ప్రాణాలతో తిరిగొస్తామనుకోలేదు

ప్రాణాలతో తిరిగొస్తామనుకోలేదు(అడ్వెంచర్‌ ట్రావెలర్‌ కడప నాగిరెడ్డి గారితో ముఖాముఖి)
సోషల్‌ మీడియా అరచేతిలో ఒదిగిపోయాక అలవాట్లను, వ్యాపకాలను బయటి ప్రపంచంతో పంచుకొనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. కొందరు మరో ముందడుగు వేసి ట్రావెల్‌ వ్లోగ్స్‌ చెయ్యడమే జీవితంగా మారిపోయింది. వారిలోఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టినవాళ్ళు ఉన్నారు. బడి ముఖం చూడనివారు కూడా ఉన్నారు. సహజంగా చేసే విదేశీ ట్రావెల్‌ వ్లోగ్స్‌, విలేజ్‌ ట్రావెల్‌ వ్లోగ్స్‌ లాంటివి కాకుండా అడ్వెంచర్‌ ట్రావెల్‌ వ్లోగ్స్‌ చేసే ‘యువ’ యూట్యూబర్స్‌ ట్రెండ్‌ ని సెట్‌ చేస్తున్నారు. అలాంటివారిలో కడప నాగిరెడ్డి ఒకరు. ప్రాణాంతకమైన అడవిలో చిమ్మచీకటితో నిండి ఉండే గుహలను వెలికి తీయడమే ప్రధానంగా సాగిన ఈ యూట్యూబర్‌ ప్రయాణాన్ని అతడి మాటల్లోనే తెలుసుకుందాం.
మొదటగా ఈ యూట్యూబ్‌ ఛానల్‌ (@kadapanagireddy) పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది?
నిజానికి యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాలన్న ఆలోచనేదీ నాకు లేదు. సేవ ద్వారా కొత్తగా పరిచయమైన ఆర్‌.బి.వెంకటరెడ్డి, శివశంకర్‌ రెడ్డి అన్నలు ఎక్కడైనా కొండల్లో ఉన్న దేవాలయాలకు వెళ్తే నన్ను రమ్మనేవారు. నేనూ వెళ్లేవాణ్ని. అది గమనించిన మిత్రుడు రాజాకుమార్‌ ఎలాగో అక్కడక్కడ తిరుగుతున్నావు కదా ఒక ఛానల్‌ పెట్టుకో అనేసి వాళ్ళ తమ్ముడితో ఒక ఛానల్‌ క్రియేట్‌ చేసి ఇచ్చాడు. ఛానల్‌ అయితే క్రియేట్‌ చేశా కానీ నేను చేస్తున్న పనికి నాకు కుదరడం లేదు. వీడియో ఎడిటింగ్‌ చేతకాదు. టాక్స్‌ ఇవ్వడం ఇదంతా నాకు చాలా తలనొప్పి అనేసి దాదాపు రెండు నెలలు వీడియోలు పెట్టలేదు. తర్వాత కరోనా లాక్‌డౌన్‌లో ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి. ఖాళీగా ఉన్నా కదా అనేసి కొందరి పిల్లలను పట్టుకొని కామెడీ వీడియో చేశాను. పెద్దగా రీచ్‌ కాలేదు. తర్వాత కొందరి వీడియోలు చూశాను. దేవాలయాలు, గుహలు వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేస్తున్నారు. నేను కూడా ఇలాగే చేస్తే బాగా చూస్తారేమోననే ఉద్దేశంతో చిన్నగా దేవాలయాలు తీయడం మొదలు పెట్టాను. సరదాగా మొదలు పెట్టింది ఇక్కడిదాకా తీసుకొచ్చింది.
కుటుంబ నేపథ్యం?
మాది కడప జిల్లా, దువ్వూరు మండలం, గొల్లపల్లె గ్రామం. వ్యవసాయ కుటుంబం. అమ్మ నాన్నలకు (పిప్పళ్ళ గంగిరెడ్డి-నారాయణమ్మ) మేము ముగ్గురం అన్నదమ్ములం. అందులో నేను చివరివాణ్ణి. నాలుగో తరగతి వరకే చదువుకున్నా. ఆ తరువాత బీరువాల రిపేర్‌ చేయడం ఎన్నో ఇబ్బందులు వచ్చినా, కష్టమైనా నేర్చుకున్నాను. కరోనా కాలంలో నాయన చనిపోయారు. ఒకవైపు ఉన్న కొద్దిపాటి వ్యవసాయభూమిలో సేద్యం చేస్తూ మరోవైపు బీరువాల రిపేర్‌ చేస్తుంటాను.
ఈ విధమైన ట్రావెల్‌ వ్లోగ్స్‌ చేయడానికి స్ఫూర్తినిచ్చినవారు?
అప్పట్లో నేను విలేజ్‌ విహారి ఛానల్‌ బాగా చూసేవాడిని. నేను కూడ ఇలా చేయాలి అనుకునేవాడిని. అప్పటికి కూడా నేను గుహల వీడియోలు తీయాలంటే చాలా భయపడేవాడిని. కానీ ధైర్యం చేయకపోతే మనం ఇలాగే నిలబడిపోతామనే ఉద్దేశంతో ధైర్యం చేసి మొదటి వీడియోనే చాలా కష్టపడి చేశాను. లోపలికి వెళ్లాలంటే పడుకొనే వెళ్లాలి.. అలా ఆ గుహాను వీడియో తీశాను. దానికి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది.
సులువైన యాత్రలు కాకుండా కఠినతరమైన అడ్వెంచర్‌ ట్రావెల్‌ వ్లోగ్స్‌ చేయడం వెనుకున్న ఉద్దేశం?
రెగ్యులర్‌ యాత్రలు చాలామంది చూపిస్తున్నారు. అందుకే బయట ప్రపంచానికి తెలియని గుహలు చాలా ఉన్నాయి. అవన్నీ చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గుహల కంటెంట్‌ వెతుకున్నాను. అవే నాకు మంచి రెస్పాన్స్‌ తీసుకొచ్చాయి.
ఎలుగుబంటి, కొండచిలువలు వంటి విషసర్పాలున్న గుహాలలోకి ప్రాణాలకు తెగించి వెళ్తున్నప్పుడు భయం వెయ్యదా?
చాలా భయం ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి అన్ని సర్దుకొని కొండల్లోకి వెళ్లేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఒక్కోసారి సాయంత్రం కూడా అవుతుంది. ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా వెళ్లినా అక్కడికి వెళ్లాక గుహలోకి వెళ్లాలంటే చాలా భయం వేస్తుంది. అక్కడే చాలా టైం పడుతుంది. ముందు లోపలికి వెళ్లి ఏమైనా జంతువులు, పాములు ఉన్నాయా అని చూసుకోవాలి. తర్వాతనే వీడియో మొదలు పెడతాను. కొన్ని సందర్భాలలో పాములు కూడా కనిపించాయి. అవి కూడా వీడియోలో చూపించాం. ఎక్కడి నుంచి ప్రమాదం ఉందనిపిస్తే అక్కడి నుంచి వెనక్కి రావడమే.
ఈ వీడియోలు తీస్తుంటే కుటుంబ సభ్యులు వారించలేదా?
ఫ్రెండ్స్‌, బంధువులు వీడికి ఏం పనీపాటా లేదు. సోయ్యం పట్టినాడు అని వాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి యాడికి (అనంతపురం) దగ్గర ఉన్న గుహల్ని వీడియో తీయడానికి చాలా ఖర్చు చేసుకొని అక్కడికి వెళ్ళాం. అక్కడ చూస్తే గుహలో నీళ్లు ఉన్నాయి. మేం వాటర్‌ వుంటయని తెలీక వీడియో తీసుకుందామని అక్కడికి వెళ్ళాం. నాతో వచ్చినవారు కూడా చాలా భయపడ్డారు. వాటర్‌ చూసి వీడియో తీయకుండా వెనక్కి వెళితే ఎలా? చాలా ఖర్చు చేసుకొని ఇంత దూరం వచ్చాను కదా అనుకున్నాను. నాతో వచ్చిన వారికి ధైర్యం చెప్పి ఎలాగైనా వాటర్‌లోకి వెళ్లి వీడియో తీయాలని నిర్ణయించుకున్నాను. ఆ వాటర్‌ చూస్తేనే గుండెలు ఆగిపోతాయి. మనకు దాదాపు భుజాల లోతు నీళ్లలో కిలోమీటర్‌ వరకు వెళ్లి షూట్‌ చేశాం. ఆ వీడియో చేస్తున్నప్పుడు ప్రాణాలతో తిరిగొస్తా అనుకోలేదు. దాన్ని అప్లోడ్‌ చేసినాక, చూసి ప్రతి ఒక్కరు ‘నీకేం పోయే రోగం రా, చచ్చిపోతావు అలాంటి గుహలలోకి వెళితే’ అని తిట్టారు. కొత్త ప్రదేశాన్ని చూపాలన్న యావలో మాకు ఇవన్నీ పెద్ద కష్టమనిపించలేదు.
