పట్టపగలే రోడ్డుకు అడ్డంగా పడుకున్న యువకుడు!
నవతెలంగాణ -పరకాల
పీకల్లోతు వరకు మద్యం సేవించిన ఓ యువకుడు రోడ్డుకు అడ్డంగా పడుకొని హల్చల్ సృష్టించిన ఘటన మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ అజ్ఞాత యువకుడు (సుమారు 25-30 ఏళ్లు ఉంటాయని అంచనా) హుజురాబాద్ రోడ్డులో అలీ రేడియో హౌస్ ఎదురుగా నడిరోడ్డుపైనే యధాలాపంగా పడుకున్నాడు. యువకుడు సరిగ్గా రోడ్డు మధ్యలో పడుకోవడంతో అటుగా వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నడిరోడ్డుపై వ్యక్తి పడుకోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో, చుట్టుపక్కల ప్రజలు, వాహనదారులు కొద్దిసేపు ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. కొందరు అతడిని పక్కకు తీయడానికి ప్రయత్నించినా.. అతను అక్కడి నుండి లేవకపోగా.. నన్ను వీడియో తీయండి అంటూ అడగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని బలవంతంగా రోడ్డు పక్కకు చేర్చడంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. “మందేస్తే బిందాసే అన్నట్టు… ఎక్కడ పడుకుంటే ఏంటి అనుకున్నాడేమో!” అంటూ చుట్టుపక్కల వారు ఆసక్తిగా చర్చించుకోవడం గమనార్హం. పట్టణంలో మద్యం సేవించి ఇలా రోడ్లపై పడుకోవడం ఎంత ప్రమాదకరమో, దీనిపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.



