– సైబర్ నేరస్థులకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వరుసగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్థులకు సహకరిస్తున్న ముగ్గురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ గుంటూరుకు చెందిన ఏం.రమేష్‌రెడ్డి, విశాఖప ట్నానికి చెందిన గాంధీ శ్రీను, విజయవాడకు చెందిన జి.శ్రీధర్ సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరస్థులతో చేతులు కలిపారు. కమీషన్లు పుచ్చుకుంటున్న ఈ ముఠా వివిధ బ్యాంక్ అకౌంట్ వివరాలను, ఏటీఏం కార్డులను సైబర్ నేరస్థులకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా అమాయకులను ఎంచుకుంటున్న సైబర్ నేరస్థులు తాము చెప్పిన విధంగా ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సప్ కాల్స్ చేస్తూ వారు సేకరించిన బ్యాంక్ ఖాతాలకు డబ్బులను డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఎం.రమేష్‌రెడ్డి, గాంధీ శ్రీను, జి.శ్రీధర్‌కు కమీషన్లు ఇచ్చి వారి సహాయంతో డబ్బులను విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో గట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ మోసాలపై బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నగర సీపీ సజ్జనార్ ఆదేశాలతో సీసీఎస్ ఏసీపీ శివమారుతి సూచనలతో ఇన్‌స్పెక్టర్ నరేష్ అన్ని కోణాల్లో విచారణ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డెబిట్ కార్డులు, సెల్‌ఫోన్లు, బ్యాంక్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