వీటిని చిత్రీకరించడంలో మీరు ఏ విధమైన సాంకేతికత (Technology) వాడుతారు?
నేనేం పెద్దగా వాడింది లేదు. ఐదు లక్షల సబ్‌స్రైబర్స్‌ వరకు సాధారణ ఫోను మాత్రమే వాడిన. ఇప్పటికీ కూడా మొబైల్‌ తోనే తీస్తున్న వీడియోస్‌. కొన్ని గుహల్లోకి వెళ్లడానికి లైట్లు కూడా ఉంటాయి. ఇప్పటివరకు ఎలాంటి సేఫ్టీ తీసుకోకుండానే అడ్వెంచర్‌ వీడియోలు చేశాను. ఎందుకంటే అప్పుడు డబ్బులు వచ్చేవి కాదు. అందుకే ఏం కొనలేదు. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా కొద్దిగా అయినా. ఇక మీదట సేఫ్టీ వస్తువులు తీసుకోవాలనుకుంటున్నాను.
ఎక్కువగా ఏ ప్రాంతానికి చెందిన అంశాలు కవర్‌ చేశారు?
రాయలసీమలోని కడప ప్రాంతంలో ఎక్కువగా తీశాను. ఇంకా చాలా ఉన్నాయి. మనకు బయటపడని వాటి కోసం కూడా వెతుకులాట జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ‘మా ప్రాంతంలో కూడా గుహలున్నాయి రండి ‘ అని కొందరు పిలుస్తున్నారు. తప్పకుండా అన్ని ప్రాంతాలు తిరిగి బయటి ప్రపంచానికి తెలియని వాటిని చూపించాలని ఉంది. త్వరలోనే విస్తారంగా ప్రయాణిస్తాను.
సహజంగా ఏర్పడిన గుహాలేనా? నివాసానికి అనుగుణంగా మనుషులు చేసిన గుహలు కూడా ఉన్నాయా?
నేను తీసిన వాటిల్లో సహజంగా ఏర్పడిన గుహలున్నాయి. కొన్ని మనుషులు తవ్విన గుహలున్నాయి. మనుషులు తవ్విన గుహలంటే కొందరు ఆశకు హద్దులేని మనుషులు ఉంటారు కదా. బంగారు నిధుల కోసం తవ్వకాలు జరిపిన గుహలయితే చాలా చూశాను. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. జంతువులు తవ్వితే చిన్న గుంతలుంటాయి. మనుషులు అయితే పెద్ద గుంతలు తీసి పక్కన పోసిన మట్టి కుప్పలుంటాయి. ఇవన్నీ మనుషులు తీశారని మనం చూస్తూనే చెప్పగలం. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి.
ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా గుర్తించాల్సిన గుహాలు ఏవైనా ఉన్నాయా?
మూడు దశాబ్దాల క్రితం కడప జిల్లాలో వున్న భూ బిలం గురించి రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసి ప్రపంచానికి పరిచయం చేశారు.
మైదుకూరు – పోరుమామిళ్ల మధ్యలో దూదమ్మ కోన నుండి 18 కి.మీ. అడవిలోకి వెళ్లాలి. అక్కడ ఒక పెద్ద కొండకు రాక్షసిలా నోరు తెరుచుకొని ఒక బిలం గుహ కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం లోపలికి వెళ్లి చూస్తే… అనిపించింది. అరణ్య శేఖర్‌ అన్నతో కలిసి ఒకసారి ఆ గుహను సందర్శించి వీడియో కూడా తీశాం. ఇలాంటి గుహ ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా మారిస్తే చాలా బాగుంటుంది. ఆ కోవకు చెందినవి చాలానే ఉన్నాయి. నిజానికి వీటన్నింటిని కలిపి ఒక ‘చైన్‌లింక్‌ టూర్‌ ప్లేసెస్‌’ గా ఏర్పాటు చేస్తే, ఈ తరం యువత చాలా చక్కగా ఆస్వాదిస్తారు. మన చరిత్రను కూడా తెలియజేసినట్టు ఉంటుంది.
ఈ విశేషాలను పుస్తకరూపంలో తీసుకువచ్చే ప్రయత్నం ఉందా?
పుస్తకంగా తీసుకురావాలని ఆలోచన అయితే ఇప్పటివరకు లేదు. ఫ్యూచర్లో చెప్పలేం. ఈ ప్రయాణంలో అండగా నిలబడినవారు, భాగస్వాములు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నేను గుర్తుంచుకోవాల్సిన మనిషి ఆర్‌.బి. వెంకటరెడ్డి అన్న. యూట్యూబ్‌ నడక నేర్పించింది ఆయనే. దానికి ఇప్పుడు పది లక్షలకు పైగా చందాదారులు ఉన్నారు. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే అన్న చేసిన సాయమే కారణం. చేసిన మంచిని మర్చిపోకూడదు కదా!
అనాథ శవాలను పూడ్చిపెట్టడం, ఎండాకాలంలో వన్యప్రాణులకు ఆహారం, మంచినీటి కోరత తీర్చడం వంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారని విన్నాం. వారి గురించి?
ముందుగా నేస్తం సేవా సంస్థ అనే సంస్థను ఏర్పాటు చేసి అనాథలకు అన్నం పెట్టడం, వంటకు ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు వంట సరుకులు, బియ్యం అందించడం, అలాగే మైదుకూరు పోరుమామిళ్ల మధ్యలో ఘాట్‌ రోడ్డులో, ఎక్కడైనా పల్లెల్లో ఇబ్బంది పెడుతున్న కోతులను బోనులో బంధించి తీసుకెళ్లి అడవిలో వదిలేస్తారు. వాటికి ఎండకాలం వస్తే ఆహారం వుంటుంది కానీ తాగడానికి నీళ్లు వుండవు. ఆ దారిన పోయేవారు కొద్దిగా అందించిన నీళ్లు తప్ప, ఆ చుట్టుపక్కల ఎక్కడా తాగడానికి నీళ్లు దొరకవు. అది ఆలోచించి వాటికి ప్రతి సంవత్సరం ఎండకాలం నీటి తొట్లను ఏర్పాటు చేసి ఆ జీవులకు నీటిని అందేలా చేస్తుంది మా టీం.
ఫస్ట్‌ లో రెండు, మూడు అనాథ శవాలను మోసినప్పుడు వాళ్లు వీళ్లు చూసి మా నాయనకు చెప్పారు. ‘నువ్వు ఏందిరా శవాలు మోసుకుంటున్నావు. పిల్లని కూడా ఇవ్వరు… ఇంకోసారి ఇలా చేస్తే ఇంట్లోకి రానీయను నా కొడకా’ అన్నాడు. వాళ్లని బాధపెట్టడం ఇష్టంలేక అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోస్‌ కొన్ని రోజులు సోషల్‌ మీడియాలో పెట్టడం మానేశాను. కానీ నేను ఆ పని మానలేదు. మా నేస్తం సేవా సంస్థ సభ్యులు, వెంకటరెడ్డి, కొండారెడ్డి, ఉపేంద్ర కుమారు, రాజాకుమార్‌, విజరు కలిసి ఆ పని చేసేటోళ్లం.
మొదట్లో రోడ్డు పక్క చనిపోయిన అనాథల అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నాను. కరోనా భయంతో అందరూ ఉన్నా అంత్యక్రియలు చేసుకోవాలంటేనే చాలా భయంతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో మేం ముందుకు వెళ్లాం. తర్వాత మా నాయన చూసి వీడు ఎంత చెప్పినా వినడులే అనేసి వదిలేశాడు. ఇప్పటికీ అనాథ శవాలను మోస్తూనే ఉన్నాను. మా భార్య ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా శవం మోసాను. తను భార్యలా కాకుండా అమ్మలా ప్రతి విషయంలోనూ సపోర్ట్‌ చేసింది.
కొత్తగాInto the nature టీంలో ఉన్నారు కదా! మీకు ఎలా అనిపిస్తుంది?
నిజంగా వాళ్ల టీంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వివేక్‌ లంకమల, అరణ్య శేఖర్‌ అన్నలతో తిరిగిన అడవులు, చూసిన ప్లేసులు జీవితంలో నేనైతే చూడలేదు. అంత అద్భుతంగా వాళ్లతో తిరిగి చూశాను. వివేక్‌ లంకమల అన్న పొట్టేలు కథ రాసినప్పుడు అన్నను చూశా. ‘నో ప్లాస్టిక్‌ లంకమల’తో టీం అందరినీ కలిశాను. టీంలో నేను ఉండడం సంతోషంగా ఉంది. ఇంకా పెద్దాయన సునీల్‌, రామచంద్రారెడ్డి, శివానందరెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. into the nature best team..
– మహేష్‌ బోగిని,
8985 202723

Spread the love