కార్మిక హక్కుల సాధనకు ఏకమవ్వాలి : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. 28వ తేదీన జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 1957లో ఉమ్మడి రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడిందని అన్నారు. ఈ 68 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. సొసైటీలు, టీఎఫ్‌టీలు, పెన్షన్, ఎక్స్‌గ్రేషియా లాంటి హక్కులు సాధించుకున్నామన్నారు. కల్లు గీత వృత్తిపై రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వారి సమస్యలపై పాలకులు దృష్టి పెట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.
అధికారులకు, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ.4000, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని కోరారు. ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా వెంటనే విడుదల చేయాలని, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలపై పోరాటాల రూపకల్పనతో పాటు గత మూడేండ్లలో చేసిన ఉద్యమాలపై సమీక్షించుకునేందుకు ఈ మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, సంఘం జిల్లా కార్యదర్శి పల్చ మల్సూర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోలిశెట్టి యాదగిరిరావు, వికలాంగుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వీరబోయిన వెంకన్న, మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో 28న కల్లుగీత కార్మికుల రణభేరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



