హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 పరిశ్రమను ఎత్తివేయాలి
కాలుష్య వ్యతిరేక పోరాట రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన
దోమడుగు నుంచి బొంతపల్లి ప్రధాన రహదారిపై ర్యాలీ
నవతెలంగాణ-గుమ్మడిదల
వ్యర్థ రసాయనాలతో నల్లకుంటను ఎర్రకుంటగా మార్చిన హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 పరిశ్రమను వెంటనే ఎత్తివేయాలని దోమడుగు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య వ్యతిరేక పోరాట రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం దోమడుగు పురవీధులతోపాటు బొంతపల్లి కమాన్ ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బాబురావు మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలతో వివిధ పార్టీల నాయకులు అధికారులు వాళ్ళు ఇచ్చిన తాయిలాలకు తలొగ్గి సామాన్య ప్రజలకు జరుగుతున్న ముప్పును పట్టించుకోవడం లేదన్నారు. ఎందరో పర్యావరణ ప్రేమికులు గ్రామాన్ని సందర్శించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించడంలో అలసత్వం వీడాలన్నారు. పరిశ్రమ యాజమాన్యాలు ఇస్తున్న నజరానాలకు తలొగ్గకుండా గ్రామీణ ప్రజల ప్రాణాల ముప్పును పరిగణనలోకి తీసుకొని వెంటనే సంబంధిత అధికారులు రసాయన వ్యర్ధ జలాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే నల్లకుంటను పరిశీలించి సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



