మారని బానిసత్వం మనుషుల రవాణా

Invariable slavery is human traffickingపేదరికం, నిరక్షరాస్యత వంటి కారణాలు పేదలను అక్రమ రవాణా ఉచ్చులోకి నెట్టివేస్తున్నాయి. దీనికి బలైపోతుంది ఎక్కువగా మహిళలు, అమ్మాయిలు, పిల్లలు. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పుకునే దేశంలో ఆడబిడ్డలు అంగడి సరుకులై అక్రమ రవాణాకు బలవుతున్నారు. మహిళలు, అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. పిల్లల్ని బాలకార్మికులుగా మార్చేస్తున్నారు. జనవరి 11న ‘నేషనల్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అవేర్‌నెస్‌ డే’ సందర్భంగా ఈ ఆధునిక బానిసత్వంపై ఈ వారం ప్రత్యేక వ్యాసం…
దేశంలో 80 శాతం అక్రమ రవాణా లైంగిక దోపిడీ చుట్టూ నడుస్తోందని, మిగిలిన 20 శాతం వెట్టి చాకిరి, భిక్షాటన, వివాహాలు మొదలైన వాటి కోసం జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కఠినమైన జైలు శిక్ష, భారీ జరిమానాలు సైతం మానవ అక్రమ రవాణాను ఆపలేకపోతున్నాయి. దేశంలో ప్రతి గంటలకి ఎనిమిది మంది చిన్నారులు తప్పిపోతున్నారు. నలుగురు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇద్దరు లైంగిక దాడుల బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు వచ్చినా బాలికలు, మహిళల అక్రమ రవాణా పెడ ధోరణికి కళ్లెం పడటం లేదు. ఫలితంగా మహిళా సామాజిక భద్రత ఎండమావిగా మారింది.
లైంగిక దోపిడి రూపంలో…
ఈ రోజున ప్రతి ఏడాది ఒక థీమ్‌ తీసుకుని మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు. 2023లో ‘నీలిరంగు దుస్తులను ధరించి అవగాహన కల్పించడం’ అనే థీమ్‌ తీసుకున్నారు. ప్రతి ఏడాది యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ అంచనా ప్రకారం ఎక్కువ మంది ఆసియా ఖండం నుండి ఐరోపాకు అక్రమంగా రవాణా అవుతున్నారు. అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లైంగిక దోపిడి రూపంలో మానవ అక్రమ రవాణా ఇప్పటికీ ఓ సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అలాగే ఇలాంటి వారందరిని నిర్మాణ పనులు, వ్యవసాయం, క్యాటరర్లు, రెస్టారెంట్లు, దుస్తుల పరిశ్రమలు, గృహ పని, ఆరోగ్య సంరక్షణ, వినోదం, సెక్స్‌ వంటి పనుల్లో బలవంతపు కార్మికులుగా మారిపోతున్నారు.
ఈ నాటి విషయం కాదు
మానవ అక్రమ రవాణా అనేది ఈ నాటి విషయం కాదు. ఇది ఎన్నో వందల ఏండ్ల నుండి కొనసాగుతున్న దారుణం. మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే బానిస సమాజంలో మనుషులను బానిసలుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్టు వారిని ఉపయోగించుకునే వారు. ముఖ్యంగా మహిళలను లైంగిక కోర్కెలు తీర్చుకునే యంత్రాలుగా భావించేవారు. అలాగే 14 -18వ శతాబ్దం చివరి మధ్య జరిగిన బానిస వ్యాపారం గురించి మనలో చాలా మందికి తెలుసు. లక్షలాది మంది ఆఫ్రికన్లను యూరోపియన్లు అపహరించి వారిని తమ బానిసలుగా మార్చుకున్నారు. వారిని లైంగిక శ్రమ కోసం విక్రయించేవారు. స్పెయిన్‌, యుఎస్‌, హాలండ్‌, జర్మనీ, స్వీడన్‌, నార్వే వంటి దేశాలు శతాబ్దాలుగా ఈ పద్ధతిని కొనసాగించాయి. బానిసల తిరుగుబాటు ఫలితంగా గ్రేట్‌ బ్రిటన్‌ 1807లో అట్లాంటిక్‌ బానిస వ్యాపారాన్ని చట్టవిరుద్ధం చేయడంతో యునైటెడ్‌ స్టేట్స్‌ 1820లో దీనిని అనుసరించింది. 1863లో విముక్తి ప్రకటన చేసినపుడు చాలా యునైటెడ్‌ స్టేట్స్‌లో బానిసత్వం చట్టవిరుద్ధం చేశారు.1866లో పదమూడవ సవరణ ఆమోదించబడినప్పుడు యునైటెడ్‌ స్టేట్స్‌లో బానిసత్వం పూర్తిగా రద్దు చేయబడింది. ఇరవయ్యవ శతాబ్దపు చివరిలో, ఇరవై ఒకటవ శతాబ్దపు తొలిలో మానవ అక్రమ రవాణాపై పోరాటానికి సంబంధించిన ప్రచారం ముందడుగు వేసింది.
అవగాహన పెంచేందుకు
తర్వాత కాలంలో ట్రాఫికింగ్‌ బాధితుల రక్షణ చట్టం (2000) అనేది ఆధునిక బానిసత్వాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి ఒక చట్టంగా చేశారు. దీని కోసం ఫ్రీ ది స్లేవ్స్‌, యుఎస్‌లో బానిసత్వ వ్యతిరేక సంస్థ కూడా ఏర్పడింది. 2007లో యునైటెడ్‌ స్టేట్స్‌ సెనేట్‌ దేశంలో మానవ అక్రమ రవాణా ప్రాబల్యాన్ని గుర్తించి జనవరి 11వ తేదీని నేషనల్‌ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అవేర్‌నెస్‌ డేగా ఏర్పాటు చేసింది. 2010లో ప్రెసిడెంట్‌ ఒబామా జనవరిలో ట్రాఫికింగ్‌: మంత్‌ ఆఫ్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడానికి, ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చట్టవిరుద్ధమైన చర్యతో పోరాడుతున్న 50కి పైగా ప్రసిద్ధ సమూహాలు ఉన్నాయి. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈ సమస్య గురించి ఇప్పుడు మరింత అవగాహన కల్పించడం అత్యవసరంగా మారింది. అన్ని రకాలుగా అక్రమ రవాణాకు గురవుతున్న బాధితులను రక్షించడం, సాధికారత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఎన్ని చట్టాలు వచ్చినా ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,25,000 మంది ప్రజలు మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు.
ఆధునిక – ప్రాచీన బానిసత్వం మధ్య తేడాలు
ప్రభుత్వాలు ‘తెల్ల బానిసత్వం’ గురించి చర్చించడం ప్రారంభించాయి. వైట్‌ స్లేవ్‌ ట్రాఫిక్‌ అణిచివేత కోసం అంతర్జాతీయ ఒప్పందం 1904లో యూరోపియన్‌ చక్రవర్తులచే చట్టంగా చేయబడింది. 12 దేశాలు వైట్‌ స్లేవ్‌ ట్రాఫిక్‌ అణచివేత కోసం అంతర్జాతీయ సమావేశంపై సంతకం చేశాయి. లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ ద్వారా ‘తెల్ల బానిసత్వం’ అనే పేరును ‘మహిళలు – పిల్లల ట్రాఫికింగ్‌’ అని మార్చారు.
ఉచితంగా దోచుకుంటున్నారు
మానవ అక్రమ రవాణాకు క్లీవ్‌ల్యాండ్‌ ప్రధాన కేంద్రంగా చెప్పుకోవచ్చు. స్త్రీ-పురుష, వయసు, జాతి, సంస్కృతి అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. మనుషుల శ్రమను ఉచితంగా దోచుకుంటున్నారు. ఇది కూడా ఓ రకమైన బానిసత్వమే. అయితే దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నవారు మహిళలు, పిల్లలు, యుక్తవయస్కులు, నిరాశ్రయులు, వలసదారులు. ఒక్కోసారి వారికి తాము అక్రమ రవాణాకు గురయ్యామని కూడా తెలియదు. దీని వల్ల చాలా మంది బాధితులు సహాయం పొందలేక పోతున్నారు. ఒక వేళ తెలిసినా ఇతరులను సహాయం అడగడానికి భయపడతారు.
