొంతకాలంగా తెలుగు ఫ్రీలాన్స్‌ రైటర్‌గా పనిచేస్తూ, ‘అజగవ’ను నిర్వహిస్తున్న.
ఇప్పటివరకు మీ అజగవ ఛానల్‌ లక్షలాది మందికి చేరువైన క్రమం?
‘అజగవ’లో ఏ వీడియో పెట్టాలి అని ఆలోచించడం మొదలుకొని, అందుకు అసరమైన పుస్తకాలను చదవడం, అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి స్ప్రిప్ట్‌ తయారు చేసుకోవడం, ఆపై రీకార్డింగ్‌ చేయడం, చివరిగా ఎడిటింగ్‌ చేసి వీడియోను అప్‌లోడ్‌ చేయడం వరకూ… ఈ పనులన్నీ ఒక్కడినే చేసుకుంటాను. కావ్యాల గురించి చెప్పేటప్పుడు ఏ ఒక్కరి పుస్తకాన్నో కాకుండా, నాకు అందుబాటులో ఉన్న వ్యాఖ్యానాలన్నీ చదువుతాను. అందుకే నెలలో గరిష్టంగా 6, 7 వీడియోలను మించి పెట్టలేకపోతున్నాను. రోజులో కనీసం 12 నుండి 14 గంటల సమయాన్ని చదువుకోవడానికో, చదివింది నోట్సు రాసుకోవడానికో, అజగవకు వీడియోలు తయారు చేయడానికో వెచ్చిస్తుంటాను. అప్పుడప్పుడూ శరీరం అలసిపోయి కాస్త శ్రమ అనిపిస్తుంటుంది కానీ, మానసికంగా మాత్రం ఎప్పుడూ ఉల్లాసంగానే ఉంటుంది. వత్తి, ప్రవత్తి ఒక్కటే అయితే కలిగే లాభం అదే అనుకుంటాను.
చెప్పదలిచిన వస్తువు మీ ఐచ్చికమా? ప్రేక్షకుల ఇష్టం మేరకు ఉంటుందా?
సాధారణంగా అయితే నాకు నచ్చిన విషయాలనే చెబుతుంటాను. అయితే కొన్నిసార్లు అజగవను అభిమానించే వాళ్ళ డిమాండ్‌ అనుగుణంగా కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వీడియోలు చేస్తాను.
వినోదభరితమైన ఛానల్‌ కు వచ్చినంత గుర్తింపు సాహిత్య ఛానల్‌ కు రాదు. దీనికి కారణం ఏమై ఉంటుంది?
సాధారణంగా వినోదభరితమైన ఛానల్స్‌ ఎవరికైనా వెంటనే ఉల్లాసాన్ని ఇస్తాయి. అందుకే ఎక్కువ మంది వాటివైపు మొగ్గుచూపుతుంటారు. ఇక సాహితీ ఛానల్స్‌ విషయానికి వస్తే అవి చూడగానే ఆసక్తి కలిగించేలా ఉండకపోవచ్చు. మనకు తెలియని మనిషి, ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ లేకుండా, అలా సాదాసీదాగా చెప్పుకుపోతుంటే వినడం కాస్తంత కష్టంగానే ఉంటుంది కదా!! వీడియోలలో విషయం బావుంటే.. ఈరోజు కాకపోతే రేపైనా ఆ ఛానల్స్‌కు ఆదరణ పెరుగుతుంది. ఏ ప్రముఖులో వాటి గురించి షేర్‌ చేస్తే మంచి ఛానల్స్‌కు మరింత ప్రచారం లభిస్తుంది.
మీరు చేసిన అన్నిటిలోకెల్లా కాశీమజిలీ కథలకు ప్రత్యేక గుర్తింపు రావడాన్ని ఏవిధంగా పరిగణిస్తారు?
చాలామందికి తెలియకపోవచ్చును కానీ, కాశీమజిలీ కథలు ఇప్పటి సూపర్‌ హీరోస్‌ సినిమాలు, హారీపాటర్‌ సినిమాల కంటే బావుంటాయి. అద్భుతమైన వింతలు, వినోదాలతో సాగిపోయే ఆ కథలు ఒక్కసారి చదవడం అంటూ మొదలుపెడితే ఇక ఆపబుద్ధి కాదు. సుమారు 100 సంవత్సరాల క్రితం నాటివి కావడంతో ఆ పుస్తకాలలో గ్రాంథికం పాళ్ళు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆ కథలను చదువుకొని, వాటిని ఈనాటి వారికి అర్థమయ్యేలా సరళమైనభాషలో రాసుకుంటూ అజగవలో చెబుతున్నాను. మొత్తం 12 సంపుటాల కాశీమజిలీ కథలలో ఇప్పుటికి 5 సంపుటాలలోని కథలను 100 భాగాలుగా చెప్పాను. మిగిలిన భాగాలను కూడా చెప్పుకుంటూనే వెళతాను.
సాహితీ పిపాసులనుంచి స్పందన ఎలా ఉంటుంది?
సాహిత్యాభిమానుల ప్రోత్సాహమే అజగవకు ఇంధనం. అజగవలో ఉన్న వీడియోలు సుమారు 350 మాత్రమే అయినా, ఇప్పటికి ఆ వీడియోలు లక్షా డెబ్భై వేలసార్లకు పైగా షేర్‌ అయ్యాయి. పందొమ్మిది వేలకుపైగా కామెంట్లు వచ్చాయి. ఇంతటి అభిమానం కురిపించే సాహిత్యాభిమానులున్నప్పుడు నిరుత్సాహం కలిగే అవకాశం ఎక్కడ ఉంటుంది?
ఇతరుల మాదిరి వివాదాస్పదమైన, అర్థంలేని మీ వీడియోస్‌ కి ఉండవు. దానికి ఏమైన ప్రత్యేక ఉద్దేశ్యం ఉందా?
అజగవను ప్రారంభించేటప్పుడే రెండు నియమాలను పెట్టుకున్నాను. కేవలం భాషా, సాహిత్య, సంస్కతులకు సంబంధించిన విషయాలు, మానవజాతికి సేవ చేసిన మహనీయుల గురించిన విషయాలు తప్ప మరేవిధమైన విషయాల జోలికీ వెళ్లకూడదన్నది నా తొలినియమం. వీడియోలో ఏముందన్న విషయాన్నిThumbnails లో స్పష్టంగా, సరళంగా, సూటిగా చెప్పాలన్నది నా రెండవ నియమం. ఇంతవరకూ ఎప్పుడూ కూడా నా నియమాలను నేను తప్పలేదు.
సినిమా రంగం నుంచి ఆహ్వానాలు రాలేదా?
నేను అటువైపు వెళ్లడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ సినీమహాప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, నెగ్గుకురావడానికి అవసరమైన శక్తి సామర్ధ్యం నాకున్నాయని కూడా అనుకోవడం లేదు.
భావి ప్రణాళికలు?
ఇప్పుడు చేస్తున్న ఈ సాహితీ సేవను ఎప్పటికీ చేయగలగాలన్నదే నా కోరిక. అంతకుమించి ప్రత్యేక ప్రణాళికలంటూ ఏమీ లేవండి.
– బి. మదన్‌ మోహన్‌

Spread the love