సాహో ఇస్రో.. జయహో భారత్

అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలలో భారతదేశం తిరుగులేని శక్తిగా అవతరించిది అనటానికి చంద్రయాన్‌-3 విజయమే నిదర్శనం. అవమానాలతో ప్రారంభమై, ఆధిపత్యం దిశగా సాగిన భారతదేశ అంతరిక్ష పరిశోధనా ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమైనదే కాదు, అనుసరణీయమైనది కూడా.
ఈ విజయం ఒక్క రోజులో సాధించినది కాదు. వైఫల్యాలు అందించిన చేదు ఓటమిలకు కుంగి పోకుండా, అపజయాల పాఠాల నుండి నేర్చుకున్న గుణపాఠాలనే గెలుపు బాటలుగా నిర్మించుకున్న చరిత ఇది. చంద్రునిపై ఎటువంటి తడబాటు లేకుండా (సాఫ్ట్‌ ల్యాండింగ్‌) సురక్షితంగా చంద్రుని మీద దిగిన నాలుగవ దేశంగా రికార్డు సృష్టిస్తే, చంద్రుని దక్షిణ ధృవప్రాంతంలో వ్యోమనౌకను దింపిన మొదటి దేశంగా భారత్‌ ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఒక కొత్త చరిత్రను లిఖించింది. ఏ విజయమైనా ఆకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడదు. దాని వెనుక అకుంఠిత దీక్ష, అంతులేని శ్రమ, అన్నింటికీ మించి వెలకట్టలేని త్యాగాలూ ఉంటాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్‌ సాధించిన ఈ విజయ పరంపరంలో ఎంతో మంది శ్రమ, మరెంతో మంది త్యాగాలు ఉన్నాయి. దేశమంతా చంద్రయాన్‌-3 సాధించిన విజయాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ఈ సమయంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన రంగ ప్రస్థానానికి పాదులేసిన శాస్త్రవేత్తల త్యాగాలను మననం చేసుకుంటూ ఈ కవర్‌ స్టోరీ…
చందమామ రావే… జాబిల్లి రావే… కొండెక్కి రావే… గోగు పూలు తేవే… అంటూ మారాం చేస్తున్న పిల్లల్ని బుజ్జగించడానికి తల్లులు పాడే పాట ఇది. ఆది నుండి మానవజాతికి చందమామతో విడదీయరాని బంధముంది. భూమికి సహజ సిద్ధమైన ఉపగ్రహం చంద్రుడు. తెలుగు సాహిత్యంమే కాదు, భారతీయ సాహిత్యంలో చంద్రుని మీద, వెన్నెల మీద వచ్చినంత సాహిత్యం మరే గ్రహం మీదా రాలేదు. అంతగా విడదీయరాని బంధమేదో పెనవేసుకు పోయింది చందమామతో మానవ జాతికి. అప్పటి నుండి చందమామను చేరుకోవాలన్న తలంపు మానవ మేధో మస్తిష్కాలలో మొగ్గ తొడిగింది. అది ఇన్నాళకి ఫలించింది. ముచ్చటగా మూడవ ప్రయత్నంలో భారత్‌ చందమామను చేరుకుంది. ఇది అంతరిక్ష పరిశోధనా రంగంలో తిరుగులేని సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది భారత్‌.
ఇస్రోని మోసిన బోయిలు వీరే…
ప్రభువెక్కిన పల్లకీ కాదోయి… అది మోసిన బోయీలెవ్వరు అంటాడు మహాకవి శ్రీశ్రీ. భారత అంతరిక్ష పరిశోధనా రంగం నేడు సాధించిన ఈ విజయాల వెనుక ఎంతో మంది జ్ఞాన త్యాగాలతో పాటు ప్రాణ త్యాగాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది తన యావత్‌ జీవితాలను పణంగా పెట్టి సాధించిన సాంకేతిక ఆవిష్కరణలే ఈ నాడు దేశం సాధించిన విజయానికి బాటలు వేసాయి. 60వ దశకంలో బుడిబుడి నడకలతో అంతరిక్ష పరిశోధనలో ప్రవేశించిన భారత్‌ 2023 నాటికి ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా అవతరించిందంటే అది ఎంతో మంది త్యాగాల ఫలితంగానే సాధ్యమయ్యింది. అటువంటి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన తరుణమిది. చంద్రయాన్‌ -3 విజయవంతం అయిన తర్వాత ఇస్రో డైరెక్టర్‌ సోమనాథ్‌ అన్న మాటలు ఇదే అంశాన్ని బలపరుస్తాయి. ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత సోమనాథ్‌ మాట్లాడుతూ ‘ఇది ఇప్పుడు మొదలైన ప్రయాణం కాదు, తరతరాలుగా ఇస్రో శాస్త్రవేత్తలు వేసిన బాట ఇది. అది ఇప్పుడు విజయపధం దిశగా పెద్ద ముందడుగు అయ్యింది’ అన్నారు.