మహిళల అక్రమ రవాణా
మానవ అక్రమ రవాణా అంటే మనుషులను అమ్ముకోవడం. ఇది ఒక రకమైన ఆధునిక బానిసత్వం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయసుల వారు ఈ సమస్యకు బలౌతున్నారు. బలవంతపు పని కోసం అక్రమ రవాణా చేయడం, కొన్ని రకాల ఉద్యోగాల్లో బలవంతంగా ఉంచడం, సెక్స్‌ వర్కర్లుగా మార్చడం, గనుల్లో, పరిశ్రమల్లో, ఇళ్ళలో వారిని పని వారిగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి మహిళలు, పిల్లలను అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో కాస్త పేదవారిని, కోపంతో ఇండ్ల నుండి వచ్చేసినవారిని వీరు టార్గెట్‌ చేస్తారు. వారికి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, మెరుగైన జీవితం ఉంటుందని నమ్మించి అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. ఇలా అమాయకంగా ఎంతో మంది ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
అవయవాల కోసం…
అభివృద్ధి చెందిన దేశాలల్లో అనేక ఆరోగ్య సమస్యల వల్ల అవయవ మార్పిడికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మనుషులను అక్రమ రవాణా చేసి వారి అవయవాలను అమ్మేసుకుంటున్నారు. దీని వల్ల బాధితుల ఆరోగ్యం, జీవితాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి దారుణాలన్నీ ఎటువంటి వైద్యపరమైన రక్షణ లేకుండా రహస్యంగా ఆపరేషన్లు చేసి మనుషుల అవయవాలు తీసేసుకుంటున్నారు.
అక్రమ వ్యాపారాలలో ఒకటి
మానవ అక్రమ రవాణా అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన, భయంకరమైన అక్రమ వ్యాపారాలలో ఒకటి. మనుషులను స్వచ్ఛందంగా లేదా అసంకల్పితంగా తరలించడమే మానవ అక్రమ రవాణా. అంటే కిడ్నాప్‌, అపహరణ, మోసం, బలప్రయోగం, మోసపూరిత ఉద్యోగాలు ఇవ్వడం. ఇవన్నీ ఇందులో భాగాలే. కొందరినైతే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు. అక్రమ రవాణాకు గురైన బాధితులలో శారీరక, మానసిక వేధింపుల వల్ల వారిలో ఆందోళన, నిరాశ, భయాలు వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరి కోసం పని చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆ ఊబి నుండి వారిని బయటపడేందుకు కృషి చేస్తున్నాయి.

న్యాయ సలహాలు
అక్రమ రవాణా నుండి బయటపడిన బాధితులకు న్యాయ సలహాలు చాలా అవసరం. జీవిత భాగస్వాముల నుండి విడాకులు, పిల్లల సంరక్షణ వంటి అవసరాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి వారి అవసరాలను గుర్తించి అండగా నిలబడే వ్యవస్థ మనకు అవసరం. వారు చేసిన శ్రమకు వేతనం పొందేలా చూడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రాణాలతో బయటపడిన వారికి సంక్షేమపథకాలు, నివాసం చాలా చాలా అవసరం. కొన్నిసార్లు బాధితులు వ్యభిచార ఊబిలో దిగి ఆ నేరాలను నెత్తిన మోయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి అన్ని విషయాల్లో వారికి న్యాయ సలహాలు చాలా అవసరం.
