చేవెళ్ల సమీపంలో ఘటన 
బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 
19మంది మృతి 
24 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
బస్సును చీల్చుకుంటూ వెళ్లిన టిప్పర్
కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు
ఆ సమయంలో బస్సులో 72 మంది
మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, భార్యాభర్తలు, తల్లీబిడ్డలు
బాధితులను పరామర్శించిన స్పీకర్, మంత్రులు
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
రెప్పపాటు క్షణంలో ఊహించని ఘటన. ఏం జరిగిందో తెలుసుకొనేలోపే 19 మంది విగతజీవులు అయ్యారు. కంకర టిప్పర్ రూపంలో మృత్యువు వారిని కబళించింది. కూర్చున్న సీట్లోనే కంకర కప్పెయడంతో ఊపిరిరాడక తల్లడిల్లుతూనే తుదిశ్వాస విడిచారు. కాలేజీకని కొందరు.. దవాఖానకు మరికొందరు.. వ్యక్తిగత పనుల మీద ఇంకొందరు.. తాండూర్ నుంచి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. మరో గంటలో గమ్యం చేరేవారే.. ఇంతలోనే ఊహించని ప్రమాదం వారి ప్రాణాల్ని బలితీసుకుంది. 
ఆయా కుటుంబాల్లో మాటలకందని విషాదాన్ని నింపింది. టిప్పర్ బస్సును ఢీకొట్టి, చీల్చుకొని, అదుపుతప్పి పక్కకు ఒరిగిపోవడంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులను కంకర కప్పేసింది. ఏమాత్రం తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. ప్రమాదధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రుల ఆక్రందనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. ఈ దుర్ఘటన హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 
నవతెలంగాణ-చేవెళ్ల
వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు సోమవారం తెల్లవారుజామున 4.40 గంటలకు తాండూర్ నుంచి హైదరాబాద్ బయల్దేరింది. ఉదయం 6.30 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ దాటగానే, మీర్జాగూడ వద్ద షాద్‌నగర్ నుంచి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం చిట్టెంపల్లికి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ వేగంగా బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ క్యాబిన్ చీల్చుకుంటూ ఐదు సీట్ల వరసలపై అడ్డంగా పల్టీ కొట్టింది. టిప్పర్‌తోపాటు అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో పడటంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. వేగం ధాటితోపాటు కంకర కమ్మేయడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. 
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో టిప్పర్‌ను వేరు చేశారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను అతికష్టం మీద బయటకు తీశారు. 18 మృతదేహాలను గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న ఓ వ్యక్తి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన 24 మందిని చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి, వికారాబాద్ జిల్లా ఆస్పత్రికి, హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బందితో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను బంధువులు, కుటుంబ సభ్యులకు అందజేశారు. అంత్యక్రియలు నిర్వహించారు. దుర్ఘటన విషయం తెలియగానే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రుల్లో క్షతగ్రాతులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో జేసీబీ పైకి దూసుకురావడంతో చేవెళ్ల సీఐ కాలుకి గాయమైంది.
భారీగా ట్రాఫిక్ జామ్
దుర్ఘటన జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై బస్సు, టిప్పర్ పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సింగిల్ రోడ్డు కావడంతో రవాణా స్తంభించింది. పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టి, టిప్పర్, బస్సును తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు సాగాయి. తీవ్ర ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా మృతి
బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) బస్సు డ్రైవర్. తాండూరు పట్టణానికి వలస వచ్చారు. సుమారు 20 ఏండ్లుగా తాండూరు పట్టణం పాత తాండూరులో నివాసం ఉంటున్నారు. అతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. పదేండ్లుగా ప్రయివేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నడిపిన ఆర్టీసీ అద్దె బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్‌గా చేరాడు. ప్రతి రోజూ ఇదే బస్సు హైదరాబాద్‌కు మొదటి సర్వీసు బస్సుగా వెళుతోంది. సోమవారం మొదటి సర్వీసుగా వెళ్లిన బస్సు ప్రమాదానికి గురికావడంతో అతనికి చివరి సర్వీసుగా మిగిలింది. రెండేండ్ల క్రితం వికారాబాద్ అనంతగిరి సమీపంలో బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫేయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందరినీ కాపాడారు. కానీ సోమవారం జరిగిన ప్రమాదం నుంచి తప్పించలేక తాను కూడా చనిపోయాడు.
బస్సు ప్రమాదంపై సీఎం విచారం 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రగాఢ సానుభూతి : రాష్ట్రపతి ముర్ము
‘బస్సు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’
ప్రాణనష్టం కలిచివేసింది: ప్రధాని మోడీ
‘బస్సు ప్రమాద ఘటనలో పలువురి ప్రాణనష్టం కలిచివేసింది. ఈ క్లిష్ట సమయంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి పీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా అందిస్తాం’
ప్రమాద స్థలాన్ని సందర్శించిన జాన్‌వెస్లీ
ప్రమాద స్థలాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పరిశీలించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడి దైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు 
మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో చేవెళ్ల ఆస్పత్రి ప్రాంగణం గుండెల్ని పిండేసింది. తమ వారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన వారు, మొత్తం ఇంటిల్లిపాదినీ కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి రోదనలతో ఆస్పత్రి వాతావరణం మొత్తం దుఖ:సంద్రాన్ని తలపించింది.
కంకరలో చిక్కుకున్న టీచర్….
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన తొల్కట జయసుధ బంట్వారం గురుకుల పాఠశాలలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పని నిమిత్తం హైదరాబాద్ వస్తున్న క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో టీచర్ కంకరలో చిక్కుకు పోయింది. కంకర మీద పడి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళను స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

 

                                    