స్వాతంత్య్రం రాక ముందే భారతదేశంలో సాంకేతిక పరిశోధన సంస్ధలకు అంకురార్పణ ప్రారంభమయ్యింది. భారతదేశంలో సాంకేతిక ప్రగతికి దారులేసిన దార్శనికుల్లో హోమీ జహాంగీర్‌ బాబా ఒకరు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్‌లో పిహెచ్‌డి పట్టా అందుకున్న హోమీబాబా స్వదేశానికి తిరిగి వచ్చి భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. న్యూక్లియర్‌ ఎనర్జీని విదుశ్ఛక్తిగా మార్చడానికి తాను చేస్తున ప్రయోగాలకు సరైన ప్రోత్సాహం లభించక పోవటంతో ఆవేదన చెందిన బాబా భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటాకి సాంకేతిక రంగాలలో పరిశోధనకు చేయూతనివ్వాలని 1943 ఆగస్టు 19న లేఖ రాశారు. టాటా నుండి సానుకూల స్పందన రావటంతో 1944 మార్చి 12న న్యూక్లియర్‌ ఎనర్జీని విద్యుశ్ఛక్తిగా మార్చే పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టు నమూనాను పంపించారు. దాంతో 1945 జూన్‌ 1న టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్స్‌ అనే పరిశోధనా సంస్ధ ప్రారంభమయ్యింది. దీనికి హెచ్‌జె బాబా తొలి డైరక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుండి భారతదేశంలో అణుశక్తికి సంబంధించిన పరిశోధనల శకం ప్రారంభమయ్యిందని చెప్పాలి. ఈ రంగంలో విశేషమైన సేవలందించినందుకు గాను హోమీ జహాంగీర్‌ బాబాని భారత అణు కార్యక్రమ పితామహుడు అని పిలుస్తారు. భారత దేశం ఆయన సేవలని గౌరవించి పద్మభూషణ్‌తో సత్కరించింది. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం భారత ప్రధాని జవహార్‌ లాల్‌ నెహ్రు నేతృత్వంలో ఏర్పాటైన అటామిక్‌ ఎనర్జీ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటులో హోమీ బాబా కీలకమైన పాత్రను పోషించటంతో పాటు, ఆ సంస్ధకు తొలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుండి భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రోత్సాహమివ్వటంతో పాటు, వాటికి కావాల్సిన నిధులని మంజూరు చేయటం ద్వారా భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు దారులేసిన దార్శనికుల్లో ఒకరిగా హోమీ బాబా గుర్తింపు పొందారు. భారతదేశంలో ఏర్పాటైన తొలి రాకెట్‌ లాంఛింగ్‌ స్టేషన్‌ ఏర్పాట్లలో కూడా ఆయన తన వంతు పాత్రను పోషించారు. 1962లో విక్రం సారాభాయితో కలిసి ‘ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ రీసెర్చి (ఇన్‌కాస్‌పర్‌) అనే సంస్ధను ఏర్పాటు చేశారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఈ సంస్ధ ఏర్పాటు ఒక తొలి అడుగు. 1966లో జనవరి 24న ఆస్ట్రియాలోని యియన్నాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఎజెన్సీ యొక్క సాంకేతిక సలహాదారుల సమావేశానికి వెళుతూ మార్గమధ్యలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఇది ప్రమాదం కాదు, అమెరికా చేసిన కుట్ర అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా భారతదేశంలో అణుశాస్త్రం, అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శకుడిగా నిలిచిన హోమీ బాబా 1966లో మరణించారు.
16వ శతాబ్దం నాటి చర్చే తొలి రాకెట్‌ లాంఛింగ్‌ స్టేషన్‌….
భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏర్పాటైన తర్వాత దేశంలో పరిశోధనకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా దేశంలో రాకెట్‌ లాంఛింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని విక్రమ్‌ సారాభాయి నేతృత్వంలోని పరిశోధకుల బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. భూమి యొక్క ఇమాజినరీ, మాగటిక్‌ ఈక్వేటర్‌ భూమికి తాకే ప్రదేశంలో రాకెట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సరిగ్గా ఎర్త్స్‌ మాగటిక్‌ ఈక్వెటర్‌ భూమిని తాకుతున్న ప్రదేశంలో త్రివేండ్రంలోని తుంబాలో ఉన్నట్టు గుర్తించారు. ఏదైతే రాకెట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ ప్రదేశంలో ఒక చర్చి ఉంది. విక్రమ్‌ సారాభాయి బృందం వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆ చర్చి ఫాదర్‌ బెర్నార్డ్‌ పీటర్‌ ఫెరీరాను కలిసి ఆ చర్చిలో అంతరిక్ష పరిశోధనలకు అనుమతి ఇవ్వాలని కోరటంతో, ఆ చర్చి ఫాదర్‌ ఒక ఆదివారం ఒక సమావేశం ఏర్పాటు చేసి ‘మన మత విశ్వాసాల కన్నా, దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని’ అక్కడ ఉన్న క్రైస్తవులను ఒప్పించి ఆ ప్రాంతంలో అంతరిక్ష పరిశోధనలు జరుపుకోడానికి అనుమతి ఇచ్చాడు. ఆ విధంగా భారత దేశ మొదటి అంతరిక్ష ప్రయోగశాల తుంబాలోని మేరీ మాగ్దలీనా చర్చిలో ప్రారంభమయ్యింది. ఆ తర్వాతి కాలంలో ఆ సెంటర్‌ ‘తుంబా ఇక్వొటేరియల్‌ రాకెట్‌ లాంఛింగ్‌ స్టేషన్‌గా నామకరణం చేసుకుని అనేక అంతరిక్ష పరిశోధనలకు కేంద్ర బిందువయ్యింది.
1969లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం స్ధానంలో ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధ ఏర్పాటులో కీలకమైన పాత్రను పోషించిన డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయి ఇస్రోకి మొదటి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన భారత అంతరిక్ష పరిశోధనకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ని భారత అంతరిక్ష పరిశోధన పితామహుడుగా పిలుస్తారు. మిస్సైల్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు గడించిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఈయన శిష్యుడే. హోమీబాబా, విక్రం సారాభాయి తర్వాత ఎంజికే మీనన్‌, సతీష్‌ధావన్‌, యు.ఆర్‌.రావు, కస్తూరి రంగన్‌, మాధవ్‌ నాయర్‌, కె. రాధాకృష్ణన్‌, శైలేష్‌ నాయక్‌, ఎ.ఎస్‌. కిరణ్‌కుమార్‌, కె. శివన్‌ వంటి శాస్త్రవేత్తలు అందించిన సేవలే భారతదేశాన్ని ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధనల్లో అజేయమైన శక్తిగా నిలబెట్టాయి.
చంద్రయాన్‌కి తొలి అడుగులు ఇలా పడ్డాయి…
నిజానికి చంద్రుని చేరుకోవాలన్న ఆలోచన 90 దశకంలో పురుడు పోసుకుంది. 1999 సంవత్సరంలో జరిగిన ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ సమావేశంలో తలెత్తిన ఈ ఆలోచనను ఆచరణలోనికి తీసుకు రావడానికి భారత అంతర్జాతీయ పరిశోధనా సంస్ధ (ఇస్రో) ‘జాతీయ ల్యూనార్‌ మిషన్‌ టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ అనేక అంశాలను పరిశీలించి చంద్రునిపై ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల శక్తి సామర్ధ్యాలు భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయని తన నివేదికను సమర్పించింది. 2003 ఏప్రిల్‌లో దేశంలోని వివిధ రంగాలకు చెందిన 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, ప్రముఖులు సమీక్షించి ఈ నివేదికపై ఆమోదముద్ర వేశారు. దీంతో 2003 ఆగస్టు 15వ తేదిన నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి భారత్‌ దేశం ‘మిషన్‌ చంద్రయాన్‌’ను చేపడుతుందని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇస్రో చంద్రయాన్‌ సంబంధించిన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది ఇస్రో .
శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్‌ 22న చంద్రయాన్‌-1ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారతదేశం నుండి విజయవంతంగా చంద్రునిపైకి వెళ్లిన మొదటి వ్యోమనౌక ఇది. ప్రపంచంలోనే చంద్రుని ఉపరితలంపై నీటి అణువుల జాడను కనుగొన్న మొదటి వ్యోమగామిగా చంద్రయాన్‌-1 చరిత్రను సృష్టించింది. చంద్రుని ఉపరితలానికి సంబంధించిన త్రిడీ చిత్రాలను పంపించటంతో పాటు, అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించింది. అనంతరం చంద్రయాన్‌-1 అందించిన స్ఫూర్తితో 2019 జూలై 22న శ్రీహారికోట నుండి చంద్రయాన్‌-2ని ప్రయోగించింది. చంద్రయాన్‌-2లోని విక్రం ల్యాండర్‌ చంద్ర మండలంపై దిగుతున్న సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల విక్రమ్‌ ల్యాండర్‌ నుండి విడిపోయిన ‘మూన్‌ ఇంఫాక్ట్‌ ప్రోబ్‌’ అనే పేలోడ్‌ చంద్రుని ఉపరితలాన్ని వేగంగా ఢ కొట్టటంతో ఆ ప్రయోగం విఫలమయ్యింది.
చంద్రయాన్‌-2లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ చంద్రయాన్‌ 3కి ఇస్రో శ్రీకారం చుట్టింది. సుమారు 615 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3ని 2023 జూలై 14వ తేదీ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు శ్రీహారికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుండి విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్‌ 3 వ్యోమనౌకలో 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్‌ రోవర్‌, 1.749 కిలోల బరువున్న విక్రమ్‌ లాండర్‌, అత్యంత కీలకమైన 26 కిలోల ప్రజ్ఞాన్‌ రోవర్‌లో భారత దేశానికి చెందిన ఆరు ఇండియన్‌ పేలోడ్లతో పాటు అమెరికా నాసాకు చెందిన ఒక పేలోడ్‌ను అమర్చి ప్రయోగించారు. ఈ వ్యోమనౌక సుమారు 41 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధృవం మీద విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా లాండ్‌ అయ్యింది. సుమారు నాలుగు గంటల అనంతరం ఆరు చక్రాలతో ప్రజ్ఞాన్‌ రోవర్‌ లాండర్‌ నుండి బయటికి వచ్చి తన పరిశోధనను ప్రారంభించింది. ఇది మరొక 14 రోజుల పాటు చంద్రునిపై ప్రయాణించి అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు, ఖనిజ నిక్షేపాలకు సంబంధించిన సమాచారం, నీటి వనరులు, నేలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రోకి పంపిస్తుంది. దీంతో చంద్రుని దక్షిణ ధృవం మీదకి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన మొదటి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చంద్రునిపై ఉపగ్రహాన్ని సురక్షితంగా దింపిన నాలుగవ దేశంగా నిలిచింది. రానున్న రోజుల్లో ప్రజ్ఞాన్‌ రోవర్‌ పంపించిన సమాచారం భారత కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేస్తుందనటంతో సందేహం లేదు.
మేధనే కాదు మట్టిని కూడా అందించిన తమిళనాడు…
ప్రపంచ విఖ్యాత అంతరిక్ష పరిశోధనకారుడు ఎపిజె అబ్దుల్‌ కలాం జన్మరాష్ట్రమైన తమిళనాడు భారత దేశం చేపట్టిన మిషన్‌ చంద్రయాన్‌లో అరుదైన పాత్రను పోషించింది. వరుసగా జరిగిన చంద్రయాన్‌ 1, 2, 3 లకి నేతృత్వం వహించిన వ్యక్తులు తమిళునాడుకు చెందిన వారే కావటం విశేషం. 2008లో భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-1కి ప్రఖ్యాత శాస్త్రవేత్త మయిల్‌స్వామి అన్నాదురై నేతృత్వం వహించారు. చంద్రుని పైకి చేరుకోవడానికి జరిగిన పరిశోధనలో మయిల్‌ స్వామి ఎంతో కృషి చేశారు. ఆయన కృషికి గౌరవంగా ఆయన్ని ‘మూన్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. 2019లో జరిగిన చంద్రయాన్‌-2కి ఎం. వనిత నేతృత్వం వహించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో)కు చెందిన ‘ఇంటర్‌ ప్లాంటరీ మిషన్‌’కి నేతృత్వం వహించిన మొదటి మహిళగా వనిత చరిత్ర సృష్టించారు. ఇక భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్ధ సాంకేతిక సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చంద్రయాన్‌-3కి తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త వీరముత్తవేల్‌ నేతృత్వం వహించారు. చంద్రయాన్‌-2 వైఫల్యం తర్వాత తిరిగి దానిలోని లోపాలను సరిదిద్ది అందుకు పదిరెట్లు సమర్ధవంతంగా మిషన్‌ చంద్రయాన్‌-3ని విజయవంతం చేయటంతో వీరముత్తవేల్‌ కృషి అపారమైనది.
శాస్త్రవేత్తలే కాదు తమిళనాడుకు చెందిన మట్టి కూడా చంద్రయాన్‌-3 విజయవంతం కావటంలో తన వంతు సహాకారం అందించటం మరొక విశేషం. చంద్రుని దక్షిణ ధృవం మీద పరిశోధనలు చేయడానికి సరిగ్గా దేశానికి దక్షిణ భాగంలో ఉన్న తమిళనాడులోని ఒక కుగ్రామం చంద్రయాన్‌ ప్రయోగాలకు మట్టిని అందించింది. చంద్రునిపై రోవార్‌ను దింపినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులుంటాయి, అక్కడి మట్టి, నేల స్వభావానికి తగినట్టుగా రోవర్‌ ప్రయాణాన్ని ఎలా రూపొందిచాలని అని శాస్త్రవేత్తలు ఆలోచించినప్పుడు చంద్రమండలంలోని మట్టిని పోలిన మట్టి వారికి అవసరమైంది. చంద్రయాన్‌-1లో చంద్రమండలంలో ఉన్న మట్టిని పోలిన మట్టిని అమెరికా నుండి కిలో 15వేల రూపాయలకి కొనుగోలు చేశారు. ఇది ఆర్ధికంగా పెనుభారంగా మారింది. దీనిని అధిగమించడానికి భారతదేశంలో అటువంటి మట్టి కోసం అన్వేషణ ప్రారంభించారు. తమిళనాడులోని నమ్మక్కల్‌ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలలో అదే మాదిరిగా ఉన్న మట్టి నిక్షేపాలను కనుగొన్నారు. చంద్రుని ఉపరితలం మీద ఉండే మృత్తిక ‘అనర్తోసైట్‌’ రకానికి చెందింది. చంద్రయాన్‌ 2లో ఈ మట్టిని పరిశోధనలకు వినియోగించారు. అది విఫలమైన తర్వాత నిర్వహించిన చంద్రయాన్‌ 3లో అదే మట్టిని పరిశోధనల కోసం వినియోగించారు. నామక్కల్‌ జిల్లాలోని కున్నామలై అనే గ్రామం నుండి సేకరించిన సుమారు 50 టన్నుల మట్టిని చంద్రయాన్‌ 3 ప్రయోగాలకు వినియోగించారు. అంతకు ముందు సేలంలోని పెరియార్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జియాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనలలో ఈ జిల్లాలోని కొన్ని గ్రామాలలోని మన్ను అనర్తొసైట్‌ రకానికి చెందినదని గుర్తించారు. ఈ రకంగా తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలే కాదు, అక్కడి మట్టి కూడా దేశం గర్వించదగ్గ ఒక చారిత్రాత్మక విజయంలో తన వంతు భాగస్వామ్యాన్ని అందించింది.
చంద్రునిపై పత్తి విత్తనాలు మొలకెత్తించిన చైనా….
చంద్రునిపై వ్యోమనౌకను సురక్షితంగా దింపిన దేశాలలో చైనా మూడవది. చంద్రుడిపైకి లూనా 1 అనే వ్యోమనౌకను 1959 జనవరిలో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి దేశంగా రష్యా నిలిచింది. సరిగ్గా ఏడు సంవత్సరాల తరువాత లూనా 9ని చంద్రునిపై సురక్షితంగా దింపిన తొలిదేశంగా మరొక రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత 1969 జూలై 20న అమెరికా మానవ సహిత వోమనౌకను విజయవంతంగా చంద్రుని మీద దింపింది. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో మొదటిసారి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ అల్డ్రిన్‌లు చంద్రునిపై కాలు పెట్టిన మొదటి మానవులుగా చరిత్ర నెలకొల్పారు. అప్పటి నుండి 1972 డిసెంబర్‌ వరకు జరిగిన వివిధ ప్రయోగాల ద్వారా సుమారు 12 మంది చంద్రునిపై కాలు మోపారు. 1972 డిసెంబర్‌ 14న జీన్‌ సెర్నాన్‌, జాక్‌ స్మిట్‌ల పర్యటనే ఆఖరి మానవ సహిత చంద్ర మండల యాత్రగా నిలిచిపోయింది. వీటన్నింటి కన్నా భిన్నంగా చైనా చంద్రునిపై అనేక వినూత్న ప్రయోగాలు చేసింది. చైనా 2013లో డిసెంబర్‌ 14న ఛాంగే 3 పేరు గల ఒక లాండర్‌ను చంద్రునిపై దింపింది. ఆ తర్వాత 2019 జనవరి 3వ తేదిన ఛాంగే 4 లాండర్‌ను, యుతు 2 రోవర్‌ను చంద్రుని ఆవలి భాగంపైకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా చైనా కొన్ని రకాల విత్తనాలు చంద్ర మండలంపై వెదజల్లింది. వీటిలో కొన్ని పత్తి విత్తనాలు మొలకెత్తాయి. కానీ ఆ తర్వాత అవి అభివృద్ధి చెందలేదు. దీనికి చంద్రునిపైన ఉండే అత్యల్ప ఉష్ణోగ్రతలే కారణమని చైనా అంచనా వేసింది. ఆ విధంగా చంద్రుని విత్తనాలు మొలకెత్తించిన దేశంగా చైనా సరికొత్త చరిత్రను తన పేరు మీద రాసుకుంది.
అర్టిమెస్‌ ఒప్పందం ఏం చెబుతుంది…
ప్రపంచంలోని ఏ దేశం కూడా అంతరిక్షంపై యాజమాన్య హాక్కులు పొందే వీలు లేదని, అంతరిక్షంపై జరిపే పరిశోధనలు మానవ సంక్షేమానికి దోహద పడే విధంగా ఉండాలని ఐక్యరాజ్యసమితి 1967లో ఒక తీర్మానం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, అంతరిక్షంలో వివిధ దేశాలు ఇష్టారాజ్యంగా పరిశోధనలు చేయడానికి అవకాశం ఉండదు. బాహ్య అంతరిక్ష పరిశోధనలు సమస్త మానవాళి ప్రయోజనాలకు లాభకారిగా ఉండాలని ఈ ఒప్పందం చెబుతుంది. వివిధ గ్రహాల మీదకు అడుగుపెట్టిన వారంతా మానవ సమాజం యొక్క దూతలుగా పరిగణించబడతారు. ఎటువంటి విధ్వంసకర ఆయుధాలను, వస్తువులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టకూడదు. అంతరిక్ష పరిశోధనల వల్ల తలెత్తే కాలుష్యాన్ని నివారించడానికి ఆ పరిశోధనలకు పాల్పడిన దేశాలే బాధ్యత వహించాలి. అంతరిక్ష పరిశోధనల్లో ఎంతో కీలకమైన ఈ ఒప్పందంపై అమెరికాతో సహా 27 దేశాలు సంతకాలు చేశాయి. కానీ రష్యా, చైనా దేశాలు మాత్రం ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.
అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర దేశంగా భారత్‌
అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తున్న విజయ పరంపర ప్రపంచ దేశాలన్నింటిలోను భారత్‌ను అంతరిక్ష పరిశోధనల్లో అగ్ర దేశంగా నిలబెడుతుంది. అవమానాలతో ప్రారంభమైన భారతీయ అంతరిక్ష పరిశోధనా ప్రస్ధానం నేడు అద్వితీయంగా వెలుగొందుతుంది. భారతదేశం తొలినాళ్లలో అంతరిక్ష పరిశోధనలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. తుంబాలో రాకెట్‌ లాంఛింగ్‌ స్టేషన్‌కి సైకిల్‌ మీద రాకెట్‌ను మోసుకువెళ్లే స్ధాయి నుండి ఒకేసారి 104 ఉపగ్రహాలున్న అంతరిక్షంలోకి మోసుకుపోయే వ్యోమనౌకల్ని తయారు చేసే స్ధాయికి ఎదిగింది. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక భారత అంతరిక్ష పరిశోధనలను, శాస్త్రవేత్తలు వెక్కిరిస్తూ ఒక వెకిలి కార్టూన్‌ని ప్రచురించింది. అదే న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక భారత్‌ అంతరిక్ష పరిశోధనలో అతి గొప్ప విజయం సాధించిందని పొగిడే స్ధాయికి భారత అంతరిక్ష పరిశోధనా రంగం ఎదిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ 12 దేశాలకి పైగా సుమారు 144 ప్రయోగాలు చేశాయి. కానీ ఏ ఒక్క దేశం కూడా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపలేకపోయింది. ప్రపంచంలోనే మొదటిసారి చంద్రుని పైకి కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించిన రష్యా కూడా చంద్రుని దక్షిణ ధృవం పైన కాలు మోపలేక పోయింది. సరిగ్గా రష్యా విఫలమైన రెండు రోజుల తర్వాత భారత్‌ తన కీర్తి పతాకను చంద్రుని దక్షిణ ధృవం మీద విజయ వంతంగా ఎగుర వేసింది. ఇది అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. భారతీయ వైజ్ఞానిక రంగం సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన సందర్భమిది. అవమానించిన దేశాలను వెనక్కి నెట్టి అంతరిక్ష పరిశోధనలలో ఆధిపత్యశక్తిగా ఎదిగిన తరుణమిది.
భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు. వారి కష్టమే ఏ రంగంలోనైనా పెట్టుబడి. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో చేపడుతున్న ఇటువంటి ప్రయోగాల ద్వారా లభించిన అవకాశాలు ప్రజలందరికీ దక్కాల్సిన అవసరముంది. భారతదేశం ప్రధానంగా చంద్రునిపైన ఉన్న సహజ వనరుల అన్వేషణ, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, మానవ ఆవాసయోగ్యమైన స్థితి గతులను అధ్యయనం చేయటమే లక్ష్యంగా మిషన్‌ చంద్రయాన్‌ ప్రయోగాలను చేపడుతుంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే కలిగే ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహనను దేశంలో సామాన్య ప్రజలకి సైతం వివరించాల్సిన బాధ్యత ఇస్రో వంటి సంస్ధలతో పాటు, ప్రభుత్వాలపైన కూడా ఉంది. చంద్రయాన్‌ 3 విజయం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలో మానవ సహిత వ్యోమనౌకల్ని చంద్రుని మీదకు పంపించడానికి భారత్‌ సిద్ధమవుతుంది. ఇదే తరుణంలో అటు శాస్త్రవేత్తల నుండి సామాన్యుల వరకు అనేక సందేహాలు వెలిబుచ్చుతున్నారు. విజయాల అనంతరం సాధించబోయే ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని, ఇప్పటి వరకూ ఆ సంస్ధలకి అలాంటి స్పష్టమైన అవగాహాన లేకపోవటం ఒక లోపమని, భారతీయులని అంతరిక్షంలోకి ఎందుకు పంపాలనుకుంటుందో కూడా ఇస్రో దగ్గర సమాధానం లేదని ఆ సంస్ధ మాజీ డిప్యూటీ డైరక్టర్‌ ఆరూప్‌ దాస్‌ గుప్తా పత్రికాముఖంగా వెలిబుచ్చిన సందేహాలే ఇప్పుడు ఈ దేశంలోని అధిక శాతం మంది ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ సందేహాలకి త్వరలో ఇస్రో సమాధానాలు చెబుతుందని ఆశిస్తూ, ఇప్పటికైతే ఇస్రో సాధించిన విజయాలను మనసారా అభినందిద్దాం. సాహో… ఇస్రో, జయహో… భారత్‌.

– డా|| కె. శశిధర్‌, 94919 91918

Spread the love