విద్యుత్‌ భారాలపై దద్దరిల్లిన కలెక్టరేట్లు

On electrical loads Aggrieved Collectorates– రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యాన ఆందోళనలు
– కాకినాడలో అరెస్టులు, మహిళలనుఅసభ్యపదజాలంతో దూషించిన డిఎస్‌పి
– ప్రయివేటీకరణను తిప్పికొట్టాలి : బివి రాఘవులు
– విద్యుత్‌ సంస్కరణల బిల్లుపై వైసిపి, టిడిపి వైఖరిని స్పష్టం చేయాలి : వి శ్రీనివాసరావు
విజయవాడ : విద్యుత్‌ భారాలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్‌ సర్దుబాబు సర్‌ఛార్జి, అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయవద్దని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌, సిపిఐఎంల్‌ న్యూడెమోక్రసి, ఎస్‌యుసిఐ, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎంపిసిపిఐ (యు) చేపట్టిన ఆందోళనలతో కలెక్టరేట్లు దద్దరిల్లాయి. పలు జిల్లాల్లో ర్యాలీలు జరిగాయి. కాకినాడలో నిరసన తెలుపుతున్న వారిపై డిఎస్‌పి అసభ్యపదజాలంతో విరుచుకుపడడం, బలవంతంగా అరెస్టులకు పాల్పడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నెల్లూరులో కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ విద్యుత్‌ ప్రయివేటీకరణను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారా రైతులు ఉచిత విద్యుత్‌ సాధించుకున్నారని తెలిపారు. విద్యుత్‌ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని పాలకులు చూస్తున్నారని, ప్రయివేట్‌ పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులపై మరింత భారాలు పడతాయని, రైతులకు ఉచిత విద్యుత్‌ అందదని, విద్యుత్‌ రాయితీలు రద్దవుతాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ముఖ్యమంత్రి జగన్‌హన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రజలపై మోయలేదని భారాలు మోపుతున్నారని అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణల బిల్లుపై వైసిపి, టిడిపి తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే ఛార్జీలు తగ్గాలని, కానీ విద్యుత్‌ రంగంలో మాత్రం పెరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌ ఇస్తున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలూ రాజకీయంగా ‘షాక్‌’ ఇస్తారన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కె.ఖాదర్‌బాషా, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, జి.ఓబులేసు, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలోని అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వామపక్ష శ్రేణులపై డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా రెచ్చిపోయారు. నిరసన తెలుపుతున్న వారిలో కొందరిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బలవంతంగా పోలీస్‌ వ్యాన్‌ ఎక్కించి స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో, మిగిలిన వారు ఈ వ్యాన్‌ను అడ్డుకున్నారు. వారిపైనా పోలీసులు జులుం ప్రదర్శించి అరెస్టులకు పాల్పడ్డారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న మహిళా నాయకులపైనా, కార్యకర్తలపైనా దురుసుగా వ్యవహరించారు. త్రీటౌన్‌ సిఐ భగవాన్‌ మహిళలను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులను మొత్తం 25 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. విశాఖలో ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం ధర్నా చేశారు. అనంతరం ఎపిఇపిడిసిఎల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ బి.రాధాకృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాలల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశారు. అనకాపల్లి ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శ్యామలా సెంటర్‌లో, అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద, మదనపల్లెలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట, అనంతపురంలోని పవర్‌ ఆఫీసు వద్ద, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని గణేష్‌ సర్కిల్లో నిరసన తెలిపారు.

Spread the love