ప్రాధమిక హక్కులకు దూరమవుతున్నారు
ప్రపంచవ్యాప్తంగా పురుషులు, మహిళలు, పిల్లలతో సహా లక్షలాది మంది ప్రజలు దేశంలో లేదా సరిహద్దుల ద్వారా వివిధ ప్రయోజనాల కోసం అంటే బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ, బలవంతపు వివాహాల కోసం అక్రమ రవాణా చేయబడుతున్నారు. దాదాపు 800,000 మంది మహిళలు లైంగిక దోపిడీ కోసం అంతర్జాతీయ సరిహద్దులను దాటుతున్నారు. వీరిలో 54 శాతం మందిని మధ్య ఆసియా, ఐరోపాకు, 25 శాతం ఆగేయాసియాకు, 14 శాతం ఆఫ్రికాకు, 7 శాతం మందిని అమెరికాకు పంపుతున్నారు. గ్లోబల్‌ సర్వే ఇండెక్స్‌ 2016లో ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలలో దాదాపు 45.8 మిలియన్ల మంది మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారని పేర్కొంది. అలాగే కొన్ని నివేదికల ప్రకారం మానవ అక్రమ రవాణా వల్ల ప్రతి ఏడాది 150 బిలియన్‌ డాలర్లకు మించి ఆదాయం పొందుతున్నారు. ఆసియా ప్రాంతంలో ఏడాదికి 51.8 బిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ అక్రమ లాభాల కారణంగా పెద్ద సంఖ్యలో అక్రమ రవాణా చేయబడిన స్త్రీలు, పురుషులు, పిల్లలు, బాధితులు తమ స్వేచ్ఛ, ప్రాథమిక మానవ హక్కులకు దూరం చేయబడుతున్నారు. ఏడాదికి దాదాపు 5.5 మిలియన్ల మంది పిల్లలు బలవంత కార్మికులుగా మారిపోతున్నారు.
ఆసియా దేశాల్లోనే ఎక్కువ
మహిళలు మాత్రమే కాకుండా అబ్బాయిలు, ట్రాన్స్‌జెండర్లు కూడా అక్రమ రవాణాకు గురవుతున్నారు. సాధారణంగా మానవ అక్రమ రవాణా అనేది అత్యంత క్రూరమైన నేరం. డ్రగ్స్‌, ఆయుధాల తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చట్టవిరుద్ధమైన లాభదాయక నేరంగా ఇది పరిగణించబడుతుంది. ఆసియాలోని పాకిస్తాన్‌, ఇండియా, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, చైనా, మలేషియా, శ్రీలంక, ఫిలిప్పైన్‌, నేపాల్‌, థాయిలాండ్‌, మయన్మార్‌ వంటివి మానవ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్న దేశాలు. ఈ దేశాలలో మానవ అక్రమ రవాణా వల్ల ప్రతి ఏడాది లక్షలాది మంది బాధితులుగా మారుతున్నారు. ఆసియా దాదాపు 44 మిలియన్‌ కిమీ పరిమాణంతో, 4.6 బిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద ఖండంగా ఉంది. ఇటువంటి భౌగోళిక పరిస్థితులు, అధిక జనాభా వల్ల ఆసియా దేశాల నుండే ఎక్కువ మంది సామాజిక, ఆర్థిక, రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రపంచీకరణ ప్రభావం కూడా ఈ దేశాలపై అధికంగా ఉంది. వీసాలు సులభంగా దొరకడం, అక్రమంగా జొరపడే అవకాశం కూడా ఈ దేశాలకు అధికంగా ఉంది. దీని వల్ల మానవ అక్రమ రవాణాకు ఇతర నేర కార్యకలాపాలు ఆసియా దేశాల్లోనే విపరీతంగా పెరుగుతున్నాయి.
దేశంలో పరిస్థితి...
దేశంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ ప్రకారం 2021లో 90113 మంది బాలికలు, 375058 మంది మహిళలు తప్పిపోయారు. ఆ ఏడాది ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సదర్భంగా జులై 30న కైలాస్‌ సత్యర్ధి చిల్డ్రన్‌ ఫౌండేషన్‌, ది గేమ్స్‌ సంస్థలు విడుదల చేసిన లెక్కలు, భారతదేశంలో చిన్నారుల అక్రమ రవాణా నివేదిక – 2022లోని అంశాలు చిన్నారుల భద్రతపై ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ సంస్థలు 21 రాష్ట్రాల్లో 264 జిల్లాల్లో నమోదైన కేసులు ఆధారంగా చిన్నారుల అక్రమ రవాణాపై కీలక అంశాలను వెల్లడించాయి. దేశంలో కరోనా తర్వాత చిన్నారుల అక్రమ రవాణా కేసులు పెరిగాయని తేలింది. మన రాష్ట్రంలో 2016-20 మధ్య కాలంలో 19 బాలల అక్రమ రవాణా కేసులు నమోదు కాగా కరోనా తర్వాత 2021-22లో 56 కేసులు నమోదు అయ్యాయి. బాల్యం ఆనందంగా గడపాల్సిన చిన్నారులను అక్రమ రవాణా ముఠాలు దుస్తుల ఫ్యాక్టరీలు, కాస్మోటిక్‌ ఇండిస్టీలు, హౌటల్స్‌, దాబాలు, ఆటోమొబైల్స్‌ ఇండిస్టీల్లో బాల కార్మికులుగా పెడుతున్నారు.
రాష్ట్రంలోనూ ఎక్కువే…
దేశ వ్యాప్తంగా ఆడ, మగా పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా సాగుతున్నది. మహిళలను వ్యభిచార రొంపిలోకి, పిల్లల్ని వెట్టిచాకిరిలోకి దించుతున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 2019-21 మధ్య కాలంలో 6,111 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 2021 ఏడాదిలో దేశంలో 2,189 కేసులు రిజిస్టర్‌ కాగా, వాటిలో 87 శాతం కేసుల్లో మాత్రమే చార్జిషీట్స్‌ దాఖలయ్యాయి. మానవ అక్రమ రవాణా తెలంగాణలో కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర, కేరళ, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో 2021లో 347 కేసులు నమోదు చేశారు. 98 శాతం కేసులలో చార్జిషీట్‌ నమోదు చేశారు.
చట్టాల బలోపేతం అవసరం
సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా మానవ అక్రమ రవాణా సమస్య పూర్తిగా అంతం కావడం లేదు. ఆ ఆధునిక భానిసత్వం అంతం కావడం లేదు. ఆర్టికల్‌ 23(1) ప్రకారం భారత రాజ్యాంగం మనుషులు లేదా వ్యక్తుల అక్రమ రవాణాను నిషేధించింది. అక్రమ రవాణా ముప్పుని ఎదుర్కోవడానికి సమగ్ర చర్యలు తీసుకోవడానికి క్రిమినల్‌ లా సవరణ చట్టం – 2013, లైంగిక నేరాల నుంచి పిల్లలు రక్షణ పొందేందుకు పోక్స్‌ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నూతన బాల కార్మిక సవరణ చట్టం-2016, విద్యా హక్కు చట్టం-2009, బాలల న్యాయ చట్టం-2015 వంటి ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చింది. అయినా వీటి వల్ల పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదు. జిల్లా స్థాయిలలో మహిళల హెల్ప్‌ డెస్క్‌, యాంటి ట్రాఫికింగ్‌ సెల్‌ అత్యవసర పరిస్థితులకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 112, స్మార్ట్‌ ఫోలిసింగ్‌ వ్యవస్థల ఏర్పాటు వల్ల కొంత మేర అక్రమ రవాణా తగ్గినా సమస్యను పూర్తి స్థాయిలో అంతమొందించడం లేదు. అక్రమ రవాణా ఉచ్చు నుంచి చిన్నారులను, మహిళలను రక్షించడం కీలకమైన అంశం. కాబట్టి వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టి బాలికలు, మహిళల పట్ల సామాజిక దృక్పథాన్ని సానుకూలంగా మార్చినప్పుడే ఆశించిన ఫలితాలు నెరవేరుతాయి.
– సలీమ,
94900 99083

Spread the love