జస్టిస్ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-హిమాయత్ నగర్
సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు ఒక కీలక అడుగు అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు సదస్సును ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేసి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో బీసీలకు 42 శాతం బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని, సామాజిక సృహ కలిగిన వ్యక్తినన్నారు. దేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. 1961 జనాభా లెక్కలు తీసుకొని రిజర్వేషన్లపై పరిమితి పెట్టారని, అప్పటికి ఇప్పటికి జనాభాలో సామాజిక అంశాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు.
వాటిని పరిగణలోకి తీసుకొని, న్యాయస్థానాలు వ్యవహరించాలని కోరారు. సామాజిక న్యాయం కోసం దేశం మొత్తం తిరుగుతున్న రాహుల్ గాంధీని ప్రజలు అర్థం చేసుకోవడం లేదన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వి.పి.సింగ్ బీసీల రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేస్తే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనువాదులు కమండలం యాత్ర చేపట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్‌లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు. టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడు తూ 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల 42 శాతం రిజర్వేషన్లకు రక్షణ కాకపోవచ్చునని, కానీ ప్రస్తుత వివాదాలకు ముగింపు పలకవచ్చన్నారు. జనవరిలో సీఎం ఎ.రేవంత్ రెడ్డితో సహా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



