Tuesday, November 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఫీజుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఫీజుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

- Advertisement -

బెదిరింపులతో ఆందోళనలను ఆపలేరు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు
మంత్రుల నివాస సముదాయాల ముట్టడి.. ఉద్రిక్తత
విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
జిల్లాల్లో ఎమ్మెల్యేలకు వినతులు

నవతెలంగాణ – బంజారాహిల్స్‌
విద్యార్థుల ఫీజులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడటంతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాల వద్ద సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రుల నివాస సముదాయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజులు ఇవ్వకుండా.. రాష్ట్రంలో 15 లక్షల మంది పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లకుండా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కాలంలో రూ.6,300 కోట్లు, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,100 కోట్లు.. మొత్తం రూ.10,500 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలలు, హాస్టల్స్‌ బకాయిలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్స్‌ ఇవ్వడం లేదని తెలిపారు.

విద్యా శాఖకు కనీసం మంత్రిని కూడా కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకొని స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఒక్క నెల వేతనం కూడా పెండింగ్‌లో ఉండవు కానీ విద్యార్థుల ఫీజులను మాత్రం ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే ఫీజులు విడుదల చేయకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులను ఎక్కడికక్కడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్‌, నాయకులు శంకర్‌, కె.అశోక్‌ రెడ్డి, జి.కార్తీక్‌, అవినాష్‌, లెనిన్‌ గువేరా, జూనుగరి రమేష్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల విద్యార్థి నాయకులు నాగేందర్‌, రజనీకాంత్‌, ప్రవీణ్‌, ఆంజనేయులు, కైలాస్‌, చరణ్‌ తేజ, చరణ్‌, లిఖిత్‌, చందు, ఇర్పాన్‌, రేష్వంత్‌, కిషోర్‌, కౌశిక్‌, సాత్విక్‌, అజయ్, సాయి చరణ్‌, శ్రీ ప్రణిత్‌, పవన్‌ పాల్గొన్నారు.

జిల్లాల్లోనూ..
స్కాలర్‌షిప్‌, రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్‌ వినతిపత్రం అంజేశారు. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోనూ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి వినతిపత్రాలు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -