Tuesday, November 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజియువజన గొంతుక డివైఎఫ్‌ఐ

యువజన గొంతుక డివైఎఫ్‌ఐ

- Advertisement -

భారత స్వాతంత్య్ర ఉద్యమస్పూర్తితో భగత్‌సింగ్‌ లాంటి వీరుల ఆశయ వారసత్వంతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ఆవిర్భవించింది. 1980లో పంజాబ్‌లోని లూథియానాలో నవంబర్‌ 1,2,3 తేదీల్లో జరిగిన సమావేశాల్లో మహాసభలను నిర్వహించుకుని 3న అన్ని రాష్ట్రాల యువజన సంఘాలను ఇముడ్చుకొని విస్తృత సంఘంగా ఏర్పడింది. పదిహేను లక్షల యువత సభ్యత్వంతో ప్రారంభమైన సంఘం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పుడు కోటి యువజనుల సభ్యత్వంతో సాగుతోంది. ఎక్కడైతే సంఘం పురుడుపోసుకుందో అక్కడే పంజాబ్‌లో నేడు పన్నెండవ మహాసభలను జరుపుకుంటోంది. ”అందరికి విద్య -అందరికి ఉపాది’ అనే నినాదంతో అన్ని రాష్ట్రాల్లో అనేక పోరాటాలు నిర్వహించింది. ప్రజాస్వామ్య హక్కులకై నిలబడి హక్కులడిగితే రావు పోరాడి సాధించాలని యువతను చైతన్యం చేస్తోది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యతో పాటు కార్మికులు కర్శకులు చేస్తున్న పోరాటాలకు మద్దతిస్తోంది. 45 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో దేశ సమైక్యతా, సమగ్రత కోసం ఎన్నో త్యాగాలు చేసింది.

కశ్మీర్‌ సమగ్రత కోసం, పంజాబ్‌, అస్సాం విభజనవాదులను ,ఉగ్రవాదులను కూడా ఎదుర్కొంది. యువత ఉగ్రవాదం వైపు మరలకుండా శాయశక్తులా ప్రయత్నించింది. అనేకమంది యువకార్యకర్తలు హత్య గావింపబడ్డారు. ఆ క్రమంలోనే ”మా దేహం ముక్కలైనా – దేశాన్ని ముక్కలు కానివ్వం” అనే నినాదం ఇచ్చింది.దేశ సమైక్యత కోసం పాటుపడుతోంది.మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరంతర పోరాటం చేస్తోంది. సామ్రాజ్యవాద దేశాల పెత్తనాన్ని, యుద్దోన్మాదాన్ని వ్యతిరేకిస్తోంది. ఒకవైపు యువజనుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే మరోవైపు విస్తృతంగా సేవా కార్యక్రమాలు, రక్త దాన శిబిరాలు, మెడికల్‌ క్యాంపులు, శ్రమదానాలు నిర్వహిస్తోంది. మట్టిలో మాణిక్యాలైన గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికై క్రీడాపోటీలను నిర్వహిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతోంది. యూత్‌ ఫెస్ట్‌, కల్చరల్‌ ఫెస్ట్‌ లు పెట్టి యువతను ముందుకు నడిపిస్తోంది డివైఎఫ్‌ఐ.

రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసి యువతకు అండగా నిలబడి ఉద్యోగాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని , అవినీతి అంతం కావాలని ఉద్యమాలు నిర్వహించింది.సమాజంలో జరుగుతున్న అవినీతి ,అక్రమాలపై ”అవినీతి అంతం -డివైఎఫ్‌ఐ పంతం ”అని నినదిస్తూ పెద్దయెత్తున ఆందోళనలు మన రాష్ట్రంలో జరిగాయి. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలను ,ఆదర్శ వివాహాలను ప్రోత్సహించింది. కులదూరహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహిస్తూ కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికీ రక్షణ చట్టాలు చేయాలని ఉద్యమిస్తోంది. గ్రూప్స్‌,డిఏస్సీ, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగ యువతని సమీకరించి దశల వారి ఉద్యమాలను చేపట్టింది. ర్యాగింగ్‌ను వ్యతిరేకించినందుకు నల్గొండలో ఈశ్వర్‌ ప్రాణాలు కోల్పోయాడు.గూండాయిజాన్ని ఎదిరించినందుకు కుసుమ రఘునాథ్‌, రామ సురేందర్‌లు, జిల్లా రామస్వామి వరంగల్‌లో హత్యగావింపబడ్డారు.పేదల తరపున ఇండ్ల కోసం పోరాడినందుకు అంతయ్య ,రహీం మహబూబ్‌ నగర్‌లో, మహ్మదాపురం మారెల్లి కుమారస్వామి ప్రాణత్యాగాలు చేశారు.

ఉమ్మడి రాష్ట్ర మూడవ మహాసభల ఏర్పాట్లలో నిమగమై ఉండగా కాంగ్రెస్‌, బీజేపీ గుండాల చేతిలో రంగారెడ్డి జిల్లా వీరులు పాషా, నరహరి హత్యకు గురయ్యారు. నర్సింహులు గూడెం ముద్దుబిడ్డ బొంత శ్రీనివాస్‌రెడ్డిని పేద ప్రజల కోసం పనిచేస్తున్నందుకు కాంగ్రెస్‌ గుండాల చేతిలో హతమయ్యాడు. ఇలా అనేకమంది యువత సమస్యలపై పోరాడి ,వారి కోసం తమ ప్రాణాలను బలిచ్చారు. అమరవీరుల ఆశయాల సాధనకై ఉద్యమాలను బలోపేతం చేస్తూ ముందుకెళ్తోంది. గ్రామాల్లో, బస్తీల్లో శ్రమ దానాలు చేస్తూ పరిశుభ్రతకు పాటుపడుతూ సమాజం పట్ల యువత బాధ్యతను గుర్తుచేస్తోంది డివైఎఫ్‌ఐ.

పర్యావరణ పరిరక్షణకై నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ‘సేవ్‌ నల్లమల’ క్యాంపియన్‌ గల్లీ నుండి ఢిల్లీ దాకా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించింది. రాష్ట్రంలో మొక్కలు నాటి పర్యావరణ రక్షణకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. ‘వారసులకు ఆస్తులివ్వకపోయినా పరవాలేదు ఎలాగోలా బతికేస్తారు కానీ ఆక్సిజన్‌ ఇవ్వకపోతే బతకలేరు’ అనే నినాదంతో నిరంతర ప్రకృతి పరిరక్షణకు యత్నిస్తుంది. చెడువ్యసనాల బారిన పడకుండా గంజాయి, డ్రగ్స్‌,మాదక ద్రవ్యాలను నిర్ములించాలని రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ యాత్రలు, అవగహనా సదస్సులు, ర్యాలీలు నిర్వహించి యువతను చైతన్యవంతం చేస్తోంది డివైఎఫ్‌ఐ. యువజనోద్యమ పోరాటాల సారథి డివైఎఫ్‌ఐ చేసే పోరాటాల్లో యువత భాగస్వాములవ్వాలి. అందరికి విద్యాఉపాధికై ఉద్యమించాలి.

  • ఆనగంటి వెంకటేష్‌, 9705030888
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -