ఎలాంటి బంధుత్వాలూ లేవు.. ఫ్రీ బర్డ్‌నీ…
సొంత బావ ఫోన్‌నే ట్యాప్ చేస్తారా?
ఎవరినైనా ఎదిరిస్తా.. ఎవరి తప్పులైనా ఎండగడతా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘కొందరు నన్ను వారి బాణం, వీరి బాణం అంటున్నారు. నేను ఎవరి బాణాన్నీ కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు తాను, తన శ్రేణులు వచ్చాయని చెప్పారు. తన భర్త.. అందు లోనూ తన సోదరుడికి బావ అని చూడకుండా ఫోన్లు ట్యాప్ చేశారంటూ కుటుంబసభ్యులను విమర్శించారు. తనకెలాంటి బంధుత్వాలూ లేవని, తానిప్పుడు ఫ్రీ బర్డ్‌నని చెప్పుకొచ్చిన ఆమె రాష్ట్ర రాజకీయాలపైనా, ప్రజల సమస్యలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న జాగృతి జనంబాట కార్యక్రమం శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలో కచ్చితం గా రాజకీయ శూన్యత ఉందని కవిత అభిప్రాయ పడ్డారు. కొన్ని పార్టీలను నమ్ముకొని దగాపడ్డామని ప్రజలు తనతో చెబుతున్నారని తెలిపారు. ‘జాగృతి జనంబాట’ పూర్తయిన తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. స్కూల్స్, కాలేజీ యాజమా న్యాల ఆందోళనకు మద్దతుగా ఉండి, విద్యార్థులు నష్టపోకుండా పోరాటం చేస్తామని తెలిపారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సరైన పోరాటం చేయలేదని విమర్శించారు. కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా మీద పోరాటం చేస్తానని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు దృష్టి పెట్టాలని కోరారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మెన్‌ను మరోసారి కోరతానని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ సమయం కోరడం అంటే, ఈ విషయాన్ని సాగదీసే ప్రయత్నం లో ఉండడమేనని విమర్శించారు. సమావేశంలో జాగృతి రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ సహా జిల్లా నాయకులు పాల్గొన్నారు.
నేను.. తెలంగాణ ప్రజల బాణాన్ని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



