Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాధిత కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

బాధిత కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

- Advertisement -

రోడ్డు పనులు ఇప్పటిదాకా ఎందుకు ఆగాయో బీజేపీ ఎంపీ చెప్పాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
జిల్లా నేతలతో కలిసి ఘటనా స్థలం పరిశీలన.. బాధితులకు పరామర్శ


నవతెలంగాణ- చేవెళ్ల
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని పార్టీ రాష్ట్ర నాయకులు డీజీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగాళ్ల భాస్కర్‌, ఇతర నేతలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. 19 మంది మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. డీజీపీ రెండు రోజుల క్రితమే హత్యలకంటే.. రోడ్డు ప్రమాదాలలోనే ఎక్కువ మంది చనిపోతున్నారని కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 2017లో బీజాపూర్‌ జాతీయ రహదారి పనులకు అనుమతి తీసుకొచ్చారని చెప్పారని, కానీ ఎందుకు రోడ్డు పనులు ఆగిపోయాయని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందని, ఎన్జీటీలో కేస్‌ విత్‌ డ్రా చేయించి పనులు ప్రారంభించే బాధ్యత ఎంపీపై లేదా అని అడిగారు. ప్రమాదాల్లో సామాన్య, పేద ప్రజలు మాత్రమే ఇబ్బందులకు గురవుతున్నారని, కొందరు అనాథలుగా మారుతున్నారని అన్నారు. ఆ కుటుంబాలలోని పిల్లల చదువులను ప్రభుత్వమే భరించేలా చూడాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు కలిపి రూ.7 లక్షలు మాత్రమే అవుతున్నాయని వాటిని 25 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా ఉదయాన్నే వెళ్తున్న టిప్పర్‌కు అనుమతులు ఉన్నాయా లేవా కనుక్కొని చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ రోడ్డును వెంటనే ప్రారంభించి ముందుకు సాగేలా చూడాలని తెలిపారు. ఆయన వెంట పార్టీ చేవెళ్ల డివిజన్‌ కార్యదర్శి అల్లి దేవేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి బేగరి అరుణ్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -