రిపీట్‌ సాంగ్‌…

రిపీట్‌ సాంగ్‌...కష్టాలు పన్నెండు కామాలు దాటి
ఒక సుదీర్ఘ ఫుల్‌ స్టాప్‌ దగ్గర నిలిచి
కొత్త సంవత్సరం సంతోషం
పట్టుకు వస్తుందని
మళ్ళీమళ్ళీ ఆశ పడుతోంది ఎప్పటి లాగే

ఏ పథకం లో అయినా
తన పేరు చేరుతుందని
ముడుపులు కడుతున్నాయి
తెల్ల రేషన్‌ కార్డులు ఈ సేవ గడపకు
కార్డు లేని వాళ్ల ప్రార్థన ఒక్కటే
కొత్త సంవత్సరం కొత్త రేషన్‌ కార్డు తెస్తే చాలు

క్యాలెండర్‌లు మారుతాయి
కొన్ని శెలవులు అటు ఇటుగా మార్పు
తుమ్మితె వూడి పోయె వుద్యోగాలు
గ్యారంటీ లక్ష్యాలు పెట్టు కోలేక
మద్య తరగతి తేలిక పాటి కోరికలను
కొత్త సంవత్సరం కురుస్తుంది అని ఆశిస్తూ

పశ్చిమ పండుగలను ఫాలో కాకపోతే
అవుట్‌ ఆఫ్‌ ట్రెండ్‌ అవుతామనీ
కిట్టీ పార్టీలు ఛీర్స్‌ చెప్పు కుంటాయి
కొత్త సంవత్సరం కొత్త కిక్కులు తేవాలని
వున్నత వర్గం వినూత్న ప్రణాళికలు
ఫామ్‌ హౌస్‌లు అన్నీ ఫుల్‌గా చీకట్లో

సముద్రాలు ఎండి పోనట్లు
సగటు మనిషి ఆశలు ఆవిరి కావు
ప్రతి సంవత్సరం పాత పాట రిపీట్‌
హాపి న్యూ ఇయర్‌ హాపి న్యూ ఇయర్‌
– దాసరి మోహన్‌, 9985309080

Spread the love